హరితోత్సాహం..

Mon,September 9, 2019 12:24 AM

ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ : తెలంగాణకు హరిత హారం కార్యక్రమం జిల్లాలో పరుగులు పెడుతున్నది. ఇప్పటికే గ్రామ గ్రామాన హరితహారం కార్యక్రమం ఊపందుకున్నది. ప్రతి గ్రామంలో ప్రజలు మొక్కలు నాటేందుకు ముందుకు వస్తుండడంతో అధికారులు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తు న్న పంచాయతీ రాజ్‌ చట్టం, మున్సిపాలిటీ చట్టం కారణంగా మొక్కలను నాటడంతో పాటు వాటిని రక్షించడంపై అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించారు. నాటిన మొక్కల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజాప్రతినిధులపైనా వేటు ఉంటుందని అధికారులు హెచ్చరించడం ఇక్కడ విశేషం. గ్రామాల్లో మొక్కలను పశువుల తో మేపడం, లేదా పీకడం జరిగితే వారికి వెంటనే జరిమానాలు విధిస్తున్నారు. జిల్లాలో రెండు కోట్ల 80 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యం ఉండగా ఇప్పటికే కోటి 50 వేల మొక్కలను నాటి లక్ష్యం వైపు దూసుకెళ్తున్నారు.

గ్రామ గ్రామాన ఉద్యమంలా...
జిల్లాలోని ప్రతి గ్రామంలో హరితహారం కార్యక్రమం ఊపందుకున్నది. కొత్తగా ఎన్నికైన సర్పంచుల ఆధ్వర్యంలో ఉపాధి హామి పథకంలో మొ క్కలు నాటుతున్నారు. జిల్లాలోని అటవీ శాఖ అధికారులు 43 లక్షలు, ఎక్సైజ్‌ శాఖ లక్ష్యం 5 లక్షలు, పంచాయతీ రాజ్‌ శాఖ 20 వేల మొక్కలు, నీటి పారుదల శాఖ 3 లక్షలు, ఉపాధి హామీ పథకంలో రెండు కోట్ల ఏడు లక్షల మొక్కలు, జిల్లాలోని మూడు మున్సిపాలిటీలైన ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడల పరిధిలో 19 లక్షల 66 వేల మొక్కలు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఐదు లక్షల మొక్కలు, వెటర్నరీ శాఖ ఆధ్వర్యంలో లక్షా 82 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు అధికారులు. ఇప్పటి వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు. జిల్లాలో రెండు కోట్ల 88 లక్షల మొక్కలు నాటే దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే..
హరితహారం మొక్కల విషయంలో ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలతో మొక్కలకు మేలు జరుగు తుంది. నాటిన ప్రతి మొక్కనూ రక్షించాలని, వాటిని సంరక్షించే విషయంలో ఎవరికి మినహాయింపు లేదని అధికారులు పేర్కొనడంతో గ్రామాల్లో మేకలకాపరులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో ఇలాంటి నిబంధనలు లేక పోవడం కారణంగా నాటిన లక్షలాది మొక్కలను మేకలు మేయడం, పశువులు తొక్కడం కారణంగా అవి పెరగలేదు. ఈ సారి ప్రతి మొక్కనూ రక్షించేందుకు వీలుగా మొక్కలను అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. జిల్లాలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో మొక్కలకు నష్టం కలిగించిన వారికి జరిమానాలు విధించారు. రాజంపేట మండలంలో మొక్కలను మేపిన వారికి 16 వేల రూపాయల జరిమానా విధించారు. ఎల్లారెడ్డి మండంలోని వెల్లుట్ల పేట గ్రా మంలో మొక్కలను మేపిన ముగ్గురికి ఐదు వేల రూపాయల జరిమానాను శనివారం విధించారు. ఇలా ప్రతి గ్రామంలో నాటిన మొక్కలను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలతో మొక్కలు సవ్యంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

వాతావరణం అనుకూలం..
హరితహారం కార్యక్రమానికి ఈ సంవత్సరం వా తావరణం సైతం అనుకూలంగా ఉంది. వర్షాకాలం ప్రారంభంలో కొంత వరకు వర్షాలు తక్కువగా ఉండడంతో మొక్కలు నాటే కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమైంది. రెండు నెలలుగా వరుస వర్షాలు పడుతుండడంతో మొక్కలు నాటడానికి ఇబ్బందులు లేకుండా పోయింది. వ్యవసాయ పనులు పూర్తి అయినప్పటి నుంచి రైతు లు, రైతు కూలీలు మొక్కలు నాటేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో జిల్లాలో ఇప్పటికే కోటి 50 లక్షలకు పైగా మొక్కలు నాటారు. జిల్లాలో ఎక్కువగా సాగు చేసే వరి పంట నాట్లు పూర్తి కావడంతో మొక్కలు నాటేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్యర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చే యడంతో వందలాది మంది రైతులు పొలం గట్లపైన టేకు మొక్కలు లక్షల సంఖ్యలో నాటుతున్నా రు. దీనికి తోడు పండ్ల మొక్కలను ప్రతి ఇంటికి ఐదు చొప్పున పంపిణీ చేయడంతో జిల్లాలోని మున్సిపాలిటిలైన ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ పట్టణాల్లో ప్రజలు ముందుకు వచ్చి వాటిని ఇంటి పరిసర ప్రాంతాల్లో నాటారు.

లక్ష్యం వైపు అడుగులు
జిల్లాలో హరితహారం కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటి వరకు కోటిన్నర మొక్కలు నాటాం. మరో నెల రోజుల వ్యవధిలో లక్ష్యం సాధిస్తాం. ఉపాధి హామీ పథకం కింద అన్ని గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో నాటిన మొక్కలను స్థానికులే రక్షిస్తున్నారు. మొక్కలకు నష్టం కలిగిస్తే జరిమానాలు విధిస్తున్నారు.
- చంద్రమోహన్‌ రెడ్డి, డీఆర్డీవో

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles