అనూహ్యంగా పెరిగిన సాగు విస్తీర్ణం

Thu,September 12, 2019 12:55 AM

-అంచనాలకు భిన్నంగా వరి, మొక్కజొన్న, సోయా, పత్తి సాగు
-వానలు సమృద్ధిగా కురియడంతో సంబురంలో రైతన్నలు
-ఇప్పటి వరకు 34,731 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా
-నేడు మరో 15వేల మెట్రిక్ టన్నుల యూరియా రాక
-వెనువెంటనే రైతులకు అందిస్తున్న అధికారులు
-కృత్రిమ కొరత సృష్టిస్తే క్రిమినల్ కేసులకు ప్రభుత్వం ఆదేశం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 3,63,188 ఎకరాల్లో సాగు అంచనాలను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. ఇందుకు భిన్నంగా సెప్టెంబర్ 11వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా 4,61,150 ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నాయి. దాదాపుగా 127 శాతం మేర పంటలు సాగులోకి రావడంతో యూరియా వినియోగం అనూహ్యంగా పెరిగింది. ఎవరూ ఊహించని స్థాయిలో సాగు విస్తీర్ణం పెరగడంతో ఇప్పుడు యూరియాకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా పం టల సాగు ఆశాజనకంగా ఉంటుందన్న ఆశతో రైతులు యూ రియా కొనుగోలు కోసం పరుగులు పెడుతున్నారు. వరి, మొక్కజొన్న, సోయాబిన్, పప్పుదినుసులు, పత్తి, చెరుకు పంటలను రైతులు సాగు చేస్తున్నారు.

భారీ వానలతో చెరువులు, కుంటల్లోకి నీళ్లు వచ్చి చేరడంతో పొలాల్లో భిన్నమైన పంటలు కళకళ లాడుతున్నాయి. వానాకాలం సీజన్ ప్రారంభంలో వరుణ దేవుడు ముఖం చాటేయడంతో ఆగస్టు 2 వరకు జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. అప్పటి వరకు వివిధ రకాల పంట సాగు విస్తీర్ణం కేవలం 40 శాతం మించలేదు. ఆగస్టు 2వ తేదీ త ర్వాత భారీగా కురిసిన వానలతో జలాశయాల్లోకి నీరు వచ్చి చేరింది. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. అత్యధిక చెరువులు మత్తడి పోయడంతో ఆయకట్టు రైతులు కొంగొత్త హుషారుతో సాగుకు సిద్ధమయ్యారు. కళ్యాణి, సింగీతం, పోచారం ప్రాజెక్టులు నిండడంతో వారం, పది రో జుల నుంచి వరద గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ఈ ప్రాజెక్టుల కింద సాగుకు ఢోకా లేదన్న ధైర్యం రైతుల్లో కలిగింది. ఫలితంగా అనూహ్యంగా జిల్లా వ్యాప్తంగా సాగు పెరగడమే కాకుండా యూరియా అవసరం పెరగడంతో డిమాండ్ ఏర్పడింది.

సాగు అంచనాలు భిన్నంగా...
జిల్లాలో ఇప్పటి వరకు నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఈ విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తితే మాత్రం ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు ఊపిరి పోసినట్లు అవుతుంది. ఎగువన వానలు లేకపోవడం, వరద లేక నిజాంసాగర్ బోసిపోతుంది. సెప్టెంబర్ మరిన్ని భారీ వర్షాలు ఉన్నాయన్న సంకేతాల నేపథ్యంలో సాగు మరింత పెరిగే ఆస్కారం ఉందని అధికారు లు చెబుతున్నారు. ఆగస్టు మూడో వారం వరకు కామారెడ్డి జిల్లాలో వరి సాగు విస్తీర్ణం కేవలం 94,732 ఎకరాలుగా ఉంది. ప్రస్తుతం వరి సాగు విస్తీర్ణం 1,75,175 ఎకరాలకు చేరింది. అంటే దాదాపుగా వరి నాట్లు రెట్టింపు అయ్యింది. వ్యవసాయ శాఖ అంచనాలు కేవలం 1,00,195 ఎకరాలే కాగా ప్రస్తుతం 175 శాతం మేర వరి సాగవ్వడంతో అధికారులే విస్మయం చెందుతున్నారు.

మొక్కజొన్న సైతం సాధారణ విస్తీర్ణం 56,865 ఎకరాలే కాగా 75,710 ఎకరాలకు చేరింది. అంటే 133 శాతం మేర మొక్కజొన్న సాగవుతుంది. పప్పుదినుసుల పంటలు 38,410 ఎకరాలకు అంచనాలు సిద్ధం కాగా 48,102 ఎకరాలకు అంటే 125 శాతం మేర పంటలు విస్తరించాయి. పత్తి, సోయాబిన్ పంటలు కూడా అంచనాలను దాటా యి. పత్తి 35,708 ఎకరాలే సాగవుతుందని అంచనాలు సిద్ధం కాగా జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతా ల్లో 38,670 ఎకరాల్లో పత్తి పంటను వేశారు. సోయాబిన్ పంట 1,12,592 ఎకరాల్లో సాగవుతున్నది. వానలు ఆగస్టు నెలలోనే భారీగా దంచి కొట్టడంతో సాగుకు వెనుకడుగు వేసిన వారంతా పంటల సాగుకు మొగ్గు చూపారు.

సందట్లో సడేమియాలు...
వరికి సంబంధించి మొత్తం మూడు దశల్లో రైతులు యూరియా వేయాల్సిన అవసరం ఉంటుంది. మొదటి విడత దమ్ము చేసే సమయంలో ఆ తర్వాత పిలక దశలో, తర్వాత చిరుపొట్ట దశ లో యూరియాను వినియోగిస్తారు. చెరువులు, కుంటలు, బో ర్లు, బావులు, కాల్వల కింద వరి వేసిన రైతులకు ఇప్పుడు యూరియా అవసరం ఏర్పడింది. వాతావరణం అనుకూలించి భారీ వానలు కురవడంతో వినియోగం భారీగా పెరిగింది. యూ రియా అందుబాటులో ఉన్నప్పటికీ కృత్రిమ కొరతను చూపించి వ్యాపారులు రైతుల నుంచి భారీగా దోపిడీ చేస్తున్న ఘటనలు జిల్లాలోనూ వెలుగు చూస్తున్నాయి. పలు పీఏసీఎస్(ప్రాథమిక సహకార సంఘాలు) కేంద్రాల్లో యూరియాను ఎమ్మార్పీ ధరకే విక్రయించాల్సి ఉన్నా రైతులు అడిగిన కంపెనీ యూరియా తమ వద్ద లేదని వారు చెప్పడంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. ఇదే అదనుగా పలువురు
వ్యాపారులు డబ్బులు దండుకుంటున్నారు.

మొన్నటి వరకు ప్రతికూల పరిస్థితులు ఉండడంతో రైతులు వాన కోసం ఎదురు చూశారు. ఇప్పుడు వానలు కురిశాక పంటల సాగును వేగవంతం చేశారు. యూరియా 45 కేజీల బస్తా ఎమ్మార్పీ ధర రూ.265.50 ఉంది. అన్ని రాష్ర్టాల్లో ఇదే ధర అని కూడా బస్తాలపై రాసి ఉంటుంది. కొందరు వ్యాపారులు రూ.280 నుంచి రూ.320 వరకు విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. జిల్లా కేంద్రాల్లో బస్తాపై రూ.15 నుంచి రూ.20వరకు అదనంగా విక్రయిస్తే మండల కేంద్రాల్లో పలు దుకాణాదారులు రవాణా ఛార్జీల పేరుతో అదనంగా రూ.30 నుంచి రూ.50 వరకు దండుకుంటున్నట్లు తెలిసింది.

82
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles