రెండు రోజుల్లోగా రైతుల వివరాలు ఆన్‌లైన్ చేయాలి

Thu,October 10, 2019 04:01 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : డిజిటల్ సంతకాలు పూర్తికాని రైతుల వివరాలు రెండు రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ సత్యనారాయణ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జనహితభవన్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించి పంటల సాగు, ఆన్‌లైన్ నమోదుపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వానకాలంలో రైతులు వేసిన పంటల వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు కార్యక్రమాన్ని రెండు రోజుల్లోపు పూర్తి చేసుకోవాలని సూచించారు. వానాకాలంలో జిల్లాలో మొత్తం సాగుభూమి 5,37,427 ఎకరాలకు గాను 4,78,872 ఎకరాల్లో 90 శాతంతో పంట సాగు చేశారని తెలిపారు. జిల్లాలో మొత్తం 2,75,057 మంది రైతులకు గాను 2,52,860 రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయని... మిగిలిన 22,197 రైతుల్లో 16,498 రైతులు పంట సాగు చేయలేదని తెలిపారు.

మిగిలిన 5699 రైతుల వివరాలు రెండు రోజుల్లోగా నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 2,03,448 ఎకరాల్లో వరి, 89,707 ఎకరాల్లో మొక్కజొన్న 90,225 ఎకరాల్లో సోయాబీన్, 47,744 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారని వివరించారు. వ్యవసాయ విస్తీర్ణ అధికారులు కొనుగోలు కేంద్రాల్లోకి వచ్చిన ధాన్యంలో తేమ శాతం, తాలు పరిశీలించాలని, గ్రేడింగ్ చేయాలని తెలిపారు. ఆరబెట్టి తేమ తక్కువగా ఉండేలా తీసుకునే చర్యలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కనీస మద్దతు ధరలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.కార్యక్రమంలో జేసీ యాదిరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేంద్రయ్య, సీపీవో శ్రీనివాస్, ఇరిగేషన్ ఈఈ బన్సీలాల్, ఉద్యానవన శాఖ అధికారి శేఖర్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మండల అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles