ఫోర్ స్కేర్ కార్యాలయం ఆస్తులు సీజ్

Sun,May 19, 2019 12:33 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా ద్వారా పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాల పేరిట మోసం చేసిన ఫోర్‌స్కేర్ టెక్నో ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం ఆస్తులను సీజ్ చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్ తెలిపారు. శనివారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. బెంజ్‌కార్, పోర్ట్ ఏకో సపోర్ట్ కార్‌తో పాటు ఆఫీస్ ఫర్నిచర్ (20 కంప్యూటర్లు, 20 కంప్యూటర్ చైర్లు, 2 టేబుళ్లు, 1 ఫ్యాన్, 4 ప్లాస్టిక్ చైర్లు, 5 ఏసీలు, 2 సోఫాసెట్లు, 6 వాల్ ఫ్యాన్లు) మొత్తం రూ.40 లక్షల విలువ చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా మోసపోయిన బాధితుల సంఖ్య 596 ఉందని తెలిపారు. ఉద్యోగాల పేరిట రూ.3.57 కోట్లు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నిజామాబాద్‌కు చెందిన కల్యాణ్‌కుమార్ అనే వ్యక్తి తాహిర్ పాషాతో కలిసి ఫోర్‌స్కేర్ టెక్నో ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో 2017లో ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా ద్వారా పోస్ట్ ఆఫీస్‌లలో ఉద్యోగాల నియామకం జరుపుతారని తెలుసుకొని ఆ ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చి, వివిధ రాష్ర్టాలు, వివిధ జిల్లాలలోని పోస్టు ఆఫీస్‌లలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి చాలా ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకున్నారన్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ కు చెందిన సయిద్ అహ్మద్ నిజామాబాద్‌కు చెందిన తన స్నేహితుడైన బాబ్బాన్ ద్వారా తాహెర్ పాషాతో పరిచయం ఏర్పర్చుకొని ఏజెంట్‌గా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు ఇన్‌చార్జిగా నియమించారన్నారు. పోస్టాఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగాలు ఇప్పిస్తామని సయిద్ అహ్మద్ స్థానిక పత్రికలలో ప్రకటనలు ఇచ్చారని పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో కొంత మందిని ఏజెంట్లుగా నియమించుకొని నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద సుమారుగా రూ.60 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశారన్నారు. అందులో నుంచి సుమారు రూ.39 లక్షలు కల్యాణ్‌కుమార్‌కు ఇవ్వగా.. మిగతా రూ.3.18 కోట్లను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడిపెట్టాడని తెలిపారు.

మిగతా డబ్బులతో తన సహచరుడు కొడుకుని బినామీ భాగస్వామిగా చేర్చుకొని తన స్థలంలో ఎస్‌ఎస్ కన్‌వెన్షన్ సెంటర్ అనే ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. సయిద్ అహ్మద్ ప్రజలను మోసం చేసి అక్రమంగా ఆర్జించిన సొమ్మును త్వరలోనే చట్టపరంగా స్వాధీనం చేసుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ నేరస్తులకు డబ్బులు ఇచ్చి మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే వారు వెంటనే తమ సమీపంలోని పోలీసు స్టేషన్‌లో గానీ, జిల్లా పోలీసు కార్యాలయంలో గానీ ఫిర్యాదు చేయాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ కంచ మోహన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వెంకన్న, టూటౌన్ పట్టణ సీఐ కె.నాగరాజు, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై అన్వర్ ఉల్‌హక్, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles