కేశ్‌పల్లిలో అగ్నిప్రమాదం

Fri,May 17, 2019 01:16 AM

జక్రాన్‌పల్లి: మండలంలోని కేశ్‌పల్లి గ్రామంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించి సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రమాదంలో నాలుగు నివాస ఇండ్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కేశ్‌పల్లి గ్రామంలో ఉదయం గ్రామానికి చెందిన పాల్దె సాయిలు ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి సాయిలు ఇల్లుతో పాటు అతడి సోదరులు పాల్దె మల్లేశ్‌, పాల్దె రవీందర్‌, పాల్దె బొర్రన్న ఇండ్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. విషయాన్ని ఆర్మూర్‌ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా అగ్నిమాపక సిబ్బంది గ్రామానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో పాల్దె సాయిలు ఇంట్లో నిలువ ఉంచిన 35 క్వింటాళ్ల వడ్లు, వ్యవసాయ భూమి కొనుగోలు చేయడానికి బ్యాంక్‌ నుంచి తెచ్చిపెట్టుకున్న రూ. 3 లక్షల నగదు, రూ. 15 వేల విలువ చేసే డ్రిల్లింగ్‌ మిషన్‌, ఇతర సామగ్రి, ఇల్లు విలువ రెండు లక్షలతో కలిపి రూ. 6 లక్షల 1,950 నష్టం వాటిల్లింది. పాల్దె మల్లేశ్‌ ఇంట్లో రెండు రోజుల క్రితం గొర్రెలను విక్రయించగా వచ్చిన నగదు రూ. 2 లక్షలు, వస్తు సామగ్రి, ఇల్లు విలువ రెండు లక్షలతో కలిపి రూ. 4 లక్షల 40 వేలు నష్టం వాటిల్లింది. పాల్దె రవీందర్‌ ఇంట్లో వ్యవసాయ భూమి కొనుగోలు చేయడానికి బ్యాంక్‌ నుంచి తెచ్చిపెట్టుకున్న రూ. 2 లక్షల 90 వేలు నగదు, వస్తు సామగ్రి, ఇల్లు విలువ రెండు లక్షలతో కలిపి రూ. 5లక్షల 30 వేలు నష్టం వాటిల్లింది. పాల్దె బొర్రన్న ఇంట్లో వరి ధాన్యం అమ్మితే వచ్చిన రూ.50 వేల నగదు, వస్తుసామగ్రి, ఇల్లు విలువ రెండు లక్షలతో కలిపి రూ. 2 లక్షల 90 వేలు నష్టం వాటిల్లిందని గిర్దావర్‌ అరుణ పంచనామా చేసి ధ్రువీకరించారు. అగ్ని ప్రమాదం జరిగిన నాలుగు ఇళ్ల కుటుంబ సభ్యులు అందరూ ఉదయాన్నే పనుల నిమిత్తం వ్యవసాయా క్షేత్రాలకు వెళ్లారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని బాధితులు కోరారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles