అధినేత ఆశీస్సులతో..

Fri,September 7, 2018 02:57 AM

-ముఖ్యమంత్రి చలువతో 5 వేల కోట్ల అభివృద్ధి
-నాలుగేళ్లలోనే నియోజకవర్గంలో 40ఏళ్ల ప్రగతి
-తొలి ప్రజా ఆశీర్వాద సభ మా అదృష్టం
-నమస్తేతో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్
-సభను విజయవంతం చేయాలని పిలుపు
హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో తొలి ప్రజల ఆశీర్వాద సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చలువతో 40ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగి నియోజకవర్గ రూపు రేఖలు మారాయని తెలిపారు. ఇంకా సీఎంతో నియోజకవర్గానికి ఉన్న అనుబంధం, అభివృద్ధి, పూర్తయిన పనులు, చేపట్టబోయే పనులను వివరించారు. సంక్షేమపథకాలు.. రైతుల సంక్షేమం.. సాగు నీటి ప్రాజెక్టులు తొలి సభ నిర్వహణ.. జనసమీకరణ తదితర అంశాలపైనా మాట్లాడారు.
-హుస్నాబాద్, నమస్తే తెలంగాణ

మీ నియోజకవర్గం నుంచే సభ నిర్వహించడంపై ఎలా ఫీలవుతున్నారు?
2014 ఎన్నికలకు ముందు తొలి సభ హుస్నాబాద్‌లో నిర్వహించి రాష్ట్రంలో భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే సెంటిమెంట్‌తో సీఎం కేసీఆర్ ఈ సారి కూడా ఇక్కడి నుంచే ప్రజా ఆశీర్వాద సభలను ప్రారంభిస్తున్నారు. ఇది నాతోపాటు నా నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భావిస్తున్నా. భవిష్యత్తులో మా నియోజకవర్గ అభివృద్ధికి నాంది అవుతుందని అనుకుంటున్నా.

సభకు ఎంతమంది జనాన్ని తరలిస్తున్నారు?
హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలనుంచి 65వేల మందికిపైగా సభకు తరలిస్తున్నాం. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మండలాలు, గ్రామాల వారీగా ఇప్పటికే సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేశాం. గ్రామాల నుంచి ఇంటికి ఇద్దరు చొప్పున స్వచ్ఛందంగా వచ్చేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అనుకున్నదానికంటే ఎక్కువ మంది వస్తారనే నమ్మకం ఉంది.

నాలుగేండ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది?
హుస్నాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఆశీర్వాదంతో సుమారు రూ.5వేల కోట్ల అభివృద్ధి జరిగింది. ఏడు మండలాల్లోని ప్రజలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని రకాల సంక్షేమ పథకాలు అందాయి. ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందడంతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మాత్రమే ఉండాలని కోరుకుంటున్నారు.

గౌరవెల్లి రిజర్వాయర్ పనులు ఎంత వరకు వచ్చాయి?
సీఎం కేసీఆర్ కృషి వల్లే గౌరవెల్లి రిజర్వాయర్ సామర్థ్యం 1.24 టీఎంసీల నుంచి 8.23టీఎంసీలకు పెరిగింది. గౌరవెల్లి రిజర్వాయర్ భూసేకరణ దాదాపు పూర్తయింది. పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 75 శాతం పనులు పూర్తయ్యాయి. త్వరలోనే పనులు పూర్తి చేసి మిడ్‌మానేరు నుంచి గౌరవెల్లిలో నీళ్లు నింపుతాం. సొరంగం పనులు, సర్జిఫుల్ సంపుల నిర్మాణాలు పూర్తయ్యాయి. మోటార్ల బిగింపు మొదలువుతున్నది. ఆరు నెలల లోపు గౌరవెల్లి రిజర్వాయర్‌ను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నింపడం ఖాయం.

అభివృద్ధిపై ప్రతిపక్షాల విమర్శలపై మీ స్పందన?
హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలకు అభివృద్ధిపై చిత్తశుద్ధే లేదు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక అర్థరహితమైన విమర్శలు చేస్తున్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ పనులను అడ్డుకునేందుకు భూనిర్వాసితులతో పదుల సంఖ్యలో కేసులు వేయించి రిజర్వాయర్ పూర్తికాకుండా అడ్డుపడిన పార్టీలు అభివృద్ధిపై మాట్లాడడం సరికాదు. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్ సహకారంతో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు కొనసాగుతుంటే వీటిపై విమర్శలు చేయడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం. వారి విమర్శలను మేం ఏనాడు పట్టించుకోం. నియోజవర్గాన్ని బంగారు నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు పోతాం.

ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా ఉంటాయి?
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు, ఆమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మా గెలుపునకు కొలమానం. ఇటీవల నిర్వహించిన ప్రగతి నివేదన సభ, ఇప్పడు జరుగబోయే ఆశీర్వాద సభలు అన్ని నియోజకవర్గాల్లోని ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. సీఎంగా కేసీఆర్‌ను తప్ప మరెవరినీ ఊహించుకునే పరిస్థితిలో ప్రజలు లేరు. హుస్నాబాద్‌లో జరుగబోయే తొలిసభను విజయవంతం చేసి జరుగబోయే సభలకు స్ఫూర్తినిస్తాం. హుస్నాబాద్ నియోజకవర్గంలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించి గులాబీ జెండాను ఎగురవేస్తాం.

నియోజకవర్గ ప్రజలకు ఏమని పిలుపునిస్తున్నారు?
ముఖ్యమంత్రి ఎంతో నమ్మకంతో హుస్నాబాద్‌లో తొలి ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఇల్లు, ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సభకు వేలాదిగా తరలివచ్చి కేసీఆర్‌కు కృతజ్ఞత చూపించాలి. కనీవినీ ఎరుగని రీతిలో సభకు తరలివచ్చి రాష్ట్రం మొత్తం దృష్టిని హుస్నాబాద్ వైపు మళ్లీంచేలా చూడాలని కోరుతున్నా.

208
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles