జోరుగా ప్రజా రవాణా..

Sun,November 17, 2019 02:22 AM

కామారెడ్డి, బాన్సువాడ, నమస్తే తెలంగాణ / విద్యానగర్ : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 43వ రోజుకు చేరుకుంది. సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇతర అధికారులతో సమన్వయంతో పనిచేసి తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. కామారెడ్డి డిపో పరిధిలోని అన్ని రూట్లతో పాటు జేబీఎస్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, రామాయం పేట్, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర రూట్లలో బస్సులు యథావిధిగా నడిపిస్తున్నారు. కామారెడ్డి డిపో నుంచి జేబీఎస్‌కు నాన్ స్టాప్ బస్సులు నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచుతున్నారు. దీంతో సమ్మె ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. కామారెడ్డి డిపో నుంచి శనివారం 96 ఆర్టీసీ బస్సులు, 33 అద్దె బస్సులను నడిపామని ఆర్డీసీ డీవీఎం గణపతిరాజు, డిపో మేనేజర్ ఆంజనేయులు, ఆర్టీఏ అధికారిణి వాణి తెలిపారు. డిపో, బస్టాండ్‌లో కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ జగదీశ్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.

కార్మికుల నిరసన ..
43వ రోజు కార్మికులు డిపో ఎదురుగా టెంట్ వేసి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. బస్టాండ్ నుంచి ర్యాలీగా నిజాంసాగర్ చౌరస్తా వరకు వెళ్లి మానవహారం నిర్వహించారు. తిరిగి బస్టాండ్ వద్దకు చేరుకొని నిరసన కొనసాగించారు.

బాన్సువాడలో యథావిధిగా నడిచిన ఆర్టీసీ బస్సులు
బాన్సువాడలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నా... తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. బాన్సువాడ డిపో నుంచి శనివారం 65 ఆర్టీసీ బస్సులు, 12 హైర్ బస్సులు, 40 మాక్సీ క్యాబులను నడిపించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు శనివారం ఉదయం బాన్సువాడ డిపో ఎదుట మెయిన్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. డీఎస్పీ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగి కార్మికులకు సర్దిచెప్పారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles