టీయూ ఈసీకి మోక్షమెప్పుడో!

Sat,November 16, 2019 12:24 AM

-వర్సిటీ ఏర్పడి పుష్కరం పూర్తి
-పూర్తిస్థాయి పాలక మండలి(ఈసీ) ఏర్పాటుకు తప్పని నిరీక్షణ
- తాజాగా కేయూకు పూర్తిస్థాయి ఈసీ నియామకం
-ప్రభుత్వ త్వరగా ఏర్పాటు చేయాలని విద్యావేత్తలు, విద్యార్థుల విజ్ఞప్తులు
డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పడి పుష్కర కాలం పూర్తయ్యింది. ఇప్పటి వరకు విశ్వవిద్యాలయానికి పూర్తిస్థాయి పాలక మండలి(ఈసీ) లేకుండా పోయింది. 2007లో అప్పటి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పాలక మండళ్లను రద్దు చేశారు. కొలీజియం ఏర్పాటు చేసి కొత్త పాలక మండళ్లను నియమిస్తారని ఆశించినా, అది కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా అప్పటి నుంచి ప్రభుత్వ అధికారులతో కూడిన ఈసీనే కొనసాగుతూ వస్తోంది. విశ్వవిద్యాలయంలో ఉద్యోగాల నియామకాలు చేపట్టాలన్నా, విధాన నిర్ణయాలు తీసుకోవాలన్నా పాలక మండలి తప్పకుండా ఉండాల్సిందే. కీలక నిర్ణయాల్లో ఈసీనే కీలకపాత్ర పోషిస్తుంది. అధికారులతో కూడిన పాలక మండలే ఉండడం మూలంగా విశ్వవిద్యాలయానికి పూర్తిస్థాయి ఈసీ లేకపోవడంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు తీసుకురావడంలో అధికారులు విఫలమవుతున్నారు. వర్సిటీ అభివృద్ధి సాధించాలన్నా, నిధుల కొరత తీరాలన్నా పూర్తిస్థాయి పాలక మండలిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు ఇటు పాలకులు.. అటు ఉన్నతాధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉంది.

సభ్యుల పేర్లు సిఫారసుకు ఆదేశం...
ఇటీవల వరంగల్ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి పాలక మండలిని నియమించింది. ఈ నేపథ్యంలో టీయూకు సైతం పూర్తిస్థాయి పాలక మండలిని నియమించే అవకాశం ఉందని వర్సిటీ ఆచార్యులు భావిస్తున్నారు. తాజాగా పాలక మండలి సభ్యుల కోసం వర్సిటీలోని సీనియర్ ఆచార్యులతో పాటు ప్రిన్సిపాళ్లు, అనుబంధ కళాశాలలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, అధ్యాపకుల కోటా నుంచి పేర్లను పంపాలని ప్రభుత్వం కోరినట్లు సమాచారం. ఇందులో ఆర్థిక, కాలేజీయేట్, ఉన్నత విద్యాశాఖల నుంచి కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. వర్సిటీ ఉపకులపతి అధ్యక్షుడిగా, రిజిస్ట్రార్ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. కోటాల నుంచి సభ్యులతో పాటు పరిశ్రమలు, విద్యా, సంస్కృతి, వ్యవసాయం, వాణిజ్య, ప్రజాసేవా, సామాజిక సేవా, న్యాయసేవా అంశాల్లోని నిపుణులను సభ్యులుగా నియమిస్తారు. కొత్త గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ బాధ్యతలు స్వీకరించడంతో అన్ని విశ్వవిద్యాలయాలకు పూర్తిస్థాయి పాలక మండళ్లు ఏర్పాటు చేస్తారని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా,కాకతీయ విశ్వవిద్యాలయాల తర్వాత టీయూనే పెద్దది. కేయూకు పాలకమండలిని ఏర్పాటు చేసిన నేపథ్యంలో, టీయూకు సైతం పాలకమండలి ఏర్పాటు చేయాలని వినతులు వెల్లువెత్తుతున్నాయి.

ఈసీ నియామకంతో మేలు...
తెలంగాణ విశ్వవిద్యాలయానికి పూర్తిస్థాయి పాలక మండలి(ఈసీ)ని ఏర్పాటు చేస్తే ఉపయోగాలు భారీగానే ఉంటాయి. వర్సిటీలో అభివృద్ధి పనులకు నిర్ణయాలను ఈసీ తీసుకుంటుంది. తద్వారా పనులు త్వరితగతంగా సాగుతాయి. వర్సిటీకి నిధులు రాబట్టడంలో ఈసీనే కీలక పాత్ర పోషిస్తుంటుంది. ఆ విధంగా వచ్చే నిధులతో వర్సిటీలో ఆధునిక సౌకర్యాలు కల్పించే వీలుంటుంది. ఇప్పటికే టీయూలో బోధన, బోధనేతర సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది. ఆ లోటు తీరాలంటే పూర్తిస్థాయి ఈసీ ఏర్పాటు ప్రధానం. వర్సిటీలోని ఖాళీలు భర్తీ చేయాలంటూ ఈసీ ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. తద్వారా వర్సిటీలోని ఖాళీ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంటుంది. వీటితో పాటు విశ్వవిద్యాలయంలో ఎలాంటి అభివృద్ధి పనులు సాగాలన్నా, పూర్తిస్థాయి పాలక మండలి ఉంటేనే సాధ్యమవుతుంది. కేయూకు ఈసీని నియమించిన నేపథ్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయానికి సైతం పాలక మండలిని ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles