ఐదో విడతకు సర్వం సిద్ధం

Mon,May 20, 2019 03:07 AM

-జిల్లాలో 2.88 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం
-డీఆర్డీవో, అటవీశాఖల ఆధ్వర్యంలో 500 నర్సరీలు
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి.. యాక్షన్ ప్లాన్ రెడీ
బాన్సువాడ/నమస్తే తెలగాణ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలను ఇస్తోంది. హరితహారం కింద గడిచిన నాలుగు విడతల్లో లక్ష్యం మేరకు మొక్కలు నాటి జిల్లా రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిచింది. ఐదో విడత హరితహారంలో జిల్లాలో 2 కోట్ల 88 లక్షలు మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ మేరకు అటవీ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 500 నర్సరీల్లో సుమారు 3 కోట్ల మొక్కలను పెంచుతున్నారు. సీఎం కేసీఆర్ అధికారికంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంటనే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు అటవీశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అటవీశాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ అన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో లక్ష్యాన్ని చేరుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు, వర్షా లు సమృద్ధిగా కురిసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హరితహారం కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా అమలవుతున్నది. అటవీ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ, ఆయా శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. గడిచిన నాలుగు ఏండ్లలో జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో హరితహారం కింద పెద్ద మొత్తంలో మొక్కలు నాటి విజయవంతం చేశారు. ఐదో విడత హరితహారం కార్యక్రమం కోసం ఇప్పటికే అటవీ శాఖ పనులను వేగవంతం చేసింది. గత ఏడాది నిర్వహించిన నాల్గో విడత హరితహారం కార్యక్రమంలో కోటీ 32 లక్షల మొక్కలు నాటడంతో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నది.

పంపిణీ చేయనున్న మొక్కలు
టేకు మొక్కలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. టేకు మొక్కలను రైతులకే పంపిణీ చేయనున్నారు. ప్రధానంగా పంటపొలాల గట్ల వెంబడి వీటిని నాటించేందుకు అటవీశాఖ అధికారులు కృషి చేయనున్నారు. టేకుతో పాటు నిమ్మ, అడవి బాదాం, అల్లనేరేడు, వేప, మునగ, కానుగ, ఇప్ప, ఎర్రతురాయి, రోజ్‌వుడ్, చింత, ఉసిరి, ఈత, మామిడి, దానిమ్మ, సీతాఫలం వంటి మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ శాఖల సమన్వయంతో మొక్కలు నాటేందుకు అటవీశాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి శాఖకు ప్రభుత్వం ద్వారా అందిన ఆదేశాల మేరకు మొక్కలు నాటే లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయనున్నారు. అటవీ శాఖ నోడల్ ఏజెన్సీ దీనిని పర్యవేక్షించనున్నది. ఆయా శాఖలకు సంబంధించి ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం పూర్తయినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా 500 నర్సరీలను అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వీటిలో మొత్తం 3 కోట్ల 21 లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచారు. వాటిలో ఐదో విడత హరితహారంలో 2 కోట్ల 88 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీల్లో 95 లక్షల మొక్కలు, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 2 కోట్ల 26 లక్షల మొక్కలను ఆయా నర్సరీల్లో మొక్కల పెంపకం పూర్తి కావచ్చింది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలో సుమారు 3 కోట్లకుపైగా మొక్కలు అందుబాటులో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఐదో విడత హరితహారంలో ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలు నాటించడంతో పాటు అటు కామారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల్లో 23 లక్షల మొక్కలు పెంచే లక్ష్యం నిర్ధేశించారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles