అప్పటి గ్యాంగ్‌మన్‌లే నయం

Sun,October 13, 2019 01:06 AM

బీర్కూర్‌: రోడ్లు భవనాల శాఖలో ఇప్పుడున్న అధికారులకన్నా అప్పటి గ్యాంగ్‌మన్‌లే బాగుండేవారని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని శనివారం ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రకాశ్‌రావు క్యాంపునకు చెందిన బొబ్బ సునీల్‌ బాబు దంపతులు ఆలయాభివృద్ధి కోసం రూ.లక్షా 25 వేల విరాళాన్ని స్పీకర్‌ చేతుల మీదుగా అందజేశారు. విరాళం అందించిన దాతలను స్పీకర్‌ ఘనంగా సత్కరించారు. అనంతరం ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌ శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో ఆలయ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ శాఖ అధికారుల పనితీరుపై స్పీకర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడున్న అధికారులకన్నా అప్పుడు ఉన్న గ్యాంగ్‌మన్‌లే బాగా పనిచేసేవారని అన్నారు.

అప్పటి రోజుల్లో రోడ్లపై చెంచాడు నీళ్లు నిలబడితే పారలతో తీసేవారని, ఇప్పుడు కిలోమీటరు దూరం వరకు రోడ్డుపై నీళ్లు ప్రవహించినా పట్టించుకునే వారు లేరని తెలిపారు. నస్రుల్లాబాద్‌ మండలంలోని బొమ్మన్‌దేవ్‌పల్లి చౌరస్తాలో రోడ్డుపై నీళ్లు నిలబడి గుంతలు పడితే మీరేం చేస్తున్నారంటూ ఆర్‌అండ్‌బీ డిప్యూటీ ఈఈ మదన్‌మోహన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై ఆ శాఖ అధికారుల చిత్తశుద్ధి తమకు కనబడుతోందని అన్నారు. బీర్కూర్‌ మండలానికి చెందిన ఏఈ భానుచందర్‌ ఎప్పుడూ కనిపించడని ఆగ్రహంతో వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే బీర్కూర్‌-కుర్లాపై నిర్మిస్తున్న మంజీరా వంతెన ఇప్పటికీ పూర్తి కావడం లేదని అన్నారు. ఈ ఏడాది చివరి వరకు కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెచ్చి వంతెనను పూర్తి చేసి, వంతెనకు రెండు వైపులా రోడ్లను కూడా పూర్తి చేయించాలని ఆదేశించారు. వర్ని - నిజామాబాద్‌, తాడ్కోల్‌ చౌరస్తా నుంచి బిచ్కుంద రోడ్‌, తిమ్మాపూర్‌, బీర్కూర్‌ మండల కేంద్రంలోని కమాన్‌ నుంచి సిద్ధి వినాయక ఇండస్ట్రీస్‌ వరకు చేపట్టాల్సిన రోడ్డు విస్తరణ పనులను త్వరగా చేయించాలన్నారు. దీపావళిలోగా కోనేరులో బోటింగ్‌ను ప్రారంభించేలా ఇరిగేషన్‌ అధికారులు చూడాలన్నారు.

కస్తూర్బా కళాశాలకు రూ.2.5 కోట్లు మంజూరు
బీర్కూర్‌ మండల కేంద్రంలోని కస్తూర్బా కళాశాల విద్యార్థినులకు వసతి కల్పించేందుకు రెండున్నర కోట్ల రూపాయలు మంజూరైనట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ తిలకేశ్వరి రఘు, ఆలయ కమిటీ సభ్యులు మద్దినేని నాగేశ్వర్‌రావు, ద్రోణవల్లి అశోక్‌, భోగవల్లి అప్పారావు, ద్రోణవల్లి సతీశ్‌, అవారి గంగారాం, కొరిపెల్లి రాంబాబు, ఢీకొండ మురళి, లాడేగాం వీరేశం, ఉప్పలపాటి సత్యనారాయణ, నర్సరాజు, లాడేగాం గంగాధర్‌, నాగప్ప, ప్రభు, ఆలయ మేనేజర్‌ ఆకుల మురళి తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles