ఇక పట్టణ ప్రణాళిక

Mon,October 21, 2019 12:24 AM

- పల్లెల స్ఫూర్తితో అడుగులు వేయనున్న పురపాలక శాఖ
-ఇప్పటికే ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశం
-మున్సిపాలిటీల వారీగా సిద్ధమవుతున్న కార్యాచరణ
-పట్టణ ప్రణాళికతో పారిశుద్ధ్యం, కరెంట్ సమస్యలకు చెక్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీల్లో అడుగడుగునా పాతుకుపోయిన అవినీతి, నిర్లక్ష్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు నూతన పురపాలక చట్టం - 2019 ఉపయోగపడనుంది. అవినీతిపరులను శాశ్వతంగా కార్యాలయాల నుంచి ఇంటిముఖం పట్టించనుంది. ఆన్‌లైన్ ఆధారంగా ఈ-గవర్నెన్స్‌కు పెద్ద పీట వేయడం మూలంగా సేవల్లో పారదర్శకత పెరగనుంది. గ్రామ పంచాయతీల్లో 30 రోజుల ప్రణాళిక సాధించిన పారిశుద్ధ్య ప్రగతి స్ఫూర్తితో పట్టణాల్లోనూ ప్రణాళిక రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇందుకోసం ప్రతి పట్టణానికి సంబంధించిన సమగ్రమైన పారిశుద్ధ్య ప్రణాళిక(సిటీ శానిటేషన్ ప్లాన్) తయారు చేసి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు సమర్పించాలని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇదివరకే ఆదేశాలు ఇచ్చారు. 30 రోజుల ప్రణాళికతో గ్రామ పంచాయతీల్లో సత్ఫలితాలు వచ్చాయి. పట్టణాల్లోనూ ఇదే మాదిరి కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టబోతున్నారు. చెత్త సేకరణ నుంచి రీసైక్లింగ్ వరకు అన్ని వివరాలతో ప్రతి పట్టణంలోనూ పారిశుద్ధ్య ప్రణాళికను తయారు చేయనున్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్ మార్గదర్శకాల మేరకు పురపాలికల్లో పారిశుద్ధ్య కార్మికులు, చెత్త సేకరణ వాహనాల సంఖ్య ఉండేలా జాగ్రత్త తీసుకోనున్నారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అంశాలపై పురపాలక శాఖ దృష్టి సారించబోతోంది. ఇప్పటికే పాత మున్సిపాలిటీల్లో స్వచ్ఛ ఆటోలను అందజేశారు. ఇంకా అవసరం ఉంటే వాహనాలు అందివ్వడం, సిబ్బందిని పెంచుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. పారిశుద్ధ్య కార్మికునికి యూనిఫాంతో పాటు అవసరమైన రక్షణ సామగ్రిని సమకూర్చనున్నారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐ తదితర సౌకర్యాలు కల్పించేలా ఆయా ఏజెన్సీలను ప్రభుత్వం ఆదేశించింది. పంచాయతీ సిబ్బందికి ఇస్తున్న విధంగానే పురపాలక సిబ్బందికి కూడా ప్రభుత్వ బీమా సౌకర్యాన్ని కల్పించే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

డంపింగ్ యార్డు ఉండేలా...
గ్రామాల్లో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక స్థల సేకరణ ఇబ్బందులు 30 రోజుల కార్యక్రమంతో తొలిగిపోయాయి. అధికారులే స్వయంగా గ్రామాలకు వెళ్లి స్థలాలను వెతికి డంపింగ్ యార్డు, వైకుంఠధామా ల నిర్మాణానికి నిర్ణయించారు. ఇదే విధంగా ప్రతి పట్టణంలోనూ డంపింగ్ యార్డు ఉండేలా, అవి లేని చోట వెంటనే స్థల సేకరణకు చర్యలు తీసుకునేలా కసరత్తు చేయనున్నారు. విధిగా డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలు ఓపెన్ డెనకేషన్ ఫ్రీ(ఓడీఎఫ్) అర్హత సాధించాయి. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఓడీఎఫ్ స్థాయిని అందుకునేలా చర్యలు చేపట్టబోతున్నారు. జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ వంటి మున్సిపాలిటీల్లో పూర్తి స్థాయిలో బహిరంగ మల విసర్జనను బహిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నారు. పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ, అవసరమైన చోట కొత్త వాటి నిర్మాణానికి అడుగులు పడనున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లలోని టాయిలెట్లను ప్రజలు ఉపయోగించుకునే అవకాశం కల్పించాలని, ఈ మేరకు వాటి యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.

అధికారుల కసరత్తు...
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ పుర కమిషనర్లు నివేదికల తయారీలో నిమగ్నమయ్యారు. మంత్రి సూచనల మేరకు గ్రామాలకు నిర్దేశించిన 30 రోజుల ప్రణాళిక మాదిరిగానే పట్టణ ప్రణాళిక అమలు తీరుతెన్నులను, అవసరాలను, పరిష్కారాలను పొందుపరుస్తున్నారు. నూతన మున్సిపాలిటీ చట్టం ప్రకారం పట్టణాల్లో పచ్చదనం పెంపు అధికార యంత్రాంగాని సవాల్‌తో కూడుకున్నది. చ ట్టంలో పేర్కొన్నట్లుగా గ్రీన్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దీనికి పూర్తి బాధ్యతగా జిల్లా కలెక్టర్ వ్యవహరించనున్నారు. అంతేకాకుండా హరిత మున్సిపాలిటీల కోసం బడ్జెట్‌లో 10శాతం నిధులను ప్రత్యేకంగా కేటాయించడంతో పాటు నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలను బతికించుకోవాల్సి ఉంది.

ప్రతి పట్టణంలోనూ నర్సరీల నిర్వహణ, పట్టణ శివారుల్లో గ్రీన్ లంగ్ స్పేస్‌లను ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని ఆకుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అడవులను 33శాతానికి పెంచేందుకు కోట్లాది మొక్కలను నాటుతున్నారు. హరితహారం కార్యక్రమం చేపడుతోన్న మొక్కల పెంపకాన్ని మున్సిపాలిటీల్లోనూ బాధ్యతగా చేపట్టేలా చర్యలు తీసుకుంటారు. ఆయా వార్డుల్లో సంబంధిత మున్సిపాలిటీ అధికారి, కౌన్సిలర్లు పచ్చదనం పరిరక్షణకు పాటుపడకపోతే వారిపై శాఖాపరమైన చర్యలను కొత్త చట్టం ప్రకారం తీసుకునే అవకాశం ఉంటుంది.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles