‘డబుల్‌' ఇండ్లు అమ్మితే జైలుకే..

Sun,October 13, 2019 01:06 AM

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : నిరుపేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన డబుల్‌ బెడ్‌ రూం పథకంలో ఇండ్లు నిర్మించి ఇచ్చానని, ఇచ్చిన ఇండ్లను అమ్మకానికి పెడితే జైలుకు పంపుతానని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి హెచ్చరించారు. బాన్సువాడ పట్టణంలోని బీడీ వర్కర్స్‌ కాలనీలో శనివారం ఆయన పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు. పేదవారిని సంతోషంగా ఉంచాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ను బతిమిలాడి రాష్ట్రంలో ఎవ్వరూ తేనన్ని ఇండ్లను మంజూరు చేయించినట్లు తెలిపారు. పేదల కళ్లలో సంతోషం కోసం కష్టపడి పనిచేస్తుంటే , ఇచ్చిన ఇండ్లను డబ్బులకు అమ్ముకొని పోతే చూస్తూ ఊరుకోనని స్పీకర్‌ కరాఖండిగా చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటికే 6 వేల డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు మంజూరై పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. బాన్సువాడ పట్టణంలోనే 2 వేల ఇండ్లు నిర్మించి పేదలందరికీ అందజేస్తానని, స్థలాలు ఉన్న అర్హులైన లబ్ధిదారులకు కచ్చితంగా ఇండ్లు మంజూరు చేస్తానని అన్నారు. కానీ స్పీకర్‌ పోచారంతో చెప్పించి ఇండ్లు మంజూరు చేయిస్తా అని, పైరవీలు చేసే వారికి ఏ ఒక్క రూపాయి ఇచ్చినట్లు తెలిసినా, పైరవీలకు డబ్బులు ఇచ్చినా వారి ఇండ్లను రద్దు చేస్తానని తేల్చి చెప్పారు. ఎవరైనా అధికారులు, అనధికారులు డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బీడీ వర్కర్స్‌ కాలనీలో కొంత మంది ఇండ్లు విక్రయిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అది నిజమైతే వారిని, ఇండ్లుకొన్న వారిని జైలుకు పంపడం ఖాయమన్నారు. నూతనంగా మరో 70 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారని వారికి ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. తాడ్కోల్‌ శివారులో నిర్మించిన 500 ఇండ్లతో పాటు పట్టణంలోని సికిందర్‌ కాలనీ, గూడెం గల్లీ తదితర అన్ని కాలనీల్లో కలిపి మొత్తం 2వేల ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. త్వరలోనే బాన్సువాడకు సీఎం కేసీఆర్‌ రానున్నారని, సీఎం సహకారంతో మరిన్ని ఇండ్లను మంజూరు చేసి పేద ప్రజలకు అందజేస్తామని వివరించారు. పారదర్శకంగా విచారణ చేపట్టి డివిజన్‌ కేంద్రంలో నిర్మించే డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల అర్హులను గుర్తించాలని తహసీల్దార్‌ సుదర్శన్‌ను స్పీకర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు దొడ్ల వెంకట్రాం రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, నాయకులు మహ్మద్‌ ఏజాస్‌, మాజీ ఎంపీపీ డాక్టర్‌ గంగాధర్‌, జడ్పీ మాజీ కోఆప్షన్‌ సభ్యుడు అలీమొద్దీన్‌ బాబా, గంగాధర్‌, అర్బాస్‌, గిర్దావర్‌ రామకృష్ణ, రెవెన్యూ సిబ్బంది సాయిబాబా, కాలనీవాసులు పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles