పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలి

Wed,November 20, 2019 01:31 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు యాసంగి(రబీ)కి సరిపడా ఎరువులు ముందస్తుగా అందుబాటులో ఉంచాలని అధికారులకు కలెక్టర్ రామ్మోహన్‌రావు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్ సమావేశ మందిరంలో వ్యవసాయ, సహకార, మార్క్‌ఫెడ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాసంగి(రబీ)కి కావాల్సిన ఎరువులపై ముందుగానే ఇండెంట్ పంపించాలని, సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని ఎరువులు తక్కువ కాకుండా పంపేలా ప్రభుత్వానికి నివేదిక పంపించాలని సూచించారు. ఎరువులు ఎవరు కొంటారో వారితోనే బయోమెట్రిక్ తీసుకోవాల్సిందిగా పీవోఎస్ ఆపరేటర్లను ఆదేశించాలని, లేదంటే ఒక్కరి పేరుమీదనే అత్యధికంగా తీసుకున్నట్లు బయోమెట్రిక్‌లో వస్తే అది ఫిర్యాదులకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఎరువుల పంపిణీపై వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, వివరాల నమోదులో ఆలస్యం జరిగితే సరఫరాలో కేంద్రం నుంచి ఇబ్బందుల తలెత్తే అవకాశం ఉంటుందన్నారు.

లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ...
జిల్లాలో మంగళవారం నాటికి లక్షన్నర మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించామని కలెక్టర్ రామ్మోహన్‌రావు తెలిపారు. సుమారు రూ. 300 కోట్లు విలువైన ధాన్యం కొనుగోళ్లు జరిగినట్లు చెప్పారు. చెల్లింపులకు సంబంధించి ఏరోజుకారోజు వివరాలు నమోదు చేస్తూ, ప్రతిరోజు చెల్లించాల్సిన బిల్లులపై ఇండెంట్ పంపించాలని, నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంట పండించిన రైతులు, కౌలు రైతులకు ధ్రువీకరణ పత్రాలు అందించాలన్నారు.

లావాదేవీలు క్లియర్ చేసుకోవాలి
సహకార సంఘాల వారు మార్క్‌ఫెడ్‌తో లావాదేవీలపై రికన్సిలేషన్ చేసుకొని బకాయిలు క్లియర్ చేసుకోవాలని కలెక్టర్ కోరారు. లైసెన్స్‌లు ఉన్న వారు వాటిని రెగ్యులేట్ చేసుకోవాలని, కొత్తవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

విత్తనాలు, ఎరువుల పంపిణీ, ధాన్యం సేకరణలో ప్రభుత్వ నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. ఇప్పటికే ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలతో పాటు ఇంకా మున్ముందు ప్రారంభించే కొనుగోలు కేంద్రాల్లో సరిపడా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, జిల్లా సహకార అధికారి సింహాచలం, మార్క్‌ఫెడ్ డీఎం ప్రవీణ్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles