స్పీడ్‌ పెంచిన ఆర్టీసీ

Sun,October 13, 2019 01:07 AM

- యథావిధిగా నడిచిన ఆర్టీసీ బస్సులు
- రెవెన్యూ సిబ్బందితో మానిటరింగ్‌

కామారెడ్డి నమస్తే తెలంగాణ / విద్యానగర్‌ : ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు బస్సుల సంఖ్యను పెంచారు. రద్దీకి అనుగుణంగా వివిధ రూట్లలో బస్సులు నడిచాయి. తాత్కాలిక సిబ్బంది సహకారంతో శనివారం జిల్లాలోని రెండు డిపోల పరిధిలో పెద్ద సంఖ్యలో బస్సులు నడిపారు.

ఆర్టీసీ బస్సులు అన్ని రూట్లలో నిర్విరామంగా తిరుగుతున్నాయి. ఎనిమిదో రోజైన శనివారం ఆర్టీసీ సమ్మె ప్రభావం కనిపించలేదు. కామారెడ్డి డిపో నుంచి అన్ని రూట్లలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ట్రిప్పులను పెంచుతున్నారు. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో బస్టాండ్‌ కిటకిటలాడింది. కామారెడ్డి డిపో నుంచి 82 ఆర్టీసీ బస్సులు, 35 అద్దె బస్సులు నడిపించారు. డిపో నుంచి కరీంనగర్‌, నిజామాబాద్‌, నిజాంసాగర్‌, జేబీఎస్‌, బాన్సువాడ, రామాయణ్‌ పేట్‌ తదితర ప్రాంతాలకు బస్సులు నడిపించారు. బస్టాండ్‌లో అన్ని రూట్లకు వెళ్లే బస్సులను ప్లాట్‌ఫాంలపై సిద్ధంగా ఉంచుతున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను యథావిధిగా నడిపిస్తున్నారు.

అన్ని రూట్లలో బస్సులు...
ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ డీఎం ఆంజనేయులు, డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎంవీఐ శ్రీనివాస్‌రావు సమన్వయంతో అన్ని రూట్లలో బస్సులు నడిచేలా ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచుతూ నడపడంతో బస్టాండ్‌లో బస్సుల సందడి కనిపించింది. అధికారులు దగ్గరుండి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు. ఎలాంటి ఆటంకాలు చోటు చేసుకోకుండా డీఎస్పీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

సమ్మెకు బీజేపీ నాయకుల మద్దతు
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా బీజేపీ నాయకులు తరలిరావడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్మికులకు సంఘీభావం తెలుపుతూ ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. పోలీసులు ఆర్టీసీ కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. మద్దతు తెలిపిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి, భాను ప్రకాశ్‌, రాజలింగం, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles