సమరానికి సై


Mon,September 10, 2018 01:24 AM

-జోరుమీదున్న టీఆర్‌ఎస్
-ప్రజల నుంచి అనూహ్య మద్దతు
-స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వివిధ వర్గాలు
-ప్రచారానికి సన్నద్ధమవుతున్న అభ్యర్థులు
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలోని కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గాలకు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కే చంద్రశేఖర్‌రావు అభ్యర్థులను ప్రకటించడంతో ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి నిరంతరం ప్రజా క్షేత్రంలోనే మమేకమైంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి ఈటల రాజేందర్ తనదైన రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. రాష్ట్ర మంత్రి వర్గంలో కీలకమైన ఆర్థిక శాఖకు ప్రాతినిధ్యం వహించిన ఆయన ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కూడా ప్రత్యేకంగా కృషి చేశారు. దీని ప్రభావం ఎన్నికల్లో సానుకూలంగా ఉంటుందని టీఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. మంత్రి ఈటల ఇటీవలే ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ప్రత్యేక నిధులు సాధించి పెట్టారు. వీటిని ప్రధానంగా కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు కేటాయించారు. దీంతో ప్రతి కుల సంఘం నుంచి టీఆర్‌ఎస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నాయి. కుల సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీఆర్‌ఎస్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తున్నాయి..

అన్ని వర్గాల మద్దతు కూడగడుతూ..
ఎన్నికలకు ముందే టీఆర్‌ఎస్ నాయకత్వం అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకుంది. రాష్ట్ర రాజధానిలో వివిధ కులాలకు సంబంధించిన ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి స్థలం కేటాయింపు, నిధుల మంజూరుతో సంచన నిర్ణయం తీసుకుంది. అలాగే నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున కుల సంఘాల భవనాలకు నిధులు కేటాయించింది. తమ ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ తమకు ఏ ప్రభుత్వమూ ఇవ్వని విధంగా గుర్తింపు ఇవ్వడంతో ఈ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌కు సంఘీభావం తెలుపుతున్నారు. కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూర్, చొప్పదండి, హుస్నాబాద్ నియోజకవర్గాల నుంచి ఈ నెల 2న కొంగరకలాన్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు దాదాపు అన్ని కుల సంఘాల నాయకులు స్వచ్ఛందంగా తరలివెళ్లడం ఇందుకు నిదర్శనం.

ఆది నుంచి రైతుల సంక్షేమం కోసం పాటు పడిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఆ వర్గాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతుల గురించి ఆలోచించక పోడవం, రుణమాఫీ మొదలుకుని భూ రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు, రైతు బీమా వంటి వినూత్న పథకాలు అమలు చేయడంతో రైతుల మద్దతు కూడా టీఆర్‌ఎస్ కూడగట్టుకుంది. ఉద్యోగులు, అల్పాదాయ ఉద్యోగుల కోసం కూడా టీఆర్‌ఎస్ అనేక అంశాల్లో విప్లవాత్మక నిర్ణయం తీసుకుని వీరి మన్ననలు కూడా పొందింది. అనేక సంక్షేమ పథకాల ద్వారా ఇంటింటికీ లబ్ధి కలిగే విధంగా చర్యలు తీసుకుంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు తమ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని టీఆర్‌ఎస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తూ..
హుజూరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్‌లో గంగుల కమలాకర్, మానకొండూర్‌లో రసమయి బాలకిషన్, హుస్నాబాద్‌లో వొడితల సతీశ్‌కుమార్‌ను తిరిగి అభ్యర్థులుగా పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ప్రకటించడంతో ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఈ అభ్యర్థుల విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి గెలుపు కోసం రంగంలోకి దిగుతున్న టీఆర్‌ఎస్ కేడర్ ఇప్పటికే పలు చోట్ల ప్రచారం చేపట్టారు. ముఖ్యంగా కరీంనగర్‌లో అభ్యర్థి గంగుల కమలాకర్‌కు అనూహ్య మద్దతు లభిస్తోంది. ఓటర్లను ప్రభావితం చేయగల సత్తా ఉన్న పద్మశాలి సంఘం తమ మద్దతు గంగుల కమలాకర్‌కేనని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం ఇప్పటి వరకు ఎవరి విషయంలోనూ జరగలేదు. వారి సంక్షేమం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు పద్మశాలీలను తీవ్రంగా ప్రభావితం చేశాయనడానికి నిదర్శనం. గంగుల కమలాకర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి, టీఆర్‌ఎస్ అనుసరిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై అనేక పార్టీల నుంచి ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఇప్పటికీ చేరుతూనే ఉన్నారు. మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్, రసమయి బాలకిషన్ ప్రాతినిధ్యం వహిస్తున్న మానకొండూర్‌లోనూ ఇదే పరిస్థితి. ఇప్పటికే హుజూరాబాద్ పట్టణంలో ఆదివారం సుమారు 300 మంది టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి ఈటల రాజేందర్‌కు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామ రజక కులస్థులు 400 మంది ఈటలకే తమ ఓటని ప్రకటిస్తూ ప్రతిజ్ఞ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లోనూ స్థానిక అభ్యర్థి వొడితల సతీశ్‌కుమార్‌కు కూడా ఇక్కడ అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఈ నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించడం, సభ విజయవంతం కావడం ఆయనకు కలిసి వచ్చే అవకాశాలని టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు.

సమరోత్సాహంలో కార్యకర్తలు
ఎవరూ ఊహించని విధంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించడం, జిల్లాలో చొప్పదండి మినహా నాలుగు స్థానాలు సిట్టింగులకే కేటాయించడంతో పార్టీ కార్యకర్తలు సమరోత్సాహంతో కనిపిస్తున్నారు.పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ప్రత్యర్థి పార్టీలకు ఊపిరి సల్పని పరిస్థితి నెలకొన్నది. ప్రధానంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌లో గ్రూపులు ఆ పార్టీని డోలాయమానంలో పడేశాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతుంటే కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనేది ఇప్పటికీ ఆ పార్టీ కేడర్‌కు అంతుచిక్కడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొన్నది.

టీఆర్‌ఎస్‌లో సిట్టింగులకే టికెట్లు ఇవ్వడంతో ఎమ్మెల్యేలుగా ప్రజలతో అనునిత్యం సన్నిహితంగా ఉన్న అభ్యర్థులు ఎప్పటిలాగే వారి మధ్యకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ప్రత్యర్థి పార్టీలకు ప్రజల మధ్యకు వెళ్లేందుకు ఎలాంటి అస్ర్తాలూ లేకుండా పోయాయి. ఇది తమకు పూర్తిగా కలిసి వస్తుందని టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా టీఆర్‌ఎస్ అభ్యర్థులకు దీటైన అభ్యర్థి లేకపోవడంతో ఆయా పార్టీలు అభ్యర్థుల విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి. ఆ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే నాటికే తాము ప్రచారంలో దూసుకుపోతామని టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఉత్సాహంగా చెబుతున్నారు.
టీఆర్‌ఎస్‌లోకి వలసలు.. ప్రత్యర్థుల బేజారు

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి కూడా టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ఆయా పార్టీల్లో వివిధ హోదాల్లో పనిచేసిన వారితోపాటు సాధారణ కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ కండువాలు కప్పుకుంటున్నారు. ప్రజల సంక్షేమానికి కృషి చేసే పార్టీగా టీఆర్‌ఎస్‌ను అభివర్ణిస్తూ, గెలిచే అభ్యర్థులకు మద్దతు ప్రకటించాలనే ఉద్దేశంతో తామంతా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటిస్తున్నారు. తాజాగా వీణవంక మండలం నుంచి మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో వివిధ పార్టీల నాయకులు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలోనూ నగరానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, యువకులు టీఆర్‌ఎస్ కండువా కప్పుకుంటున్నారు.

టీఆర్‌ఎస్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి పెద్ద ఎత్తున తమ పార్టీలో చేరుతున్నారని మంత్రి ఈటల రాజేందర్ చెబుతుంటే, కాంగ్రెస్, బీజేపీ నాయకులపై నమ్మకం లేకనే తమ పార్టీకి వలసలు పెరుగుతున్నాయని కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ వ్యాఖ్యానిస్తున్నారు. హుస్నాబాద్ అభ్యర్థి సతీశ్‌కుమార్ సమక్షంలోనూ చిగురుమామిడి, సైదాపూర్ మండలాల నుంచి పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లోకి వలసలు జరుగుతున్నాయి. గతేడాది కాలంగా టీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతుండగా, అప్పటి నుంచే వస్తున్న వివిధ పార్టీల నాయకులకు టీఆర్‌ఎస్‌లో సముచిత స్థానం కల్పిస్తున్న నాయకులు వారి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి జిల్లాలో అన్ని పార్టీల కంటే ముందుగా ప్రచారాన్ని ప్రారంభించేందుకు టీఆర్‌ఎస్ నాయకులు పూర్తి స్థాయిలో సంసిద్ధులవుతున్నారు.

154
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...