సీనియర్ న్యాయవాది రమేశ్‌రెడ్డి కన్నుమూత

Mon,November 11, 2019 01:04 AM

నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది రమేశ్‌రెడ్డి (68) ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో హైదరాబాద్‌లోని తన స్వగృహంలో మృతి చెందారు. గుండె సంబంధిత వ్యాధితో ఆయన కొంత కాలంగా బాధపడుతున్నారు. ఇటీవల రక్త నాళాల్లో ఇబ్బందులు ఎదురు కావడంతో ఓ ప్రైవేట్ దవాఖానలో స్టంట్స్ వేయించుకున్నారు. ఆతర్వాత ఐదు రోజుల్లోపే మళ్లీ గుండె పోటు వచ్చి మృతి చెందారు.

తెలంగాణ ఉద్యమకారుడు..
రమేశ్‌రెడ్డి 1979లో ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ కళాశాలలో న్యాయ శాస్త్రంలో ఉత్తీర్ణులయ్యారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో సభ్యత్వం స్వీకరించి నిజామాబాద్‌లో న్యాయవాదిగా పనిచేశారు. టీడీపీ పుట్టుక నుంచి క్రియాశీలక పాత్ర నిర్వహించారు. నిజామాబాద్ పురపాలక సంఘం కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం పురపాలక సంఘం స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. ఇంద్రరెడ్డి స్థాపించిన తెలంగాణ ఉద్యమ సమితిలో చేరి తెలంగాణ ఉద్యమానికి జిల్లాలో నేతృత్వం వహించారు. జిల్లా కోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా, సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహించారు. 1991లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. న్యాయవాది రమేశ్‌రెడ్డి మృతి నేపథ్యంలో సోమవారం బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరుచూరి శ్రీధర్ తెలిపారు. రమేశ్‌రెడ్డి మృతదేహం సోమవారం ప్రగతినగర్‌లోని ఆయన స్వగృహానికి చేరుకుంటుందని, రమేశ్‌రెడ్డ్డికి భార్య అమృతారెడ్డి, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు, ఒక కుమార్తె అమెరికాలో ఉన్నందున వారు రాగానే మంగళవారం అంత్యక్రియలు జరగనున్నట్లు శ్రీధర్ తెలిపారు.

24
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles