అయినవారే అనాథను చేశారు

Sun,September 9, 2018 01:29 AM

శంకరపట్నం: అయిన వారే కాదు పొమ్మన్నారు. మలిదశలో ఉన్న వృద్ధురాలిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన సంతానం దిక్కులేని అనాథను చేసింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆ వృద్ధురాలిని నాలుగు రోజుల కిందట శంకరపట్నం మండలం ముత్తారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట వదిలి వెళ్లారు. దీనావస్థలో ఉన్న ఆమెను గ్రామస్తులు చేరదీసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందికి తెలపగా కరీంనగర్ దవాఖానకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన వృద్ధురాలు బత్తిని రాధమ్మ భర్త చాలా కాలం క్రితమే చనిపోయాడు. ఈమెకు ఇద్దరు కూతుళ్లు. భర్త లేని రాధమ్మను చిన్న తమ్ముడు బొంగోని వెంకటేశం చాలాకాలం చేరదీశాడు. రాధమ్మ ఇక్కడే ఉంటూ ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు కూడా చేసింది. ప్రస్తుతం వెంకటేశం పరిస్థితి కూడా దయనీయంగా మారింది. అనారోగ్యం కారణంగా ఆర్థికంగా చితికిపోయాడు. దీంతో తల్లిని కూతుర్లు చేరదీసినా.. నాలుగు రోజుల క్రితం గ్రామ పంచాయతీ ఎదుట వదిలేసి వెళ్లారు. అప్పటి నుంచి వృద్ధురాలి ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తుండడంతో మాజీ సర్పంచ్ పంజాల రాజయ్య, చుట్టు పక్కల వారు పోగై సపర్యలు చేశారు. కేశవపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి సమాచారం ఇవ్వగా ఆశ కార్యకర్త సహాయంతో 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

164
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles