భూసార పరీక్షలపై అవగాహన కల్పించాలి

Wed,May 22, 2019 03:08 AM

-వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు రాములు
-జాతీయ సుస్థిర వ్యవసాయంపై పైలెట్ ప్రాజెక్టు
-సమావేశంలో పాల్గొన్న 9 జిల్లాల వ్యవసాయాధికారులు

కామారెడ్డి, నమస్తే తెలంగాణ: భూసార పరీక్షలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన రాష్ట్ర సంయుక్త సంచాలకుడు రాములు సూచించారు. జాతీయ సుస్థిర వ్యవసాయ విధానం పథకంలో భాగంగా జిల్లాలోని ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామంలోని అన్ని వ్యవసాయ క్షేత్రాల నుంచి మట్టి నమూనాలు సేకరిస్తామని తెలిపారు. జనహిత భవన్‌లో మంగళవారం తొమ్మిది జిల్లాలకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూసార పరీక్ష చేసి వచ్చిన ఫలితాల ఆధారంగా ఎరువులను వినియోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

పంటలు సాగు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పైలెట్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నదని తెలిపారు. ఈ పథకం అమలుపై ఎంపిక చేసిన గ్రామాల వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన కల్పించారు. పైలెట్ గ్రామాల్లో రైతులందరికీ ఈ నెల 31వ తేదీ వరకు గ్రామ సభలు ఏర్పాటు చేసి భూసార పరీక్ష కార్డులు పంపిణీ చేసి వాటి ఆధారంగా ఎరువులను ఉపయోగించేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ పద్ధతిలో పెట్టుబడిని తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. సదస్సులో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల వ్యవసాయ శాఖ ఆధికారులు నాగేంద్రయ్య, గోవింద్, శ్రావణ్‌కుమార్, పరుశురాం, నర్సింగ్‌రావు, వీరయ్య, కోటేశ్వర్‌రావు, మంగీలాల్, భాగ్యలక్ష్మితో పాటు కమిషనర్ కార్యాలయం సహాయ వ్యవసాయ సంచాలకురాలు శ్రీదేవి, కామారెడ్డి సహాయ సంచాలకులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles