కదనరంగంలోకి..గులాబీదళం

Tue,September 11, 2018 01:25 AM

-ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌కు 6.15లక్షల సభ్యత్వాలు
-ఉత్సాహంగా క్రియాశీల, సాధారణ సభ్యులు
-రంగంలోకి దింపేందుకు అసెంబ్లీ అభ్యర్థుల ఏర్పాట్లు
(కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ) తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ఇచ్చిన పిలుపు మేరకు గతేడాది చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం అంతటా విజయవంతమైంది. ఉమ్మడి జిల్లా చరిత్రలోనే అత్యధిక సభ్యత్వం చేసిన పార్టీగా రికార్డులకు కెక్కింది. అంతేకాదు, ఏ పార్టీ కూడా దరిదాపుల్లోకి రాని సభ్యత్వాన్ని నమోదు చేసుకొని తన సత్తాను చాటింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 5 వేల క్రియాశీల, 25 వేల సాధారణ సభ్యత్వ నమోదు చేయాలని ఆనాడు పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఆ లెక్కన 13 నియోకవర్గాల్లో 3.90 లక్షల మందిని సభ్యులుగా చేర్చాల్సి ఉంది. కానీ, ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జిలు పార్టీ నిర్దేశించిన దానికన్నా, ఎక్కవగా సభ్యత్వాలు చేయించారు. కార్యకర్తలను, నాయకులను, అభిమానులను రంగలోకి దింపి సభ్యత్వ ప్రక్రియను పూర్తి చేయించారు. ఆ మేరకు జిల్లాలో 1,64,400 క్రియాశీలక సభ్యత్వాలు, 4,50,750 సాధారణ సభ్యత్వాలు మొత్తం 6,15,150 సభ్యత్వాలను పూర్తిచేసి తమ సత్తా చాటుకున్నారు. చేసిన సభ్యత్వాలను కూడా నాడు అన్ని నియోజకవర్గాల పార్టీల ఎమ్మెల్యేలు కంప్యూటరీకరణ చేశారు.

రంగంలోకి దండు..
అసెంబ్లీ రద్దు తర్వాత టీఆర్‌ఎస్ దూకుడు పెంచింది. ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలుంటే, అందులో 12 నియోజకవర్గాలకు ఇప్పటికే తన అభ్యర్థులను ప్రకటించింది. సాధారణం గా గతంలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నుంచి నామినేషన్ల చివరి రోజు వరకు కూడా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చేవి. దీంతో అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకునే అవకాశం ఉండేది కాదు. గతంలో ఉన్న విషయాలను అర్థం చేసుకున్న గులాబీ అధినేత కేసీఆర్.. ఈ సారి ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే కాదు, ఎన్నికలు నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో స్పష్టంగా తెలియకపోయినా అభ్యర్థులను ప్రకటించారు. అంతేకాదు.. సిట్టింగ్‌కు పెద్దపీట వేశారు. ఉమ్మడి జిల్లాలో 11 మందికి అవకావం కల్పించారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో ప్రచార పర్వానికి తెరలేపిన అభ్యర్థులు, గ్రామాల వారీగా క్రియాశీలక, సాధారణ సభ్యులను రంగంలోకి దింపుతున్నారు. తమ వద్దకు పిలిపించుకొని మాట్లాడుతున్నారు. గడిచిన నాలుగేళ్లలో గ్రామాలవారీగా జరిగిన అభివృద్ధి, సమైక్య రాష్ట్రంలో దెబ్బతిన్న విధానాలను వివరిస్తున్నారు. ప్రతి విషయాన్నీ క్షుణ్నంగా తెలిపేందుకు అవరమైన సమాచారాన్ని ఇస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కళ్లముందే కనిపిస్తుండగా, సభ్యులు కూడా రంగలోకి దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అంతేకాదు, అధినేత నిర్ధారించి పంపిన అభ్యర్థులను గెలుపు బాటలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు.

గుండెల్లో గుబులు..
నిజానికి గతేడాది ఫిబ్రవరి, మార్చిలో సభ్య త్వ నమోదు జరిగినప్పుడు మిగతా పార్టీలు పెద్ద గా పట్టించుకోలేదు. కానీ, ప్రస్తుతం అదే సభ్యులను రంగంలోకి దింపేందుకు అభ్యర్థులు సిద్ధమవుతుండగా, ప్రతిపక్షాల గుండెల్లో గబులు రేపుతున్నది. గులాబీ దండు రంగంలోకి దిగితే అసలు ప్రచారం చేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి కనిపిస్తున్నది. మారుమూల పల్లెల నుంచి నగరాలవరకు టీఆర్‌ఎస్‌కు గట్టి క్రియాశీలక, సాధారణ సభ్యులు ఉండగా, ఇతర పార్టీలు వా రిని దాటి ప్రచారం చేయాలంటే నానా తంటాలు పడాల్సి వస్తుంది. అంతేకాదు, టీఆర్‌ఎస్ చేసింది చెప్పుకోవడానికి కళ్ల ముందే అభివృద్ధి కనిపిస్తున్నది. కానీ, ఆ పార్టీలు మాత్రం ప్రజలకు ఏం చె ప్పాలో తెలియని పరిస్థితి ఏర్పడుతున్నది. అసలు ఏ నియోజకవర్గానికి ఏ అభ్యర్థిని ఇస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ వారం పదిరోజుల్లో వచ్చే అవకాశమూ కనిపించడం లేదు. అలాగే మహాకూటమి పేరుతో కొత్త జట్టు కడుతున్న నేపథ్యంలో ఎవరి సీట్లు ఉంటాయో? ఎవరి సీట్లు ఊడుతాయో? తెలియదు. ఈ పరిస్థితులో గులాబీ దళాన్ని తట్టుకోవడం ఎవరితరం కాదన్న అభిప్రాయాలు సర్వ త్రా వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని ఆయా పార్టీల నాయకులు త మ అధినాయకులకు చెబుతుండడం తో గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి.

203
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles