లింగంపేట: యాసంగిలో వరి సాగు చేసే రైతులు ఈ నెల రెండోవారం.. 15వ తేదీ తరువాత నారుమళ్లు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేంద్రయ్య సూచించారు. మండలంలోని నాగారం గ్రామంలో గురువారం క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్ రెండో వారంలో నారుమళ్లు వేసిన వారు జనవరి 15 లోపు నాట్లు వేసుకోవచ్చని తెలిపారు. ఆ తరువాత నాట్లు వేస్తే అకాల వర్షాలతో పంటనష్టం వాటిల్లే అవకాశముందన్నారు. నాట్లు వేస్తున్న సమయంలో కాలిబాటలు వదలాలని, సాలు నాట్లు (జపాన్ విధానం) వేసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.
అదే గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో సాలు పద్ధతిని చూపించారు. నాటుకు ముందు అడగులో డీఏపీ మందు వేసుకోవాలన్నారు. భూసార పరీక్షలు చేయించుకొని అధికారుల సూచనల మేరకే ఎరువులు వాడాలన్నారు. యాసంగిలో వరిపంటకు నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఏడీఏ రత్నం, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విఠల్‌రెడ్డి, మండల వ్యవసాయశాఖ అధికారి సాయి రమేశ్‌గౌడ్, కోర్పోల్ సర్పంచ్ మంజుల, ఉప సర్పంచ్ సాయవ్వ, ఏఈవోలు ప్రశాంత్, సంతోష్, ఖలీల్, పంచాయతీ కార్యదర్శి అశ్వాఖ్, రైతుసమన్వయకర్త అంజయ్య తదితరులు పాల్గొన్నారు.