రైతులకు వెన్నుదన్నుగా ఉంటాం

Thu,May 16, 2019 01:09 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : క్రిమిసంహారక మందులు, ఎరువుల అమ్మకంపై సరైన అవగాహనతో రైతుకు వెన్నుదన్నుగా ఉండాలని కలెక్టర్‌ సత్యనారాయణ ఇన్‌పుట్‌ డీలర్లకు సూచించారు. జనహిత భవన్‌లో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మొక్కజొన్నలో కత్తెర పురుగు, పత్తిలో గులాబీ రంగు పురుగు, సమగ్ర యాజమాన్య పద్ధతులపై కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్‌కు చెందిన ఇన్‌పుట్‌ డీలర్లకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వ్యవసాయ శాఖ అధికారులు రానున్న వానాకాలంలో సాగు చేసే పంటలను పురుగులు, తెగుళ్లు ఆశించకుండా వాడాల్సిన క్రిమిసంహారక మందులపై అవగాహన కల్పించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ డీలర్లను ఉద్దేశించి మాట్లాడారు. రైతే సమాజానికి వెన్నముక అని, పంట తెగుళ్ల బారిన పడకుండా, అధిక దిగుబడి వచ్చేలా రైతుకు సహకారం అందించాలని సూచించారు. పంటకు ఏ పురుగు ఆశిస్తే ఏ మందు వాడాలో డీలర్లు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. డీలర్లు ఈ పాస్‌ యంత్రం ద్వారా ఎరువులు, క్రిమి సంహారక మందులు విక్రయించాలని అన్నారు.
నాసిరకం విత్తనాలు, లేబుళ్లు లేని విత్తనాలు, లూజ్‌ ప్యాకెట్స్‌ షాపుల్లో ప్రదర్శించడం, అమ్మడం చేయవద్దని, వ్యవసాయ శాఖాధికారులు సూచించినవి మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. రైతులు నిషేధించిన హెచ్‌టీ కాటన్‌ను సాగుచేయకుండా అవగాహన కలిగించాలని, కత్తెర పురుగుపై చర్యల గురించి డీలర్‌షాప్‌ల ముందు బ్యానర్లు ప్రదర్శించాలని సూచించారు. రైతులకు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని, నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ అధికారుల సూచనలను రైతులు తప్పకుండా పాటించాలని అన్నారు. రైతులకు సరైన మందులు అందేలా చూడాలని, తరచూ తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ వారు రూపొందించిన వానాకాలం 2019 పంటల సాగు ప్రణాళిక (యాక్షన్‌ ప్లాన్‌ను) కలెక్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి నాగేంద్రయ్య, వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్లు మహేశ్వరి, ఎస్‌ఎన్‌వీ రత్నం, రామకృష్ణ, అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ నర్సింహులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రేషన్‌ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles