రక్తదానంపై అవగాహన కల్పించాలి

Sat,October 19, 2019 01:57 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : రక్తదానంపై ప్రజల్లో విస్త్రృత అవగాహన కల్పించాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.ఎస్పీ శ్వేతారెడ్డితో పాటు పోలీసులు, యువకులు పెద్ద సంఖ్యలో శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ... పోలీసులు నిర్వహించే సమాజ సేవా కార్యక్రమాల్లో రక్తదాన శిబిరాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని, పోలీసులు పెద్ద సంఖ్యలో రక్తదాన శిబిరాల్లో పాల్గొని యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. రక్తదానం చేసిన పోలీసు సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.

జిల్లాలో ఇప్పటివరకు 94 రక్తదాన శిబిరాలు నిర్వహించి 3560 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. రక్తదానం చేయడం ద్వారా రక్తహీనతతో బాధపడే గర్భిణులు, ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడిన వారమవుతామన్నారు. జిల్లా నుంచి చుట్టుపక్కల జిల్లాలకు కూడా రక్తాన్ని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ.. పోలీసు శాఖ ప్రజలకు సేవ చేసే కార్యక్రమాల్లో ముందుంటుందన్నారు. ఇందులో భాగంగానే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీఎస్పీ లక్ష్మీనారాయణ, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా జనరల్ సెక్రెటరీ రాజన్న, వైద్యులు శ్రీనివాస్, సిబ్బంది, పోలీసులు, యువకులు పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles