కొన్నది సగమే..!

Thu,December 5, 2019 03:07 AM

-ధాన్యం కొనుగోళ్లలో మందగమనం..
-235 కేంద్రాల్లో 2లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ
-మరో 3లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా
-ఆపసోపాలు పడుతున్నజిల్లా యంత్రాంగం
-సవాల్‌గా మారిన ధాన్యం సేకరణ


కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వానాకాలం సీజన్‌లో ధాన్యం పొటెత్తే అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఐదున్నర లక్షల టన్నుల ధాన్యం వస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో సన్న రకం ధాన్యం 60వేల టన్నులు కాగా వీటిని బయట మార్కెట్లోనే రైతులు ఇప్పటికే విక్రయించారు. దొడ్డు రకం ధాన్యాన్ని విక్రయించేందుకు జిల్లాలో రైతన్నలంతా ఎక్కడికక్కడ పోటెత్తుతున్నారు. అక్టోబర్‌లో ప్రారంభమైన కొనుగోళ్లు నవంబర్‌లో స్పీడు అందుకుంది.

డిసెంబర్‌ మాసంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 41శాతం మాత్రమే ధాన్యాన్ని సేకరించడం విడ్డూరంగా మారింది. 59శాతం మేర ఇంకా ధాన్యాన్ని సేకరించాల్సి రావడం ఇటు పౌరసరఫరాల సంస్థకు, వ్యవసాయ శాఖకు సవాల్‌గా మారింది. వానాకాలం పంట సాగు సమయం నుంచి ఇరు శాఖల అధికారులు నిర్లక్ష్యం వహించడం, కనీసం రైతులను అవగాహన పర్చడంలో వైఫల్యం చెందడంతోనే ఇప్పుడీ పరిస్థితి ఎదురవుతుందని తెలుస్తోంది. ప్రైవేటు కొనుగోళ్లు జోరుగా సాగడం మూలంగానే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాకపై ప్రభావం పడుతుందా? అన్న సందేహాం కలుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు కాంటాలు ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటవుతుండడంతో రైతన్నలు నిలువునా దోపిడీకి గురవుతున్నారు. కోత మిషిన్ల కొరత, కూలీల లభ్యత లేకపోవడమూ ధాన్యం రాకపై ప్రభావం చూపుతుందా అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో పలు చోట్ల అకాల వర్షాలు వెంటాడుతుండడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.

రూ.205 కోట్లు చెల్లింపులు...
ఈ వానాకాలం సీజన్‌లో సాధారణ విస్తీర్ణానికి రెట్టింపు స్థాయిలో పంటలు సాగయ్యాయి. కామారెడ్డి జిల్లాలో వరి సాధారణ విస్తీర్ణం 1,00,195 ఎకరాలు కాగా 1,75,175 ఎకరాల్లో వరి సాగవ్వడం రికార్డు సృష్టించింది. పంట కాలాన్ని అనుసరించి అక్టోబర్‌ నెలాఖరులోగా జిల్లా వ్యాప్తంగా ధాన్యం రాబడులు ఒక్కసారిగా పోటెత్తాలి. ఆలస్యంగా నాట్లు వేయడంతో ధాన్యం రాక ఆలస్యం అవుతోంది. మొత్తం 236 కేంద్రాలను ఏర్పాటు చేయగా ఐకేపీ ఆధ్వర్యంలో 29, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్‌) ఆధ్వర్యంలో 207 కేంద్రాలున్నాయి. గత వానాకాలం సీజన్‌లో ఏ-గ్రేడ్‌ ధాన్యం క్వింటాలుకు రూ.1,770, సాధారణ రకానికి రూ.1,750 మద్ధతు ధర ఇవ్వగా, ఈసారి వాటి మొత్తాన్ని ప్రభుత్వం కొంత పెంచింది. ప్రస్తుతం ఏ-గ్రేడ్‌ రకానికి రూ.1,835, సాధారణ రకానికి రూ.1,815 మద్దతు ధర అందిస్తున్నారు. నాణ్యత ప్రమాణాల మేరకు కొనుగోలు చేయనున్నారు. తేమ, తాలు తదితర నాణ్యత ప్రమాణాలు పాటించి మద్దతు పొందాలని అధికారులు సూచిస్తున్నారు. కొనుగోళ్లకు అవసరమయ్యే సదుపాయాలను సంబంధిత శాఖ సమకూర్చనుంది. 236 ధాన్యం సేకరణ కేంద్రాలకు గాను 235 కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు 1,96,775 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అత్యధికంగా పీఏసీఎస్‌ల ద్వారా 1,84,641 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఐకేపీ సెంటర్ల ద్వారా 12,133 మెట్రిక్‌ టన్నులను సేకరించారు. మొత్తం 37వేల 43 మంది రైతులకు రూ.362 కోట్లు చెల్లింపులు జరపాల్సి ఉండగా మంగళవారం నాటికి 22వేల 422 మంది రైతులకు రూ.205 కోట్లు చెల్లింపులను పూర్తి చేశారు.

మంచి దిగుబడులు
వానాకాలంలో పండించిన వరి పంట మంచి దిగుబడులు రావడంతో కొనుగోలు కేంద్రాలు ధాన్యం రాసులతో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోలు చేసేందుకు 236 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో సాగునీటి వనరులు అంతగా లేకపోవడంతో రైతులు ఎక్కువగా వ్యవసాయ బావులు, బోర్లపై ఆధారపడి పంటలు సాగు చేస్తుంటారు. ఈ ఏడాది జిల్లాలో 1.75లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. వానాకాలం సీజన్‌ ఆరంభంలో బోర్లు, వ్యవసాయ బావుల్లో తగినంత నీరు ఉన్న వారు మాత్రమే సాగుకు సిద్ధమయ్యారు. వానలు మొఖం చాటేయ్యడంతో కర్షకులు కాసింతగా ఆందోళన చెందారు. ఆలస్యంగా రుతుపవనాల కదలికలు షురూ కావడంతో వానలు దంచికొట్టడం ఆరంభం కావడంతోనే పంటల సాగు జోరందుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జోరుగా ధాన్యం కాంటాలు అవుతున్నాయి. వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లు తూకం వేసి అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. తూకం అయిన బస్తాలను తక్షణమే ఎంపిక చేసిన రైసు మిల్లులకు లారీల్లో తరలిస్తున్నారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles