మూడెకరాలు మురవంగా..!

Sun,November 17, 2019 02:24 AM

-సత్ఫలితాలు ఇస్తున్న భూమి కొనుగోలు పథకం
-కామారెడ్డి జిల్లాలో 509 దళిత కుటుంబాలకు చేకూరిన లబ్ధి
-మూడెకరాల్లో సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న కుటుంబాలు
-పంట సాగు కోసం ఆర్థిక సాయం అందిస్తున్న ప్రభుత్వం
-సీఎం కేసీఆర్ చొరవపై ఆనందం వ్యక్తం చేస్తున్న కుటుంబాలు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ / నిజాంసాగర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితులకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని విస్తృత పర్చేందుకు జిల్లా యంత్రాంగం సరికొత్త చర్యలకు సిద్ధమైంది. ఇచ్చిన హామీ మేరకు భూములు ఇచ్చి చేతులు దులుపుకోకుండా సేద్యపు భూమి ప్రయోజనకరంగా మార్చాలన్న సంకల్పంతో రాష్ట్ర సర్కారు మరిన్ని చర్యలు తీసుకుంటోంది. నిరుపేద దళితులకు ఇప్పటికే పంపిణీ చేసిన మూడెకరాల భూమిని బంగారుమయంగా మార్చే దిశలో వారికి మరిన్ని సహాయ, సహకారాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇచ్చిన మూడెకరాల భూమి మురిసిపోయే విధంగా పంటలకు నెలవుగా మార్చేందుకు వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు సరికొత్త ప్రణాళికలను రూపొందించారు. సొంతంగా గజం భూమి కూడా లేని నిరుపేద దళితులకు అందించిన మూడెకరాల సేద్యపు భూమితో దళితులు రైతులుగా రూపాంతరం చెందారు. ఇప్పుడా రైతును రాజుగా మార్చే ప్రక్రియ మొదలు పెట్టేందుకు మరిన్ని చర్యలు సిద్ధం అవుతున్నాయి.

జిల్లాలో మూడెకరాల పంపిణీ ఇలా...
జిల్లాలో ఇప్పటివరకూ వందలాది మందికి మూడెకరాల సాగు భూమిని ప్రభుత్వం అందించింది. ఎస్సీ కార్పొరేషన్ అధికారుల తాజా వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1,183 ఎకరాల భూమిని దాదాపు రూ.54 కోట్లు వెచ్చించి 509 దళిత కుటుంబాలకు అందించారు. పంపిణీ చేసిన భూమిని అభివృద్ధి చేసేందుకు 429 దళిత లబ్ధిదారులకు రూ.1.68 కోట్ల నిధులను మంజూరు చేశారు. వీరంతా సాధారణ రైతులందరితో పోటీ పడి వారితో పాటు మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకొని సాగాలన్న సంకల్పంతోనే జిల్లా అధికారులు సరికొత్త ఆలోచనలకు బీజం వేశారు. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన భూమిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మరింత వృద్ధిలోకి తీసుకువచ్చేందుకు, చెరువు పూడిక మట్టిని ఈ భూముల్లో ఉచితంగా వేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సమాయత్తం అయ్యారు. నాడెం కంపోస్టు తయారీపై దళిత రైతులకు అవగాహన కల్పించి వారిని సేంద్రియ వ్యవసాయం వైపునకు మళ్లించే అధికారులు చర్యలు చేపడుతున్నారు.

గణాంకాలివీ...
2014-15లో 40 మంది లబ్ధిదారులకు 110.33 ఎకరాలను పంపిణీ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.4.05 కోట్లతో ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమిని కొనుగోలు చేసింది. 2015-16లో 203 మందికి 502 ఎకరాలను రూ.23.09కోట్లతో సేకరించి పంపిణీ చేశారు. 2016-17లో 124 మంది లబ్ధిదారులకు 256.17 ఎకరాలను రూ.12.85 కోట్లు వెచ్చించి భూమిని అందించారు. 2017-18లో 108 మంది లబ్ధిదారులకు 237 ఎకరాలు ఇవ్వగా ఇందుకోసం ప్రభుత్వం రూ.11.47 కోట్లు వెచ్చించింది. 2018-19లో 34 మందికి 75.36 ఎకరాల భూమిని పంపిణీ చేయగా ఇందుకోసం ప్రభుత్వం రూ.3.32 కోట్లు ఖర్చు చేసినట్లుగా అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు పంట సాగుకు ఆర్థిక సాయం కోసం 509 మంది లబ్ధిదారులకు రూ.1.95 కోట్లు అందించారు.

సంతోషం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
నిజాంసాగర్ మండలంలోని గున్కుల్ గ్రామ శివారులో మహ్మద్‌నగర్ గ్రామానికి చెందిన ఆరుగురికి, గున్కుల్‌లో ఇద్దరికి, తుంకిపల్లికి చెందిన ముగ్గురికి తుంకిపల్లి శివారులో 2017వ సంవత్సరంలో ప్రభుత్వం సాగుభూమిని అందజేసింది. ఒక్కొక్కరికీ మూడెకరాల చొప్పున సాగు భూమిని అందజేయడంతో పాటు, విద్యుత్ సౌకర్యం కల్పించి, బోర్లు వేయించి ఇవ్వడంతో వారంతా పంటను సాగు చేసుకుంటున్నారు. ఎకరానికి రూ. 4 వేల చొప్పున పెట్టుబడి సహాయం కూడా అందివ్వడంతో ఇప్పటికి నాలుగు పంటలు సాగు చేసుకున్నామని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

81
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles