ఇద్దరు ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి ఫూలే అవార్డులు

Mon,September 9, 2019 12:22 AM

-బోధన్‌, నమస్తే తెలంగాణ/ఇందూరు:
బోధన్‌ పట్టణానికి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు, రచయిత పురాణే అజయ్‌కుమార్‌తో పాటు ఇందూరు నగరానికి చెందిన ఎస్‌జీటీ మాడవేడి వినోద్‌ కుమార్‌ను హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న మహాత్మ ఫూలే ఫౌండేషన్‌ ట్రస్ట్‌, ఎంబీసీ టైమ్స్‌ సంయుక్తంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశాయి. హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం జరిగిన సబ్బండ వర్ణాల ఉపాధ్యాయ సమ్మేళనంలో వీరికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందించి అభినందించారు. కార్యక్రమంలో ఫూలే ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు సంగెం సూర్యారావు, చైర్మన్‌ డాక్టర్‌ రవిశంకర్‌, బీసీ కమిషన్‌ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, రమణస్వామి, మోహన్‌, రత్నం తదితరులు పాల్గొన్నారు. పురస్కారాన్ని అందుకున్న అజయ్‌కుమార్‌ కవి, రచయిత కావడం గమనార్హం. అజయ్‌కుమార్‌ ప్రస్తుతం కోటగిరి మండలం పొతంగల్‌లోని ఉర్దూ మీడియం జడ్పీహెచ్‌ఎస్‌లో తెలుగు భాషా పండితుడిగా విధులు నిర్వహిస్తున్నారు. బోధన్‌కు చెందిన పంపా సాహితీపీఠం అధ్యక్షుడిగా చాలాకాలంగా కొనసాగుతున్నారు. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జిల్లా అధ్యక్షుడిగా, అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ), సంచారజాతుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సైతం కొనసాగుతున్నారు. మాడవేడి వినోద్‌కుమార్‌ ప్రస్తుతం నిజామాబాద్‌ మండలంలోని మెగ్యానాయక్‌ తండా యూపీఎస్‌లో ఎస్‌జీటీగా పని చేస్తున్నారు. బీసీ ఉపాధ్యాయ సంఘ బాధ్యుడిగా సైతం సేవలిందిస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్న వీరిని పలువురు ప్రముఖులు అభినందించారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles