పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి

Wed,October 16, 2019 01:14 AM

నిజామాబాద్ క్రైం : అమరులైన పోలీస్ సిబ్బంది త్యాగాలు వెలకట్టలేనివని నిజామాబాద్ అదనపు డీసీపీ ఎం.శ్రీధర్‌రెడ్డి అన్నారు. విధి నిర్వహణలో భాగంగా వందలాది మంది సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టారని ఆయన గుర్తుచేశారు. జిల్లాలో పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 21వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా అమర పోలీసుల త్యాగాన్ని స్మరించుకున్నారు. వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు పలు అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మంగళవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మారం, పోచంపాడ్, కంజర ప్రాంతాలకు చెందిన తెలంగాణ సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, కళాశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులకు ఆయుధాలు,వాటి పనితీరు, వివరాల గురించి పోలీస్ సిబ్బంది, నిపుణులు తెలియజేశారు. డీసీపీతో పాటు పోలీస్ సిబ్బంది ఆయుధాల వాడకం, మెటర్ డిటెక్టర్ ఉపయోగం, శునకాలు(పోలీస్ డాగ్స్) పని విధానం, ఇతర పరికరాల ఉపయోగంపై విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా డీసీపీ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఎందరో పోలీసులు అమరులయ్యారని, వారి త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ఏటా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు. పోలీస్ సిబ్బంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శాంతిభద్రత పరిరక్షణలో నిమగ్నమవుతున్నారని తెలిపారు.

ఓపెన్ హౌస్...
303 తుపాకీ, ఎల్‌ఎంజీ గన్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల వాడకం, బీడీ టీం ఎక్విప్‌మెంట్స్, టియర్ గ్యాస్ వాడకం, మైక్‌సెట్ వాడకం, ఫింగర్ ప్రింట్ తదితర అంశాలను విద్యార్థులకు తెలియజేశారు. నైట్ విజన్, డే విజన్ ఫింగర్ ప్రింట్స్ కమ్యూనికేషన్, డాగ్ స్కాడ్ ,ట్రాఫిక్ సిబ్బంది అవగాహన కల్పించారు. జిల్లావ్యాప్తంగా వారం రోజుల పాటు విద్యార్థులకు అవగాహన సదస్సులు, వ్యాసరచన పోటీ లు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని డీసీపీ తెలిపారు. అనంతరం పోలీస్ అమరవీరుల సం స్మరణ దినోత్సవం సందర్భంగా వాల్‌పోస్టర్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీసీపీ ఎన్. భాస్కర్, రిజర్వు ఇన్‌స్పెక్టర్ శ్రీరామ్, నిరంజన్, హోంగార్డ్సు , రిజర్వు ఇన్‌స్పెక్టర్ శైలేందర్ ఆర్‌ఎస్సైలు, ఎన్‌ఐబీ ఏఎస్సై కృష్ణారెడ్డి, ఏఆర్, సివిల్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గ్గొన్నారు.

65
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles