సై అంటే సై!

Wed,November 20, 2019 01:30 AM

నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: బీజేపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకున్నది. సీనియర్ లీడర్ యెండల లక్ష్మీనారాయణ, ఎంపీ అర్వింద్ మధ్య ఆధిపత్య పో రు రోజురోజుకు పెరుగుతున్నది. ఎవరికి వా రే పార్టీలో వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఎవరి అనుచరగణా న్ని వారు కాపాడుకునేందుకు పోటీ పడుతున్నారు. అధిష్ఠానం వద్ద పావులు కదుపుతూ తమ పరపతిని జిల్లాలో నిలుపుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఎంపీగా అర్వింద్ గెలిచినప్పటినుంచి ఇద్దరిలో గ్యాప్ మరింత పెరిగింది. ఇరువు ఎడముఖం పెడముఖంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా వేర్వేరుగా పాల్గొంటుండడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొన్నది. పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రెస్‌మీట్‌కు యెండలకు ఆహ్వానం అందడం లేదు. దీంతో అర్వింద్ అండ్ టీం మాత్రమే ప్రెస్‌మీట్లలో పాల్గొంటున్నారు. అర్వింద్ వెంబడి బస్వా లక్ష్మీనారాయణ, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ఉం టున్నారు. వీరితోనే కార్యక్రమాలు నడిపించేస్తున్నారు అర్వింద్. యెండల, అర్వింద్‌కు ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. ఎవరి పంతం ఎంతో.. ఎవరి ఆధిపత్యం ఎంతో నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. పార్టీ జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకునే సందర్భం ఇద్దరి మధ్య ఉన్నపోరు అధిష్టానం వరకు వెళ్లింది. నెలాఖరు వరకు పార్టీ జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. ఇప్పటికే గ్రా మ, మండల, క్లసర్ల వారీగా కమిటీల నియామకాన్ని పూర్తిచేశారు. జిల్లా అధ్యక్షుడి ఎన్నిక రాష్ట్ర పార్టీ కార్యవర్గం చేపట్టనుంది. జిల్లా నుంచి వచ్చిన ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకొని, అంతిమంగా అక్కడి కోర్ కమిటీ వారికే ఓకే చెప్తుంది. ఇక్కడ నుంచి వెళ్లిన ప్రతిపాదనలే కీలకం కానున్నాయి. పార్టీ రాష్ట్ర అధిష్టానం ఎంపిక కేవలం లాంఛన ప్రాయమే కానుంది. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు తమ అనుకూలమైనవారే ఉండాలని ఎవరికి వారే అధిష్టానం వద్ద ప్రతిపాదనలు పెడుతున్నారు. ఓ దశలో ఒత్తిడి పెంచుతున్నారు. ఈనెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. సమయం లేకపోవడంతో రాష్ట్ర స్థాయిలో ఇద్దరూ పావులు కదుపుతున్నారు.

దళితుడే ఉండాలని యెండల ప్రతిపాదన..
ఈసారి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దళితుడు ఉండాలని యెండల లక్ష్మీనారాయణ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై గట్టిగానే పోరాడుతున్నారు. ఇటీవల యెండల లక్ష్మీనారాయణను పలు ఎస్సీ సంఘాలు కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరాయి. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్న ఆయన ..అధిష్టానం వద్ద గట్టిగా తన వాదనను వినిపిస్తూ వస్తున్నారు. ఓసీలు, బీసీలు కాకుండా ఈసా రి దళితులకు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో యెండల ప్రతిపాదన కోటాలో నా యుడు ప్రకాశ్‌తో పాటు వడ్లూరి శ్రీనివాస్(బోధన్), అమ్దాపూర్ రాజేశ్ (ఆర్మూర్), కోటేశ్వర్‌రావు (నిజామాబాద్) ఉన్నారు. వీరిలో ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పల్లె గంగారెడ్డి ఏండేండ్లుగా కొనసాగుతున్నారు. రెండు సార్లు మాత్రమే పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తుంది. దీంతో ఆయనకు ఈసారి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఈ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ రెండు శక్తుల మధ్య సవాల్‌గా నిలిచింది. దీంతో ఎవరికి వారే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

బస్వాకు ఓకే చెబుతున్న ఎంపీ అర్వింద్...
ఎన్నికల సమయం నుంచి తనతో పాటు నడుస్తున్న బస్వా లక్ష్మీనర్సయ్యకు అర్వింద్ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడి బరిలో ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీ అర్వింద్ మాత్రం బస్వా వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. వీరు కాకుండా బాల్కొండ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన రుయ్యాడి రాజేశ్వర్, ఆర్మూర్‌కు చెందిన శివరాజ్ తదితరులు అ ధ్యక్ష పీటం ఆశిస్తున్నారు. అర్వింద్‌పై ఆధారపడిన బస్వా, ధన్‌పాల్‌పై బీజేపీ కార్యకర్తలు గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది. బస్వా లక్ష్మీనర్సయ్య టీఆర్‌ఎస్ పార్టీలో టికెట్ ఇవ్వలేదని ఆ పార్టీ కార్యాలయంపై రాళ్లతో దాడు లు చేయించి, విమర్శలు గుప్పించి బీజేపీలో చేరారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన బస్వా లక్ష్మీనారాయణ, అంతకు ముందు ఆయన వ్యవహారంతో కార్యకర్తలు పూర్తిగా నమ్మడం లేదు. ధన్‌పాల్ సైతం టికెట్ రాలేదనే అసంతృప్తితో బీజేపీ కార్యాలయంపై దాడి చేయించారు. కొంత మంది నాయకులను, కార్యకర్తలను తనదారిలోకి తెచ్చుకొని పార్టీకి కొంత నష్టం కలిగించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీన్ని అధిష్టానం పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో అర్వింద్ అభ్యర్థిస్తున్న అధ్యక్ష అభ్యర్థులిద్దరికీ పూర్తి స్థాయిలో కార్యకర్తల మద్దతు లభించడం లేదు. యెండల బలంగా ఈసారి దళిత కార్డు తెరపైకి తీసుకురావడం అధిష్టానం వద్ద చర్చ కు దారితీసింది. దీంతో ఎవరికి అధ్యక్ష పీఠం దక్కుతుందోననే ఉత్కంఠ ఆ పార్టీ వర్గాల్లో నెలకొన్నది. ఎవరి పంతం నెగ్గుతుందో.. ఎ వరి పరపతి నిలుస్తుందోననే చర్చ కమలనాథుల్లో ప్రస్తుతం నడుస్తున్నది.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles