మంజీరపై నాలుగు చెక్‌డ్యాములు

Thu,May 16, 2019 01:11 AM

బీర్కూర్‌ : బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ, బీర్కూర్‌, పొతంగల్‌, సుంకిని గ్రామాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం నాలుగు చెక్‌డ్యాంలను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా బీర్కూర్‌ మంజీర నదిపై రూ.45 కోట్లతో చెక్‌డ్యాంలను నిర్మించనుండడంతో మంగళవారం ఈ పనులకు గాను ఇరిగేషన్‌ అధికారులు సర్వే చేపట్టారు. బీర్కూర్‌ మంజీర గడ్డ నుంచి కుర్లా మంజీర గట్టు వరకు 1300 మీటర్ల మేర ఈ చెక్‌ డ్యాం నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో రైతులకు ఎంతో మేలు జరగనున్నది. ఎండాకాలంలో బోర్లు ఎత్తిపోయి రైతులు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవనున్నది. చెరువుల్లో నీరు ఇంకి పోకుండా, భూగర్భ జలాలు తగ్గకుండా ఈ చెక్‌డ్యాంలు ఎంతో సహకరించి నీటిని నిల్వ ఉంచి పశువులకు తాగేందుకు నీటి ఇబ్బంది లేకుండా కూడా చేస్తాయని పాడి రైతులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెక్‌ డ్యాం నిర్మాణం వెనుక స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువ నాయకుడు పోచారం భాస్కర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్‌ కృషి ఎంతో ఉంది. ఈ నాలుగు చెక్‌ డ్యాంల నిర్మాణంతో కేవలం బాన్సువాడ నియోజకవర్గంలోని రైతాంగమే కాకుండా జుక్కల్‌ నియోజకవర్గంలోని బిచ్కుంద, మద్నూర్‌ మండలాల రైతులు సైతం రాష్ట్ర శాసన సభాపతి పనితీరుపై హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ చెక్‌ డ్యాంల నిర్మాణంతో తమ ప్రాంతంలోని మోటారు బోర్లు కూడా నీటిని అధికంగా పోస్తాయని, అదేవిధంగా భూగర్భ జలాలు తమ ప్రాంతంలో పెరుగుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles