వారం రోజుల్లో తొలి డ్రైరన్‌

Tue,May 21, 2019 12:55 AM

కమ్మర్‌పల్లి/నమస్తే తెలంగాణ: ఎస్సారెస్పీ రివర్స్‌ పంపింగ్‌ పనులు ఈ వానాకాలాని కల్లా నీరందించే లక్ష్యంగా చురుకుగా సాగుతున్నాయి. కేవలం వారం రోజుల్లో మొదటి పంపుహౌస్‌లో డ్రైరన్‌ నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతున్నది. వానాకాలానికి కల్లా రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఎస్సారెస్పీలోకి కాళేశ్వరం జలాలను తరలించాలని సీఎం కేసీఆర్‌ చేసిన దిశానిర్దేశం మేరకు పనులు సాగుతున్నాయి. రివర్స్‌ పంపింగ్‌ పథకంలో ఎస్సారెస్పీ వరద కాలువ 98వ కి.మీ వద్ద జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌ వద్ద మొదటి పంపుహౌస్‌, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేట్‌ సమీపంలో 36వ కి.మీ వద్ద రెండో పంపుహౌస్‌, ఎస్సారెస్పీ జీరో పాయింట్‌ వద్ద నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలంలో మూడో పంపుహౌస్‌ నిర్మిస్తున్నారు. వానాకాలానికి నీరందించాలంటే ముందుగా మొదటి, రెండో పంపుహౌస్‌ల్లో పనులు పూర్తి చేయాలని సీఎం క్షేత్రస్థాయి పర్యటనలో అధికారులను, వర్క్‌ ఏజెన్సీలను ఆదేశించారు. దీంతో రాంపూర్‌లోని మొదటి పంపుహౌస్‌ వద్ద, రాజేశ్వర్‌రావుపేట్‌లోని రెండో పంపుహౌస్‌ వద్ద పనులను ముమ్మరం చేసి వేగంగా పూర్తి చేస్తూ వచ్చారు. వారం రోజుల్లో మొదటి పంపుహౌస్‌లో డ్రైరన్‌ నిర్వహించడం కోసం అవసరమైన పనులన్నీ చివరిదశకు చేరాయి. మోటార్ల బిగింపునకు సంబంధించి చివరి అలైన్‌మెంట్‌ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇరిగేషన్‌, ట్రాన్స్‌కో అధికారులు సమన్వయంతో కృషి చేసి కేవలం 25 రోజుల్లోనే ఎలక్ట్రిక్‌ అనేజ్గరీ బిల్లింగ్‌ నిర్మాణాలు పూర్తి చేశారు. గత శుక్రవారం మొదటి పంపుహౌస్‌ వద్ద 220 కేవీ సబ్‌స్టేషన్‌ రీచార్జ్‌ పనులు పూర్తి చేశారు. సోమవారం మొదటి పంపుహౌస్‌కు సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా ప్రారంభమైంది. ఎత్తిపోతల పథకాల రాష్ట్ర సలహాదారు పెంటారెడ్డి, ప్రాజెక్టు ఇన్‌చార్జి సుధాకర్‌రెడ్డి పర్యవేక్షణలో తొలి డ్రైరన్‌కు చకచకా పనులు జరుగుతున్నాయి. సోమవారం పంపుహౌస్‌కు విద్యుత్‌ సరఫరాను ప్రారంభించే కార్యక్రమం వీరి పర్యవేక్షణలోనే జరిగింది. ఎస్‌ఈ శ్రీకాంత్‌రావు, ఈఈ సుధాకిరణ్‌ విద్యుత్‌ సరఫరా కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరి అలైన్‌మెంట్‌ పనులు పూర్తి చేసి వారం రోజుల్లోగా డ్రైరన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయని డీఈఈ రాంప్రసాద్‌ తెలిపారు. తొలి డ్రైరన్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి కావస్తుండడంతో రాజేశ్వర్‌రావుపేట్‌లోని రెండో పంపుహౌస్‌లో పక్షం రోజుల్లో డ్రైరన్‌ నిర్వహించేందుకు అధికారులు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. కీలక నిర్మాణాలు చకచకా పూర్తి చేస్తూ తొలి పంపుహౌస్‌లో డ్రైరన్‌ దశకు రివర్స్‌ పంపింగ్‌ పథకం చేరడంతో ఎస్సారెస్సీ ఆయకట్టు రైతుల్లో, నిజామాబాద్‌ జిల్లా రైతాంగంలో హర్షం వ్యక్తమవుతున్నది. ఇది వరకే సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో వరద కాలువలో తూముల నిర్మాణాలకు, కాళేశ్వరం జలాలను చెరువులకు అందించే ఏర్పాటు పనులను తొందరగా చేపట్టి పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles