విలీన గ్రామాల్లో ఎల్‌ఆర్‌ఎస్ సంబురం..!

Sun,November 10, 2019 12:53 AM

-అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అనుమతి
-కామారెడ్డి మున్సిపాలిటీలో ఏడు గ్రామాలకు ఊరట
-జనవరి 14 వరకు గడువు కేటాయించిన ప్రభుత్వం
-ఏడాది కాలంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన వెంచర్లు
-ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల్లోనూ వెసులుబాటు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు గత నెలలో జీవోను జారీ చేసింది. సర్కారు తీసుకున్న నిర్ణయంతో కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని వెంచర్లకు క్రమబద్దీకరణ కు అవకాశం లభించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాత మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లోనూ ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేస్తూ మరో జీవోను విడుదల చేసింది. దీంతో కామారెడ్డి మున్సిపాలిటీలోనూ విలీన గ్రామాల పరిధిలోని స్థలాలకు క్రమబద్ధీకరణ అవకాశం దొరికింది. జీవో నంబర్ 261 ప్రకారం జిల్లా కేంద్రానికి శివారు ప్రాంతాలైన దేవునిపల్లి, అడ్లూర్, లింగాపూర్, సారంపల్లి, పాతరాజంపేట, రామేశ్వరపల్లి, టేక్రియాల్‌లో క్రమబద్ధీకరణ సంబురం వ్యక్తం అవుతోంది. జిల్లా ఏర్పాటు సమయంలో ఇష్టానుసారంగా ఏర్పాటు చేసిన వెంచర్లలో సామాన్యులకు రూ.లక్షల్లో ఇళ్ల స్థలాలను కట్టబెట్టి చేతులు దులుపుకొని రూ.కోట్లు దండుకున్నారు. ఈ ప్రాంతాల్లో వ్యాపారుల చేతుల్లో మోసపోయిన ఇళ్ల స్థలాల యజమానులకు ప్రభుత్వం కల్పిస్తోన్న క్రమబద్ధీకరణ పథకం మేలు చేకూర్చనుంది. ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీ పరిధి మొత్తంలో ఈ పథకం వర్తించనుంది.

ఎల్లారెడ్డి, బాన్సువాడలో భారీ స్పందన...
అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరోమారు పచ్చజెండా ఊపింది. గతంలో ఈ పథకాన్ని అన్ని పురపాలికలకు వర్తింపజేయగా ఈ సారి మాత్రం నిబంధనలను సవరించారు. 2018, ఆగస్టు 2న ఏర్పడిన కొత్త పురపాలక సంఘాలకు మాత్రమే వర్తించేలా ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.క్రమబద్ధీకరణ పథకం అమలుతో కొత్త పురపాలికలు ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలు మెరుగుపడ్డాయి. గతేడాది మార్చి 30వ తేదీ లోపు రిజిస్ట్రేషన్లు చేసుకున్న లేఔట్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. తాజా క్రమబద్ధీకరణ విధానం పరిధిలోకి బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలు మాత్రమే రానున్నాయి. వాస్తవానికి గతేడాది ప్రభుత్వం కొత్త పురపాలికల ప్రకటన జారీ చేయగానే ఆయా ప్రాంతాల చుట్టు పక్కల ఉన్న భూముల ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. స్థిరాస్తి వ్యాపారుల పుణ్యమా అంటూ ఎందుకూ పనికి రాని భూములకు సైతం రూ.లక్షల్లో ధరలు పెంచేశారు.

దీంతో పలు చోట్ల అక్రమ లేఔట్లను ఏర్పాటు చేసి ఇంటి స్థలాలకు విక్రయించారు. ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర రహదారులకు సమీపంలో ఉన్న భూములను స్థిరాస్తి వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేసి భూముల్లో అక్రమ వెంచర్లను ఏర్పాటు చేశారు. తక్కువ ధరకే ప్లాట్లు వస్తుందని, వాయిదా సొమ్ము చెల్లింపు పూర్తికాగానే అన్ని అనుమతులు వచ్చేలా చూస్తామని అమాయకులను నమ్మించి విక్రయించినా.. ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు, సౌకర్యాలు కల్పించలేదు. నాలుగు రాళ్లు హద్దులుగా చూపిస్తే ఇదే మీ ప్లాటు స్థలమని అడ్డగోలుగా అంటగట్టారు. తాజా క్రమబద్ధీకరణ పథకం వర్తించనున్న జాబితాలో జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ ఉండడంతో ఈ ప్రాంతంలో అక్రమంగా వెలిసిన వెంచర్లకు మంచి అవకాశం లభించినట్లు అయ్యింది.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles