బస్ పాస్..

Tue,October 22, 2019 02:19 AM

-ప్రారంభమైన విద్యాసంస్థలు..
-ఉదయం నుంచే తరలిన ఆర్టీసీ బస్సులు
-విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
-అన్నిరూట్లలో బస్‌పాస్‌లకు అనుమతి
-కౌంటర్ల వద్ద బారులు తీరిన విద్యార్థులు
-కిటకిటలాడిన ప్రయాణ ప్రాంగణాలు
-కనిపించని సమ్మె ప్రభావం

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : ఆర్టీసీ జేఏసీ సమ్మె ప్రభావం సోమవారం ఎక్కడా కనిపించలేదు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 17వ రోజుకు చేరుకుంది. సోమవారం విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో బస్టాండ్ ప్రాంతం విద్యార్థులు, ప్రయాణికులతో కిటకిటలాడింది. అధికారులు రద్దీకి అనుగుణంగా బస్సు ట్రిప్పులను పెంచారు. అన్ని ఫ్లాట్ ఫాంల వద్ద ప్రయాణికుల కోసం బస్సులు సిద్ధంగా ఉంచుతున్నారు. పోలీసు, రెవెన్యూ, రవాణా, ఆర్టీసీ ఆయా శాఖల అధికారులు సమన్వయంతో బస్సులను అన్ని రూట్లలో తరలిస్తున్నారు. సోమవారం ఆర్టీసీ నుంచి 95 బస్సులు అద్దె బస్సులు 33 నడిపించారు. నాన్‌స్టాప్ బస్సులతో పాటు పల్లె వెలుగు బస్సులు ప్రజారవాణాను కొనసాగించాయి.

సమన్వయంతో ముందుకు
ఆర్టీసీ అధికారులు ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఆర్టీసీ బస్సులను సోమవారం జోరుగా నడిపారు. సోమవారం కళాశాలలు, పాఠశాలలు విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా రూట్లలో బస్సు ట్రిప్పులను పెంచారు. ఆర్టీసీ బస్టాండ్‌లో బస్‌పాస్ కౌంటర్ల వద్ద విద్యార్థుల సందడి కనిపించింది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఎక్కడా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూశారు. దీంతో అన్ని వర్గాల ప్రయణికులకు ఊరట లభించింది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో అన్ని రూట్లలో బస్సుల సంఖ్యను పెంచారు.

కామారెడ్డి డిపోలోని బస్సు పాసుల వివరాలు
ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు బస్సు పాసుల సౌకర్యం కల్పించింది. కామారెడ్డి డిపో నుంచి ప్రతి రోజు బస్సు పాసులపై తిరిగే వారి వివరాలు ఇలా ఉన్నాయి. డివిజన్‌లోని పలు గ్రామాల నుంచి కళాశాలలకు వచ్చే విద్యార్థులకు నెలవారీగా 10,885 మందికి, 18 సంవత్సరాలలోపు ఉచితంగా 3717, 12 సంవత్సరాలలోపు ఉన్న వారికి ఉచితంగా 1543 మందికి, జర్నలిస్టులకు జిల్లా పరిధిలో 95 మందికి, జిల్లా,రాష్ట్రంలో 63 మంది బస్సు పాసులు పొంది ఉన్నారు. జిల్లాలో దివ్యాంగులు 5017 మందికి, ఎస్కార్ట్‌గా ఉన్న 611 మందికి, 2896 మంది విద్యార్థులు మూడు నెలల పాసులు కలిగి ఉన్నారు. కామారెడ్డి డిపో నుండి ప్రతి రోజు 24898 మంది బస్సు పాసులపై ప్రయణిస్తున్నారు.

కార్మికుల నిరసన
కార్మికులు సోమవారం వారి కుటుంబ సభ్యులతో బస్టాండ్ అవుట్ గేట్ వద్దకు తరలివచ్చి ఆందోళన చేపట్టారు. అనంతరం బస్టాండ్ నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు ర్యాలీని నిర్వహించి మానవహారం చేపట్టారు. టెంట్ వద్దకు చేరుకుని వంటవార్పు చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళలు బతుకమ్మలు ఆడారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles