గ్రామాల్లో మత్స్య సంబురం

Sun,September 15, 2019 12:47 AM

-కొనసాగుతున్న నాలుగో విడత కార్యక్రమం
-జిల్లాలోని 550 చెరువుల్లో 3.30 కోట్ల చేప పిల్లల విడుదల లక్ష్యం
-ఇప్పటి వరకు 250 చెరువుల్లో కోటీ 20 వేలు విడుదల
-డిసెంబర్ వరకు కొనసాగింపు
-రొయ్యల పెంపకంపైనా దృష్టి
-ఆరు చెరువుల గుర్తింపు
-హర్షం వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు

కామారెడ్డి నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం నీలి విప్లవానికి నాంది పలికింది. నాలుగు విడతలుగా వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను చెరువుల్లో వదులుతున్నారు. చేపల ఉత్పత్తిని పెంచి గంగపుత్రులు ఆర్థికంగా ఎదగడానికి తెలంగాణ ప్రభుత్వం దోహదపడుతుంది. ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీ నుంచి జిల్లాలో చేప పిల్లల విడుదలను ప్రారంభించారు. నేటి వరకు 250 చెరువుల్లో కోటీ 20 వేల చేప పిల్లలను విడుదల చేశారు. వర్షాలు ఆలస్యంగా కురవడంతో చెరువులు, కుంటలు, వాగుల్లో నీరు పుష్కలంగా చేరింది. ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబర్ మొదటి వారంలోపు జిల్లాలోని అన్ని చెరువులు, కుంటల్లో నీరు చేరింది. దీంతో చేప పిల్లల విడుదలను అధికారులు చేపట్టారు.

స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ నియోజక వర్గంలో పలు చెరువుల్లో చేపలు విడుదల చేయగా.. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ రంగ సముద్రం చెరువులో ఈనెల 8వ తేదీన చేపలు విడుదల చేశారు. జుక్కల్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎల్లారెడ్డి నియోజక వర్గంలో ఎమ్మెల్యే సురేందర్ చెరువుల్లో చేప పిల్లలు వదిలారు. వీరితో పాటు ఆయా చెరువుల్లో పలువురు ప్రజాప్రతినిధులు చేప పిల్లలను విడుదల చేస్తున్నారు.

21 వేల టన్నుల ఉత్పత్తి..
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల మేలు కోసం తలపెట్టిన చేప పిల్లల పెంపక కార్యక్రమం విజయవంతమవుతోంది. ఒకప్పుడు ఉపాధి కోసం బిక్కుబిక్కుమంటూ జీవనం గడిపిన ఆయా వర్గాలకు తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన కార్యక్రమంతో ఏడాదంతా చేతి నిండా పని దొరుకుతోంది. జిల్లాల పునర్విభజనకు ముందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొలి విడత కార్యక్రమం 2016-17 సంవత్సరంలో ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో 186 చెరువుల్లో కోటి రూపాయలతో కోటీ 15 లక్షల చేప పిల్లలను వదిలారు. వీటి ద్వారా 3,459 టన్నుల మేర చేప ఉత్పత్తులు వచ్చాయి. జిల్లాలోని మత్స్యకారుల కుటుంబాలకు రూ.20.76 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. 2017 -18లో 558 చెరువుల్లో రూ.2.48కోట్ల నిధులతో సుమారుగా మూడు కోట్ల చేప పిల్లలను వదిలారు. దీంతో 8,740 టన్నుల చేపలు ఉత్పత్పి కాగా రూ.70కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. 2018-19 సంవత్సరంలో 498 చెరువుల్లో రూ.2.40కోట్లతో 2.88 కోట్ల చేప పిల్లలను వదలడంతో రూ.66.39 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరింది. జిల్లాలో 11వేల మంది వరకూ మత్స్యకారులు ఉన్నారు. వీరికి కులవృత్తి ఒక్కటే ఆధారం. వీరందరికీ సీఎం కేసీఆర్ తీసుకు వచ్చిన చేప పిల్లల పెంపకం కార్యక్రమంతో భారీ ప్రయోజనం లభిస్తోంది.

ఈసారి లక్ష్యం 3.30 కోట్ల చేప పిల్లలు..
గతేడాది లక్ష్యంతో పోలిస్తే ఈసారి చేప పిల్లల సంఖ్యను భారీగా ప్రభుత్వం పెంచింది. వానలు అనుకున్న స్థాయిలో కురవడంతో పాటుగా చెరువులన్నీ చేప పిల్లల పెంపకానికి అనువుగా ఉండడంతో మత్స్యకారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి చెరువుల్లోకి జల సంపద పెరగడం మూలంగా చేప పిల్లల సంఖ్యను అందుకు తగ్గట్లుగా పెంచారు. గడిచిన మూడేళ్ల నుంచి కార్యక్రమం విజయవంతం కావడంతో పాటు మత్స్య కార్మికుల్లోనూ ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. సీఎం కేసీఆర్ రూ.వేల కోట్లతో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తలపెడుతున్నారు. మత్స్యకారుల నుంచి వస్తోన్న స్పందనను అనుసరించి భారీగా చేప పిల్లల అభివృద్ధి పథకాన్ని పటిష్టవంతంగా చేపట్టేందుకు సర్కారు సిద్ధం కావడం విశేషం. ఉచితంగా చేప పిల్లలను చెరువుల్లో వదలడం ద్వారా మత్స్యకారులకు రుణ భారం తప్పడంతో పాటుగా ఆర్థిక ప్రయోజనం కూడా పెద్ద ఎత్తున చేకూరుతోంది.

78
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles