పరిషత్ హడావిడి

Sun,May 19, 2019 12:36 AM

-ప్రస్తుత ఎంపీడీవో ఆఫీసు జడ్పీ కార్యాలయంగా..
-దేవునిపల్లి గ్రామ పంచాయతీ భవనం మండల పరిషత్‌గా..
-కసరత్తు చేస్తున్న అధికార యంత్రాంగం
-తొలి జడ్పీకి అధికారుల కేటాయింపునకు సన్నాహాలు
-కొనసాగుతున్న వివరాల సేకరణ
-బోనాఫైడ్ ఆధారంగా స్థానికత నిర్ధారణ

కామారెడ్డి/నమస్తే తెలంగాణ: పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో నిజామాబాద్ నుంచి కామారెడ్డి కొత్త జిల్లాగా అవతరించింది. ఇప్పటి వరకు జడ్పీ, మండల పరిషత్ కార్యాలయాలు పాత వాటినే కొనసాగించారు. ప్రాదేశిక ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త జడ్పీలు, మండల పరిషత్‌ల ఎంపికకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల విభజన, కార్యాలయాల ఏర్పాటుపై అధికార యంత్రాగం హడావిడిని కొనసాగిస్తున్నది. దీంట్లో భాగంగానే పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల విభజన చాలా కాలంగా అపరిష్కృతంగా ఉంది. జిల్లాల విభజన తరువాత వెంటనే చేపడుతారని ఉద్యోగులు భావించారు. మార్గదర్శకాలు రాకపోవడంతో విభజన చేయలేదు. ఈ నెలలోనే మూడు విడతలుగా ప్రాదేశిక ఎన్నికలు ముగించారు. ఫలితాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న జడ్పీ, మండల పరిషత్ పాలకవర్గాల గడువు జూలై 4వ తేదీన ముగియనున్నది. మరుసటి రోజు కొత్త పాలకవర్గాలు కొలువు దీరనున్నాయి. అదే రోజున జూలై 5న కామారెడ్డిలో కొత్త జడ్పీ కార్యాలయం, నూతన మండలాల్లో మండల పరిషత్‌లు ఏర్పాటు కానున్నాయి. ఈ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నారు.

ఇందులో కామారెడ్డి, నిజామాబాద్‌తో పాటు ఇతర జిల్లాల ఉద్యోగులు ఎంత మంది ఉన్నారో లెక్క తీస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులను పాఠశాలల బోనాఫైడ్ పత్రం ఆధారంగా స్థానికతను గుర్తిస్తున్నారు. వరుసగా నాలుగు సంవత్సరాల పాటు చదువుకున్న ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుని స్థానికతను నిర్ధారించనున్నారు. ఈ మేరకు మండల పరిషత్ కార్యాలయాల్లో నిజామాబాద్ జడ్పీ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగుల బోనాఫైడ్ పత్రాలు సేకరిస్తున్నారు. స్థానికత గుర్తించిన తర్వాత వారిని ఏ జిల్లాకు బదిలీ చేస్తారన్నదానిపై స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు. సొంత జిల్లా, మండలాలకు పంపిస్తారా లేదా ఇతర ప్రాంతాలకు పంపిస్తారా అనేది ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. బోనాఫైడ్ పత్రాలను సేకరించి పంచాయతీరాజ్ కమిషనర్‌కు త్వరలోనే పంపనున్నారు. కమిషనర్ ఆదేశాల అనంతరం ఉద్యోగుల విభజన తేలనుంది.

కామారెడ్డి మండల పరిషత్ జడ్పీ భవనంగా
జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ఎంపీడీవో కార్యాలయాన్ని జడ్పీ కార్యాలయంగా ఎంపిక చేస్తూ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించారు. కామారెడ్డి మండల పరిషత్ కార్యాలయ భవనం కొత్తగా నిర్మించిన భవనం కావడంతో జిల్లా కేంద్రంలో అందరికీ అందుబాటులో ఉండడంతో ఈ భవనాన్ని జడ్పీ కార్యాలయ భవనంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు కరసత్తు చేస్తున్నారు. కామారెడ్డి మండల పరిషత్ కార్యాలయ భవనాన్ని జడ్పీ భవనంగా ఏర్పాటు చేస్తే మండల పరిషత్ కార్యాలయాన్ని ఎక్కడికి తరలించాలనే దానిపై అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. మండలంలోని దేవునిపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనంలో మండల పరిషత్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు పనులు ప్రారంభించారు. మండలంలోని అడ్లూర్, దేవునిపల్లి గ్రామాల్లో గత సంవత్సరమే కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించారు.

అయితే ఈ గ్రామాలు ప్రస్తుతం కామారెడ్డి మున్సిపాల్టీలో విలీనం కావడంతో గ్రామ పంచాయతీ భవనాలు ఖాళీగానే ఉన్నాయి. వీటిని మున్సిపల్ అధికారులు సైతం స్వాధీనం చేసుకున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనాలు వృథాగా ఉండడంతో వీటిలో ఏదో ఒక భవనాన్ని మండల పరిషత్ కార్యాలయానికి ఉపయోగించుకోవాలని అధికారులు ఆలోచిస్తున్నారు. పట్టణానికి ఆనుకుని ఉన్న దేవునిపల్లిలోని గ్రామ పంచాయతీ భవనం అయితేనే అందరికీ అందుబాటులో ఉంటుందని, అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయని అధికారులు నిర్ణయించారు.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles