కౌంట్ డౌన్

Thu,May 23, 2019 01:06 AM

-నేడు వెల్లడికానున్న లోక్‌సభ ఓట్ల ఫలితాలు
-గీతంలో జహీరాబాద్ నియోజకవర్గం లెక్కింపు
-ఏడు శాసనసభ సెగ్మెంట్లకు ఏర్పాట్లు పూర్తి
-నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు
-పటిష్టమైన ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం
-గీతం వద్ద 144 సెక్షన్ అమలు

సంగారెడ్డి చౌరస్తా : సంగారెడ్డిలోని గీతం యూనివర్సిటీలో జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రిటర్నింగ్ అధికారి, సంగారెడ్డి కలెక్టర్ ఎం.హనుమంతరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ప్రతి నియోజకవర్గానికి 14 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేశారు. 23 రౌండ్లలో పూర్తి ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.

42 రోజులుగా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పార్లమెంట్ ఎన్నికల భవితవ్యం నేటితో తేలనున్నది. గురువారం జరిగే లోక్‌సభ ఓట్ల లెక్కింపు కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల నియమావళి, నిబంధనల మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాకు నియమించిన ముగ్గురు ఎన్నికల పరిశీలకుల ఆధ్వర్యంలో జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గత ఏప్రిల్ 11న జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

సంగారెడ్డి జిల్లా పరిధిలో మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపును నర్సాపూర్, జహీరాబాద్ నియోజకవర్గ ఓట్లు లెక్కింపును పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో చేపట్టనున్నారు. ఇందు కోసం ఎన్నికల అధికారులు, జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపడుతున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద అగ్నిమాపక వాహనాలను అందుబాటలో ఉంచారు. ఈ నెల 23న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానున్న నేపథ్యంలో బుధవారం అందుకు సంబంధించిన రిహార్సల్‌ను పూర్తి చేశారు.

ఇదిలా ఉండగా జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ప్రతి నియోజకవర్గానికి 14 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 142 రౌండ్లలో పూర్తి స్థాయిలో ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే అత్యధికంగా జహీరాబాద్ నియోజకవర్గంలో 23 రౌండ్లు, అత్యల్పంగా బాన్సువాడుకు 17 రౌండ్లు ఉన్నాయి. ఒక్కో రౌండుకు దాదాపు 15 నిమిషాల సమయం పట్టనున్నదని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, కౌంటింగ్ సందర్భంగా జిల్లాలో 24 గంటల పాటు మద్యం దుకాణాలు, బార్లు తదితర అన్ని మద్యం విక్రయాలను బందు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

ఎంట్రీ పాసులు తప్పనిసరి
కౌంటింగ్ కేంద్రంలో పూర్తి పారదర్శకత కోసం అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయగా, ఎంట్రీ పాసులు లేకుండా ఏ ఒక్కరినీ లోపలికి అనుమతించకుండా చర్యలు తీసుకుంటు న్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జారీ చేసిన పాసులున్నవారికే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఉంటుంది. మీడియాకు ప్రత్యేక పాసులు అందించారు. గీతం యూనివర్సిటీ ముందు భాగంలోనే మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, అక్కడ టీవీలు, ప్రత్యేక తెరలు ఏర్పాటు చేశారు. అవసరమైన చోట బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి రౌండుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు అందించే ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో ఆన్‌లైన్‌లో వివరాలను పొందుపర్చనున్నారు. అయితే కౌంటింగ్ కేంద్రాల లోపలికి మీడియాకు అనుమతి ఉండదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఒకరి పాసుపై మరొకరు వచ్చే అవకాశం కూడా లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు నేపథ్యంలో గీతం యూనివర్సిటీ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీసు బలగాలను మోహరించారు. ప్రధాన ద్వారం వద్దనే పాసులు తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తారు. సెల్‌ఫోన్లతో పాటు ఇతర పరికరాలను ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించబోరు. ప్రతి ఒక్కరూ సజావు ఓట్ల లెక్కింపు కోసం సహకరించాలని కలెక్టర్ కోరారు.

75
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles