ఇంటింటా కల్యాణ కాంతులు..!

Sat,November 16, 2019 12:26 AM

-పేదింటి వివాహాలకు కల్యాణలక్ష్మి తోడూనీడా
-జిల్లాలో 17 వేలు దాటిన లబ్ధిదారుల సంఖ్య
-పేదింటి ఆడబిడ్డలకు చేకూరుతున్న ఆర్థిక ప్రయోజనం
-ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు భారీ ఊరట
-ఆడబిడ్డల పెండ్లికి అందుతున్న లక్షా 116 రూపాయలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పేదింటి యువతుల వివాహానికి సంబంధించి ఆర్థిక సహాయం అందించే ప్రక్రియ వేగవంతమైంది. వరుస ఎన్నికలతో నెలల తరబడి నిరీక్షించిన వారికి చకచకా చెక్కుల పంపిణీ జరుగుతున్నది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను సైతం అధికారులు క్షేత్ర స్థాయిలో విచారించి ఆర్థిక సాయం మంజూరుకు సిఫార్సు చేస్తున్నారు. వీరందరికీ చెక్కులు అందించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిన వెంటనే వాటిని అర్హులకు అందిస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కోసం ఎవరైనా అక్రమార్కులు డబ్బులు వసూలు చేస్తే కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారులు సైతం చెక్కులకు మామూళ్లు అడిగితే ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సత్యనారాయణ ప్రజలకు సూచిస్తున్నారు.

ఊరూరా కల్యాణ కాంతులు...
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో అమ్మాయిల వివాహాలకు తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే సాయం అందించేందుకు ప్రత్యేకంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నది. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా తొలినాళ్లలో రూ.50 వేలను అందించారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, వినతుల మేరకు ఆర్థిక సాయాన్ని రూ.75 వేలకు పెంచారు. అనంతరం ఏకంగా లక్షా నూట పదహారు రూపాయలకు పెంచడంతో పేదలకు మరింతగా ఊరట లభిస్తున్నది. పేదింటి తల్లిదండ్రులు తమ కూతుళ్ల వివాహానికి ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఈ పథకాలు దోహదపడుతున్నాయి. వెనుకబడిన వర్గాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొండంత అండగా నిలుస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని దళిత, గిరిజన, బీసీ, మైనార్టీలకు చెందిన నిరుపేద యువతుల వివాహాల కోసం ఆర్థిక సాయం అందించేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని అక్టోబర్ 2, 2014న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. గ్రామాల్లో రూ.లక్షన్నర ఆదాయం, పట్టణాల్లో రూ.2లక్షల ఆదాయం ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. 18 ఏండ్లు నిండిన యువతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. తొలినాళ్లల్లో కల్యాణలక్ష్మి సాయం రూ.51 వేలు మాత్రమే అందించేది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 2017 మార్చి 13న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయాన్ని రూ.51 వేల నుంచి రూ.75,116లకు పెంచారు. మరింత సహాయం అందజేయాలని దీనిని కాస్తా 2018, ఏప్రిల్ 1వ తేదీ నుంచి రూ.లక్షా 116కు పెంచారు. ఐదేళ్ల క్రితం రూ.51 వేలతోనే మొదలైన ఈ అద్భుత పథకం సీఎం మానవతా దృక్పథంతో రూ.లక్ష 116కు చేరడంతో ఆడబిడ్డల కుటుంబాల్లో కల్యాణ కాంతులను ప్రసాదిస్తోంది.

జోరుగా సాగుతున్న చెక్కుల పంపిణీ...
పథకాల ప్రారంభం నుంచి ఆగస్టు నెలాఖరు వరకు జిల్లావ్యాప్తంగా 16,125 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందించారు. కార్తీకమాసంలో పెళ్లిళ్ల సీజన్ మొదలవ్వడంతో పేదింట ఆర్థిక కష్టాలను తీరుస్తూ ప్రభుత్వం పెద్ద ఎత్తున అర్హులైన వారందరికీ లక్షా 116 రూపాయలను అందిస్తున్నది. జిల్లాలో సందడి వాతావరణంలో ఈ కార్యక్రమం జోరుగా సాగుతున్నది. పేదింటి యువతుల వివాహాలకు సంబంధించి ఆర్థిక సాయం అందించే ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నది. వచ్చిన దరఖాస్తులను వచ్చినట్లుగానే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆర్థిక సాయం మంజూరుకు సిఫార్సు చేస్తున్నారు. వీరందరికీ చెక్కులు అందించేందుకు తగు ఏర్పాట్లు చేసి లబ్ధిదారుల వివాహానికి ముందే రూ.లక్షా 116 చెక్కును అప్పగించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా ఆవిర్భావం అనంతర కాలం నుంచి నేటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరికీ రూ.120 కోట్లతో సుమారు 17 వేల మందికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయం చేరింది.

పారదర్శకతకు పెద్దపీట...
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం పెద్ద మొత్తంలో సాయం చేస్తున్న ప్రభుత్వం అర్హుల ఎంపిక, నిధుల మంజూరులో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నది. లబ్ధిదారులకు సాయాన్ని చెక్కుల రూపంలో అందిస్తున్నది. నేరుగా ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల చేతుల మీదుగా రెవెన్యూ అధికారుల సమక్షంలో ఈ చెక్కులను పంపిణీ చేస్తున్నారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ అయ్యేలా పక్కాగా పథకాన్ని అమలు చేస్తున్నది. పథకం అమలైన తొలినాళ్లలో లబ్ధిదారుల నుంచి కొంత మంది అక్రమార్కులు ముక్కు పిండి అక్రమంగా డబ్బులు వసూలు చేశారు. దీంతో పాటు రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో, తహసీల్ ఆఫీసుల్లోనూ దరఖాస్తు సమయంలో సందట్లో సడేమియాలు అమాయకులను మోసగించడం వంటివి వెలుగుచూశాయి. మరోవైపు చెక్కులు మంజూరైన తర్వాత కమిషన్ రూపంలోనూ కొంత మంది సిబ్బంది డబ్బులు వసూళ్లు చేసిన ఆనవాళ్లు ఉండడంతో ప్రభుత్వం పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. లబ్ధిదారులకు సాయాన్ని చెక్కుల రూపంలో సర్కారు అందిస్తున్నది.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles