బాన్సువాడను అభివృద్ధి చేయడమే ధ్యేయం

Wed,November 13, 2019 02:32 AM

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : బాన్సువాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బాన్సువాడ డివిజన్‌ కేంద్రంలోని పాత బాన్సువాడ గూడెం గల్లీ కాలనీలో నిర్మిస్తున్న 15 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణ పనులను, సంగమేశ్వర్‌ కాలనీలో రూ. 50 లక్షలతో నిర్మిస్తున్న జనరల్‌ ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం కాలనీవాసులతో మాట్లాడారు. పాత బాన్సువాడలో కిరాయి ఇండ్లు, గుడిసెల్లో జీవనం గడుపుతున్న ప్రతి ఒక్కరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. సంగమేశ్వర కాలనీలో ఇప్పటికే సుమారు 170 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేశానని, పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. సంగమేశ్వర కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ. 10 కోట్లు, పాత బాన్సువాడ లో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణాలకు రూ. 10 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. కాలనీ వాసులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గూడెంగల్లీ లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అనంతరం కల్కి చెరువుకట్టపై పర్యటించి మినీ ట్యాంకు బండ్‌పై కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కట్టపై నిర్మిస్తున్న బీటీ పనులను వేగవంతం చేయించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రూ. 40 కోట్లతో బాన్సువాడ మెయిన్‌ రోడ్డు పనులు, రూ. 20 కోట్లతో మాతా శిశు దవాఖాన నిర్మాణం, సుమారు రూ. 7 కోట్లతో కల్కి చెరువు ( మినీ ట్యాంక్‌ బండ్‌) పనులు, మున్సిపాలిటీ పరిధిలోని అన్ని కాలనీల్లో రూ. 25 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామని వివరించారు. ప్రజలు గ్రామాలను శుభ్రంగా ఉంచేందుకు కృషిచేయాలని కోరారు.

చిన్నారులతో గోళీలాట...
కొత్త బాన్సువాడ నుంచి సంగమేశ్వర కాలనీ వెళ్లే దారిలో చిన్నారులు గోళీల ఆట ఆడుతుండగా వారిని పలకరించి, వాహనంలో కూర్చొని కాసేపు గోళీల ఆట ఆడి చిన్నారులను సంతోషపర్చారు. చిన్నారులు కాలనీ వాసులతో ఈ విషయాన్ని చెప్పుకొని మురిసిపోయారు.

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం..
సంగమేశ్వర కాలనీకి చెందిన టీ న్యూస్‌ విలేకరి సోదరుడు యశ్వాల్‌ అనారోగ్యతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ వారం క్రితం మృతిచెందాడు. బాధిత కుటుంబాన్ని స్పీకర్‌ పరామర్శించారు. యశ్వాల్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని తెలుసుకున్న స్పీకర్‌.. పీజీ పూర్తయిన తర్వాత ఒకరికి ఔట్‌ సోర్సింగ్‌లో ఉద్యోగం పెట్టించాలని, చిన్న కూతురుకు విద్య వలంటీర్‌గా ఉపాధి చూపాలని పీఏ భగవాన్‌ రెడ్డికి సూచించారు. డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు దొడ్ల వెంకట్రామ్‌ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ నార్ల సురేశ్‌ గుప్తా, మాజీ జడ్పీటీసీ కొత్తకొండ భాస్కర్‌, జడ్పీ కో ఆ ప్షన్‌ మాజీ సభ్యుడు అలీమొద్దీన్‌ బాబా, జుబేర్‌, కనుకుంట్ల రాజు, నర్సుగొండ, నార్ల ఉదయ్‌, దాసరి శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల కార్యదర్శి లింగమేశ్వర్‌, వీరారెడ్డి, అర్బాస్‌, విఠల్‌ రెడ్డి, రక్కిరెడ్డి నర్సింహారెడ్డి, మట్టసాయిలు, వెంకటి, సత్యం తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు అభినంధన
బాన్సువాడ డివిజన్‌ కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో ఇటీవల నిర్వహించిన ఖేల్‌ కూద్‌ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు స్పీకర్‌ను ఆయన స్వగృహంలో కలిశారు. వారిని స్పీకర్‌ అభినందిచారు. మూడు జిల్లాల విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో బాన్సువాడ సరస్వతీ శిశు మందిర్‌ విద్యార్థులు ఏడు బంగారు, 5 వెండి, 8 కాంస్య పతకాలను సాధించారని పాఠశాల ఉపాధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి స్పీకర్‌కు వివరించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సంతోష్‌, శివ, శివకుమార్‌, సాయి కృష్ణ, ప్రధాన ఆచార్యులు బ్రహ్మనందం, మాతాజీలు సుశీల, సంధ్య, సంగీతబాయి తదితరులు పాల్గొన్నారు.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles