గులాబీ సేన రెఢీ!

Fri,September 7, 2018 02:59 AM

-ముందస్తు ఎన్నికలకు తెరలేపిన అధినేత కేసీఆర్
-ప్రతిపక్షాలకు ఊహించని విధంగా షాక్
-టీఆర్‌ఎస్ తొలిజాబితా విడుదల
-ఉమ్మడి జిల్లాలో చొప్పదండి మినహా
12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
-అనుకున్నట్లే పదకొండు మంది సిట్టింగ్‌లకు చోటు
-చెన్నూర్ అభ్యర్థిగా బాల్క సుమన్
-అభిమానులు, కార్యకర్తల హర్షం
-అంతటా హోరెత్తిన సంబురాలు
-ముందస్తు సముచితమే అంటున్న ప్రజలు

అనుకున్నట్లుగానే ముందస్తు ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తెరలేపారు. అసెంబ్లీని రద్దు చేయడమే కాదు.. ఏకంగా 105 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. మొదటి విడతలోనే ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాలకు, చొప్పదండి మినహా 12 అసెంబ్లీ స్థానాలకు పేర్లు ప్రకటించి షాక్ నిచ్చారు. మొదటి నుంచి ఒకటి రెండు మినహా సిట్టింగులకే మళ్లీ టికెట్లు ఇస్తామని సీఎం చెప్పినట్లుగానే పదకొండు మందికి అవకాశం ఇవ్వడంపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి అధినేత ప్రజల ముందుకు రావడంపై ముందస్తు నిర్ణయం సముచితమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
- కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ


కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ముందస్తు ఎన్నికలకు వస్తారంటూ కొన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలకు తెలంగాణ రా్రష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తెరదించారు. అక్కడితో అగకుండా అందరి అంచనాలను తారు మారు చేస్తూ 105మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు, చొప్పదండి మినహా 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. పన్నెండు చోట్లా పాత అభ్యర్థులకే మళ్లీ టికెట్లు ఇచ్చారు. టీఆర్‌ఎస్ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ మాకునూరి సంజయ్‌కుమార్ తప్ప అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉన్నారు. తాజాగా ప్రటించిన జాబితాను చూస్తే.. సిరిసిల్ల నియోజకవర్గం అభ్యర్థిగా కల్వకుంట్ల తారక రామారావు, హుజూరాబాద్ అభ్యర్థిగా ఈటల రాజేందర్, కరీంనగర్ అభ్యర్థిగా గంగుల కమలాకర్, కోరుట్ల విద్యాసాగర్‌రావు, ధర్మపురి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి దాసరి మనోహర్‌రెడ్డి, మంథని పుట్ట మధు, రామగుండం సోమారపు సత్యనారాయణ, హుస్నాబాద్ వొడితల సతీశ్‌కుమార్, వేములవాడ చెన్నమనేని రమేశ్‌బాబు, మానకొండూర్ రసమయి బాలకిషన్‌ను ప్రకటించారు. అయితే జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న డాక్టర్ ఎం సంజయ్‌కుమార్ గత ఎన్నికల్లో పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి తిరిగి మళ్లీ సంజయ్‌కుమార్‌కే అవకాశం కల్పించారు. కాగా, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు ఈసారి మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశమిచ్చారు.

-నాలుగున్నరేళ్లు ప్రజలతో మమేకం..

2014 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజలకు తామున్నామనే ధీమాను, భరోసాను కల్పించారు. సమైక్య రాష్ట్రంలో పేరుకపోయిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ, ముందుకెళ్లారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని అభివృద్ధిని ఈ నాలుగేళ్లలో చేసి చూపించారు. వీటన్నింకంటే ఎక్కువగా ప్రజలతో మమేకమై పనులు చేశారు. సీఎంకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే ఎనలేని ప్రేమ ఉండడం, ఇదే సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న పనులపై ఎప్పటికప్పుడు ఆరా తీయడం, పురోగతిని చూసి వీలైనంత ఎక్కువగా నిధులు కేటాయించడం లాంటి వాటితో ప్రజాప్రతినిధులు ప్రగతిని పరుగులు పెట్టించారు. ఇలాంటి అనేక అంశాలు ప్రభుత్వానికీ, టీఆర్‌ఎస్‌కూ, ఎమ్మెల్యేలకూ మంచి పేరు తెచ్చి పెట్టాయి. పార్టీ పరంగా చేసిన అనేక సర్వేల్లో సిట్టింగ్ అభ్యర్థులకే ప్రజలు పట్టం కట్టారు. వీటన్నింటినీ గుర్తించే అధినేత సిట్టింగ్‌లకు అవకాశం కల్పించారని టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

-ప్రతిపక్షాలు బేజారు..

కొద్దిరోజులుగా ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని కొంత మంది, చేయరని మరి కొంతమంది చర్చిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో అభ్యర్థుల వడపోత ఉంటుందనీ, తుదివరకు ప్రకటించరంటూ ఇన్నాళ్లూ ప్రతిపక్షాల నేతలు తమ అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటూ వచ్చారు. ఒక వేళ ప్రభుత్వాన్ని రద్దుచేసినా, అభ్యర్థులను మాత్రం ఆలస్యంగా ప్రకటిస్తారని అనుకున్నారు. అంతేకాదు, అభ్యర్థుల ఎంపిక టీఆర్‌ఎస్‌కు ఒక సవాల్‌గా మారుతుందని ప్రచారం చేశారు. కానీ, అధినేత కేసీఆర్ ఈ చర్చలన్నింటికీ తెరదించారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలకు కోలుకోలేని దెబ్బ వేశారు. గతంలో ఏ పార్టీ చెప్పని విధంగా అభ్యర్థుల జాబితాను అధినేత విడుదల చేయడంతో ప్రతిపక్షాలు బేజారవుతున్నాయి. ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించడంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డాయి. ఈ షాక్ నుంచి తేరుకోవడానికి కొంత సమయం పడుతుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ప్రతిపక్షాల్లో ఏ పార్టీ కూడా ఇంత మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించ లేవని చెబుతున్నాయి.

-ఉమ్మడి జిల్లా నుంచే శ్రీకారం..

తెలంగాణ రాష్ట్రసమితికి ఆది నుంచీ ఉమ్మడి జిల్లా అండగా నిలిచింది. పార్టీకి క్లిష్ట పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ పార్టీకీ, అధినేత కేసీఆర్‌కూ వెన్నంటి నడిచింది. 2001 పార్టీ ఆవిర్భావం నుంచి 2014లో స్వరాష్ట్రం సాధించే వరకు, అండదండలు అందించింది. అందుకే ఉమ్మడి జిల్లాకు నేను ఎంతచేసినా తక్కువే.. నేను ఏమిచేసినా రుణం తీర్చుకోలేను అని పలుసార్లు ముఖ్యమంత్రే స్వయంగా చెప్పుకున్నారు. అంతేకాదు, ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత అనేక కొత్త పథకాలను ఉమ్మడి జిల్లావేదికగా ప్రకటించి, గమ్యాన్ని ముద్దాడారు. ప్రస్తుతం ప్రభుత్వాన్ని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు పోతున్న సమయంలో నాటి ఉమ్మడి జిల్లా, నేటి సిద్దిపేట జిల్లా అయిన హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రజా ఆశ్వీరాద సభ పేరుతో నియోజకవర్గ సభలకు శుక్రవారం నుంచి శ్రీకారం చుడుతున్నారు. 2014 ఎన్నికల్లోనూ హుస్నాబాద్ నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించిన అధినేత, ఇప్పుడు అదే పంథాను అనుసరిస్తున్నారు. 50 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తామని ఇప్పటికే మంత్రి ఈటల రాజేందర్ ప్రటించారు. ఇందులో భాగంగా మొదటి సభను శుక్రవారం హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రారంభించనున్నారు.

-సర్వత్రా హర్షం..

ముఖ్యమంత్రి తీసుకున్న ముందస్తు ఎన్నికల నిర్ణయంతోపాటు సిట్టింగ్‌లకే టికెట్లు ఇవ్వడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పటాకలు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి, కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలతో మమేకమైన సిట్టింగ్‌లకే టికెట్లు ఇవ్వడం వల్ల ఇన్నాళ్లూ పెనవేసుకున్న అనుబంధం ఇక ముందు కూడ కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అభ్యర్థులను ముందుస్తుగానే ప్రకటించడంతో వెంటనే ప్రచార రంగంలోకి దిగవచ్చనీ. గత నాలుగేళ్లలో చేసిన ప్రగతిని ప్రజలు గమనించారనీ, ఇక గెలుపు సునాయాసం అవుతుందని సంతోషంగా చెబుతున్నారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపిన అధినేత కేసీఆర్, తిరిగి ముఖ్యమంత్రి అయితే అసాధ్యం అనుకున్న బంగారు తెలంగాణను సుసాధ్యం చేస్తారని ఉద్ఘాటించారు.

388
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles