విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా..

Tue,October 22, 2019 02:18 AM

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : సోమవారం నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 4 గంటల నుంచే బాన్సువాడ డిపో నుంచి అన్ని రూట్లకు బస్సులను పంపించారు. పాఠశాలలు, కళాశాలల ప్రారంభ సమయానికి గమ్యస్థానాలకు చేర్చారు. బాన్సువాడ నోడల్ అధికారి, బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది ఉదయమే డిపోకు చేరుకున్నారు. తాత్కాలిక కండక్టర్లకు టిక్కెట్ మిషన్లను పంపిణీ చేసి బస్సులను తరలించారు. విద్యార్థులు, దివ్యాంగుల పాస్‌లు బాన్సువాడ డిపో పరిధిలో 5,500 వరకు ఉన్నాయి. విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో బస్సుల్లో పాస్‌లకు అనుమతించారు. బాన్సువాడ డిపో పరిధిలో 64 ఆర్టీసీ బస్సులను, 14 హైర్ బస్సులను అన్ని రూట్లకు పంపారు.

టిమ్స్‌తో పెరిగిన ఆదాయం
ఆర్టీసీ కార్మికులు సమ్మెతో మొదటి రెండు, మూడు రోజులు ఇబ్బందులు ఎదుర్కొన్నా అటుతర్వాత అధికారులు సమన్వయంతో ముందుకు సాగడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తడంలేదు. ఆర్టీసీ ఆదాయం పెరిగేలా చర్యలు చేపట్టారు. కలెక్టర్ ఆదేశానుసారం వంద శాతం బస్సులు నడిపేలా ఆర్టీసీ డీఎం ఆ మేరకు ఏర్పాటు చేశారు. మొదట తాత్కాలిక కండక్టర్లకు టిక్కెట్లు ఇచ్చే మిషన్లపై అవగాహన లేకపోవడంతో ప్రారంభంలో డబ్బులు తీసుకొని టిక్కెట్లు ఇవ్వకుండానే నడిపారు. దీంతో ఆదాయానికి గండిపడుతుందని ఆలోచించిన ఆర్టీసీ నోడల్ అధికారులు టిక్కెట్లు ఇచ్చే మిషన్లపై తాత్కాలిక సిబ్బందికి అవగాహన కల్పించారు. టిక్కెట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో రోజు రోజుకూ ఆర్టీసీ ఆదాయం పెరుగుతున్నదని డీఎం సాయన్న తెలిపారు.

బస్సులను పెంచే యోచనలో అధికారులు
17 రోజులుగా బస్సులను అన్ని రూట్లలో నడిపేలా కృషి చేస్తున్న అధికారులు విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో మరిన్ని బస్సులు పెంచేలా కృషి చేస్తున్నారు. సోమవారం 66 ఆర్టీసీ బస్సులను పంపిన అధికారులు ప్రయాణికుల రద్దీ మేరకు మరిన్ని బస్సు రూట్లను పెంచుతామని, ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణికులకు, విద్యార్థులకు ఇబ్బందులు కలుగనివ్వమని ఆధికారులు చెబుతున్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles