పూర్తిస్థాయి నీటిమట్టానికి ఎస్సారెస్పీ

Mon,October 21, 2019 12:20 AM

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ /మెండోరా : ఎస్సారెస్పీ ప్రాజెక్టు దాదాపు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరింది.ఎగువన మహారాష్ట్రలో విష్ణుపురి ప్రాజెక్టు నుంచి దిగువకు వదిలిన జలాలు 36 గంటల్లో ఎస్సారెస్పీకి చేరనున్నాయి.శనివారం సాయంత్రం విష్ణుపురి నుంచి తొలుత 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అనంతరం దిగువకు వదులుతున్న నీటిని 40 వేల క్యూసెక్కులకు పెంచారు. ఆదివారం సాయంత్రానికి ఎస్సారెస్పీలోకి 30,550 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం 1091 అడుగులు కాగా .. ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటి మట్టం 1090 అడుగులకు చేరింది.

ఈ మట్టం ఉన్న దశలోనే ఎస్సారెస్పీ నుంచి దిగువకు గోదావరిలోకి నీటిని వదలాల్సిన పరిస్థితి ఉన్నా, వృథాగా దిగువకు నీటిని వదలడం కన్నా ప్రాజెక్టులో విద్యుదుత్పత్తికి వినియోగించుకోవాలన్న ఆలోచనతో కాకతీయ కాలువకు ఆరు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, విష్ణుపురి నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో సోమవారం నాటికి ప్రాజెక్టుకు చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడో రేపో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని వదిలే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. 2016లో ప్రాజెక్టు నుంచి మిగులు జలాలను దిగువకు వదిలారు. కాగా, ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో యాసంగిలో సుమారు 5.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఢోకా లేని పరిస్థితి నెలకొంది.దీంతో రైతుల్లో ఆనందం నెలకొంది.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles