విజయోస్తు

Sat,September 8, 2018 02:29 AM

- ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆశీర్వదించిన హుస్నాబాద్
- ఉప్పెనలా తరలివచ్చి జైకొట్టిన అశేష జనం
- టీఆర్‌ఎస్ పాలనకు జేజేలు.. మళ్లీ రావాలంటూ నినాదాలు
- ఆకట్టుకున్న అధినేత ప్రసంగం
- ఈ ప్రాంత ప్రజలు దీవిస్తే విజయమేనని ధీమా
- సతీశ్ తన తమ్ముడులాంటోడేనని ప్రశంసల జల్లు
- గతంలో కంటే రెట్టింపు మెజార్టీతో గెలిపించాలని పిలుపు
- మళ్లీ అవకాశమిస్తే నియోజకవర్గాన్ని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామని హామీ
- మొదటి ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్
- టీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్
(కరీంనగర్ ప్రధాన ప్రతినిధి /సిద్దిపేట ప్రతినిధి/ హుస్నాబాద్, నమస్తే తెలంగాణ) రాష్ట్రంలోనే తొలిసారిగా హుస్నాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ సూపర్ సక్సెస్ అయింది. సమయం తక్కువగా ఉన్నా.. పార్టీ శ్రేణులు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లి జనసమీకరణ చేయడంతో హుస్నాబాద్‌కు వెళ్లే ప్రతి రోడ్డూ గులాబీమయం అయింది. మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ నిర్విరామంగా చేసిన కృషితో అశేష జనం కదలివచ్చింది. ముఖ్యమంత్రి రాకకు రెండున్నర గంటల ముందే ఆర్టీసీ డిపో సమీపంలోని సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. ఈ సభ సాక్షిగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. అశేషంగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. హుస్నాబాద్ అంటే తనకు మొదటి నుంచి సెంటిమెంట్ అనీ, గతంలోనూ ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించి, ఘన విజయం సాధించామనీ, ఈ సారి కూడా ఇక్కడి నుంచే ప్రజల ఆశీర్వాదం తీసుకుంటున్నాని చెప్పారు. శ్రావణ శుక్రవారం రోజు ఎన్నికల ప్రచారం ప్రారంభించడం ఆనందంగా ఉందనీ, ఇక్కడి ప్రజల ఆశీర్వాదం తీసుకొని ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నానని స్పష్టం చేశారు. ఈ ప్రాంత ప్రజలు దీవిస్తే విజయం తథ్యమనీ, ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి ఎన్నికల యాత్ర దిగ్విజయంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ అధికారంలోకి వచ్చాక స్వయంగా వచ్చి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లను పూర్తి చేయించి, నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పిన కేసీఆర్.. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసి ఇక్కడి రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి హుస్నాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేసిన అధినేత, అందుకే ఈ నియోజకవర్గంపై మొదటి నుంచీ ప్రత్యేక దృష్టి సారించామని స్పష్టం చేశారు. ఇక్కడి సమస్యలను భుజాన వేసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ ప్రాంతం ఎంతో చైతన్యవంతమైందనీ, అభివృద్ధిలోనూ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేస్తామని చెప్పారు.

ప్రాజెక్టుల సామర్థ్యం పెంచితే స్వార్థం అవుతుందా?
కాంగ్రెస్ హయాంలో కసికెడు నీళ్లు కూడా పట్టని ప్రాజెక్టులకు రూపకల్ప చేశారని కేసీఆర్ విమర్శించారు. ఇలాంటి ప్రాజెక్టులకు రీడిజైన్ చేసి సామర్థ్యం పెంచితే కాంగ్రెస్ వాళ్లు తమని స్వార్థం అంటున్నారనీ, ప్రాజెక్టుల సామర్థ్యం పెంచితే తమది స్వార్థం అవుతుందా? మీరే చెప్పాలంటూ సభికులను ప్రశ్నించారు. గౌరవెల్లి రిజర్వాయర్‌లో కనీసం ఒక పెద్ద చెరువులో పట్టే నీళ్లు కూడా ఉండే పరిస్థితి లేకుండా కాంగ్రెస్ డిజైన్ చేస్తే.. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను స్వయంగా సందర్శించి సామర్థ్యం పెంచితే తప్ప ప్రయోజనం ఉండదని భావించి గౌరవెల్లిని 8.23 టీఎంసీలకు పెంచిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కతుందన్నారు. రెండు రిజర్వాయర్ల ద్వారా సాగు విస్తీర్ణం 1.65 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. ఏ పని చేపట్టినా శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడేలా ఉండే పనులు మాత్రమే చేస్తున్నామన్నారు. మహాసముద్రం గండి, శనిగరం, సింగరాయ ప్రాజెక్టులు, హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులను పునరుద్ధరించి చిన్న నీటి వనరులను అభివృద్ధి చేశామన్నారు. అలాగే 2014ఎన్నికల ప్రచారంలో గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని హామీ ఇచ్చామనీ, హుస్నాబాద్ ప్రాంతంలోని 13 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి చూపించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని ప్రతిపక్ష నాయకులు గుర్తించాలన్నారు. ప్రజలకు ఏది అవసరమో అది చేసుకుంటూ పోతే ఇందులో స్వార్థం ఉందని ఆరోపణలు చేయడం కాంగ్రెస్సోళ్ల దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు.

సతీశ్‌కు నా దీవెనలు ఎల్లప్పడూ ఉంటయ్..
నిరాడంబరుడు, ఎంతో ఓపికతో ఉండే ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ నా తమ్ముడి లాంటోడు.. ఆయనకు నా దీవెనలు ఎల్లప్పుడూ ఉంటయ్.. అని సీఎం కేసీఆర్ అభయమిచ్చారు. కెప్టెన్ సాబ్‌తో 19 ఏళ్లు అనుబంధం ఉందనీ, ఆయన కొడుకుగా సతీశ్ ఎంతో దగ్గరివాడని తెలిపారు. గడిచిన నాలుగున్నరేండ్లలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రతీసారి కలిసి ఇక్కడి సమస్యలు చెప్తుండేవాడనీ, సతీశ్ కృషితోనే హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ అయ్యిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో నిధులిచ్చాం. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగింది. సతీశ్‌ను ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో గతం కంటే రెట్టింపు మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గ రూపురేఖలను మార్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు అంటూ ప్రజలకు సూచించారు. కాగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే హుస్నాబాద్ నియోజకవర్గం భ్రష్టుపడుతుందని చెప్పారు. ఇప్పటి వరకు తాగు, సాగునీరిచ్చే పనులు చివరిదశకు చేరుకున్నాయనీ, ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఇవి మొత్తం ఆగిపోతాయని తెలిపారు. కాంగ్రెస్ గెలిస్తే నీళ్లుండవు, నిధులుండవు, కరెంటు కూడా ఉండదనీ, ఐదేండ్ల క్రితం వరకు నియోజకవర్గం ఎలా ఉందో మళ్లీ అలాగే తయారవుతుందని చెప్పారు. నిరంతరం అభివృద్ధిని కాంక్షిస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలనే ఆలోచనలో ఉన్న సతీశ్‌కుమార్‌ను గెలిపిస్తేనే ఇక్కడి ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ఒక్క పిలుపుతో వేలాదిగా తరలివచ్చిన హుస్నాబాద్ ప్రజల నమ్మకాన్ని నిలబెడతానని హామీ ఇచ్చారు.

నోరు ఖరాబు చేసుకోను..
ఈ మీటింగ్‌లో కాంగ్రెస్ పార్టీని దబాయించి మాట్లాడాలంటూ నగర మేయర్ రవీందర్‌సింగ్ నాకు చెప్పాడని కేసీఆర్ వేదికపై ప్రకటించారు. అయితే ఇది మొదటి సభ అనీ, తాను నోరు ఖరాబు చేసుకోదల్చుకోలేదనీ.. ఇంకా మున్ముందు మస్తు సభలున్నాయనీ, అక్కడ మాట్లాడుతానంటూ మేయర్‌కు చెప్పిన అని చెప్పడంతో సభలో నవ్వులు విరిశాయి. ఈ సభలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, ఫారూఖ్‌హుస్సేన్, భానుప్రసాదరావు, వెంకటేశ్వర్లు, తాజా మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్, పుట్ట మధు, గంగుల కమలాకర్, యాదగిరిరెడ్డి, విద్యాసాగర్‌రావు, బొడిగ శోభ, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, సిద్దిపేట సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, బండ ప్రకాశ్, హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఎంపీపీ భూక్య మంగ, మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

పాడి పరిశ్రమను ప్రోత్సహించిన
ఘనత టీఆర్‌ఎస్‌దే: ఎంపీ వినోద్
రాష్ట్రంలో పాడి పరిశ్రమను ప్రోత్సహించి పాడి రైతులకు అండగా నిలిచిన ఘనత టీఆర్‌ఎస్ సర్కారుదేనని కరీంనగర్ ఎంపీ బీ వినోద్‌కుమార్ తెలిపారు. లీటరుకు రూ.4 బోనస్ ఇవ్వగా కేవలం ములుకనూరు డెయిరీ పరిధిలోని రైతులకు ఏడాదికి రూ.15 కోట్ల లబ్ధి చేకూరుతున్నదన్నారు. ఎల్కతుర్తి నుంచి మెదక్ వరకు నిర్మించబోయే జాతీయ రహదారికి రూ.1150 కోట్ల నిధులు మంజూరు చేయించామనీ, ఈ రోడ్డు పూర్తయితే హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తుందని పేర్కొన్నారు. వెనుకబడ్డ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు గడిచిన నాలుగున్నరేండ్లలో లక్షలాది రూపాయలు కేటాయించినట్లు గుర్తు చేశారు. గౌరవెల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేయడం ద్వారా హుస్నాబాద్‌ను సస్యశ్యామలం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ కృషితో ఇక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో సభకు తరలివచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సభ మా అదృష్టం: ఎమ్మెల్యే సతీశ్‌కుమార్
సీఎం కేసీఆర్ ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు ఎన్నికల శంఖారావ సభను హుస్నాబాద్‌లో నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానని తాజామాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ స్పష్టం చేశారు. సీఎం కృషితోనే గౌరవెల్లి పనులు వేగంగా నడుస్తున్నాయనీ, శనిగరం, సింగరాయ ప్రాజెక్టుల పునరుద్ధరణకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మహాసముద్రం గండి ద్వారా సుమారు 20 గ్రామాల రైతులు లబ్ధి పొందుతున్నారన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మూడుసార్లు పర్యటించిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. 2014 ఎన్నికల్లో లాగానే ఈసారి కూడా హుస్నాబాద్ నుంచి ఎన్నికల నగారా మోగినందున ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.

325
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles