మూడేండ్ల తర్వాత మిగులు జలాలు వదిలిన అధికారులు...

Mon,October 21, 2019 12:20 AM

ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ఎస్సారెస్పీకి భారీగా వరద వస్తుండడంతో ప్రాజెక్టు మిగులు జలాలను దిగువకు వదులుతున్నారు. 2016 సంవత్సరం తర్వాత ఈ ఏడాదే ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. 2016లో ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో మిగులు జలాలను ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా 321 టీఎంసీలు గోదావరిలోకి వదిలారు. మళ్లీ ఈ ఏడాది మిగులు జలాలు 6వేల క్యూసెక్కులు ఆదివారం వదిలారు. ఈ వానాకాలం ప్రారంభమైనా ఎగువ నుంచి జూలై, ఆగస్టు నెలల్లో ఆశించిన స్థాయిలో వరద ఎస్సారెస్పీకి రాలేదు. దీంతో ఆయకట్టు రైతులు నిరాశ చెందారు. సెప్టెంబర్ నెలలో భారీగా ఇన్‌ఫ్లో కొనసాగింది. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరిగింది. అక్టోబర్‌లో ప్రాజెక్టు నిండకుండలా మారింది. ఎగువన మహారాష్ట్రలోని ప్రాజెక్టులు విష్ణుపురి, బాలేగావ్,అముదుర, గైక్వాడ్, బాబ్లీ పూర్తిస్థాయిలో నిండడంతో మిగులు జలాలను దిగువకు వదిలారు.

దీంతో పాటు నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో గోదావరి పరీవాహకంలో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలోకి చేరింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, ఆదివారం సాయంత్రానికి 1090 అడుగులు (84.841టీఎంసీల) నీటినిల్వకు చేరింది. ఆదివారం ఎగువ నుంచి 38,216 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. ఎగువన మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు నుంచి శనివారం సాయంత్రం మిగులు జలాలను గోదావరిలోకి వదిలారు. మొదట 20వేల క్యూసెక్కులు వదిలారు. ఆ తర్వాత 40 వేల క్యూసెక్కులకు పెంచారు. దీంతో ఆ వరద నీరు ఎస్సారెస్పీలోకి చేరుకోవడానికి 38 గంటలు పడుతుందని ఎస్సారెస్పీ డీఈ జగదీశ్ తెలిపారు. అలాగే మూడు రోజులుగా గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద వస్తోంది. ఆదివారం రాత్రి ప్రాజెక్టు నీటిమట్టం 1091.00 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు నీటిని వృథా చేయకుండా కాకతీయ కాలువ ద్వారా మిగులు జలాలను దిగువకు వదులుతున్నారు.

జెన్‌కో కేంద్రంలో విద్యుదుత్పత్తి...
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో మిగులు జలాలను వరద గేట్లతో వదిలితే నీరు వృథా అవుతుందని భావించిన అధికారులు, కాకతీయ కాలువకు నీటిని వదిలారు. దీంతో కాకతీయ కాలువకు అనుసంధానంగా ఉన్న జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది. మూడు టర్బయిన్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించనట్లు డీఈ శ్రీనివాస్ తెలిపారు. ఒక్కో టర్బయిన్‌తో 7.9 మెగావాట్లు, మూడు టర్బయిన్లతో మొత్తం 22.8 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందన్నారు.

69
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles