పరిషత్‌ పోరు పరిసమాప్తం

Wed,May 15, 2019 01:48 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:పల్లెల్లో హోరాహోరీగా సాగిన స్థానిక సమరం ముగిసింది. మూడు విడతల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మంగళవారం చివరి విడతతో పరిసమాప్తమైంది. మే6, మే 10, మే 14న వరుసగా మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు భారీగా పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో 22 జడ్పీటీసీ, 236 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం పరిషత్‌ ఓటర్లు 6,05,591 మంది ఉండగా మూడు విడతల్లో ఓట్లు వేసిన వారి సంఖ్య 4,44,855 మంది కాగా 1,60,736 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. వీరిలో పురుషులు ఓటు వేసేందుకు వెనుకంజ వేయగా మహిళా ఓటర్లు అన్ని దశల్లోనూ సత్తా చాటారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో భద్రంగా నిక్షిప్తమైంది. ఈ నెల 27న ఓటర్ల ఆమోద ముద్ర ఎవరికి పడుతుందో తేటతెల్లం కానుంది. మూడో విడతలో మొత్తం ఆరు మండలాల్లో ఎన్నికలు జరిగాయి. 1,74,681 మంది ఓటర్లకు గాను 1,31,621 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ మొదటి విడత ఎన్నికల్లో 70.90 శాతం, రెండో విడతలో 74.86 శాతం నమోదు కాగా తుది విడతలో ఒక శాతం పెరిగి 75.35 శాతంగా నమోదైంది. మొత్తానికి ఓటరు మహాశయుల తీర్పు బ్యాలెట్‌ బాక్సుల్లో చేరగా మే 27వ తేదీ నాడు తీర్పు వెలవడనుంది.

ముచ్చటగా మూడు విడతల్లో..
మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ), జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గం (జడ్పీటీసీ) ఎన్నికల ఘట్టం పరిసమాప్తమైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ఎండ వేడిమి ప్రభావం మూలంగా స్వల్పంగా పరిషత్‌ పోలింగ్‌ శాతం తగ్గినప్పటికీ పల్లె ఓటర్ల చైతన్యం చెక్కు చెదరలేదు. మండే ఎండల్లోనూ మహిళలు, వృద్ధులు, యువత గంటల తరబడి బారులు తీరి అన్ని దశల్లోనూ తమ ఓటు బాధ్యతను నిర్వర్తించారు. తొలి విడతలో కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూరు, బీబీపేట, దోమకొండ, రాజంపేట, రామారెడ్డి, సదాశివనగర్‌, తాడ్వాయి మొత్తం 9 మండలాల్లో 9 జడ్పీటీసీ స్థానాలు, 82 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 2,33,853 మంది ఓటర్లకు గాను 1,67,222 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా 70.90 శాతం పోలింగ్‌ నమోదైంది. రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు బాన్సువాడ, నస్రుల్లాబాద్‌, బీర్కూర్‌, జుక్కల్‌, పెద్దకొడప్‌గల్‌, బిచ్కుంద, మద్నూర్‌ మండలాల్లో జరిగాయి. మొత్తం ఏడు జడ్పీటీసీ స్థానాలు, 68 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 1,95,713 మంది ఓటర్లుండగా... మండుటెండల్లోనూ 1,46,012 మంది ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల్లో బారులు తీరి మరీ ఓటెయ్యగా 74.86 పోలింగ్‌ శాతం నమోదు అయ్యింది. చివరి విడత ఎన్నికల్లో అత్యధిక శాతం పోలింగ్‌ నమోదైంది. ఎల్లారెడ్డి, గాంధారి, లింగంపేట, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్‌, పిట్లం మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 1,74,681 మంది ఓటర్లకు 1,31,621 మంది ఓట్లెయ్యగా 75.35 శాతం పోలింగ్‌ రికాైర్డెంది.

వరుసగా ఐదు ఎన్నికలు
అసెంబ్లీ రద్దుతో మొదలైన రాజకీయ వేడి పరంపరగా కొనసాగుతూ వస్తున్నది. వరుసగా ఎన్నికలు రావడంతో ప ల్లె, పట్టణం తేడా లేకుండా రాజకీయ సందడితో మునిగి తేలిం ది. గల్లీ నుంచి మొదలుకుని ఢిల్లీ దాకా సార్వత్రిక సమరం సై తం రావడంతో ఎన్నికల హడావిడితో పల్లెలన్నీ కళకళలాడా యి. ఇంతలోనే పంచాయతీ పోరు, పరిషత్‌ ఎన్నికల హడావిడి సైతం తోడవ్వడంతో ఓట్ల పండుగ తార స్థాయికి చేరింది. డి సెంబర్‌ 7న అసెంబ్లీ ఎన్నికలు, డిసెంబర్‌ 11న శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం కొద్ది రోజులకే గ్రామ పంచాయతీ పో రు జరిగింది. జనవరి మాసం మొత్తం గ్రామ పంచాయతీ పోరు కొనసాగింది. తదనంతరమే భారత ఎన్నికల సంఘం రాష్ట్రంలోని పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించింది. ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సమయంలోనే సార్వత్రిక సమరం మొదలైంది. ఏప్రిల్‌ 11తో పార్లమెంట్‌ ఎన్నికలు ఇలా ముగిశాయో లేదో వెనువెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేయడంతో వరుసగా ఐదో ఎన్నికగా స్థానిక పోరు జరిగింది. ఎన్నికలు ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకుంటుండగా త్వరలోనే పురపాలిక ఎన్నికలు సైతం జరుగనున్నాయి.

ప్రశాంతంగా... పకడ్బందీగా...
శాసనసభ, ఎంపీ ఎన్నికల్లో ఒక్కో పోలింగ్‌ బూత్‌లో 1200 నుంచి 1500 ఓట్లు వేయాల్సి వచ్చింది. కానీ ఈ ఎన్నికల్లో పోలింగ్‌ బూత్‌ల సంఖ్య పెంచడంతో ఓటర్లు బారులు తీరి నిలబడాల్సిన ఇబ్బందులు తప్పాయి. మొదటి, రెండు, చివరి దశ ఎన్నికలు జరిగిన అన్ని మండలాల పరిధిలో 1,294 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఎండ వేడిమి దృష్ట్యా తాగు నీటి సౌకర్యం కల్పించినప్పటికీ సాయంత్రం వరకూ విధులు నిర్వర్తించిన సిబ్బంది సరిపోని పరిస్థితులు కనిపించాయి. మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ పోలింగ్‌ మంగళవారంతో ప్రశాంతంగా ముగిసింది. కామారెడ్డి జిల్లాలో 22 మండలాల్లోని 22 జడ్పీటీసీ, 236 ఎంపీటీసీలకు నిర్వహించిన ఎన్నికల ఘట్టం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పూర్తైంది. ముందస్తుగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డిలతో పాటుగా ఎన్నికల పరిశీలకులు అడిషనల్‌ డీజీ అభిలాష బిస్త్‌ నిరంతర పర్యవేక్షణతో కీలకమైన పరిషత్‌ పోరు అలజడి లేకుండానే కొనసాగింది. మూడు దశల ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నది. మే 27న వెలువడే ఫలితాల కోసం అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నది.

మండుటెండల్లోనూ...
ఓ వైపు మండుటెండలు, మరోవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న వడగాల్పుల మధ్య ఇటు ఓటర్లు, అటు పోలింగ్‌ సిబ్బంది తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంతో ప్రాదేశిక ఎన్నికల ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. ఓటరు చైతన్యం ప్రతీ దశలోనూ వెల్లివిరిసింది. సూర్యుడు సుర్రమంటూ కాలిపోతున్నప్పటికీ ఓటర్లు మాత్రం బాధ్యతగా ఎండ వేడిమిని లెక్కచేయకుండా ఓట్లు వేశారు. భానుడిని ఎదిరించి పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చారు. ఓటెత్తి అభ్యర్థుల భవితవ్యానికి జైకొట్టారు. ఓ వైపు చండ ప్రచండంగా సూరీడు ఎండను మండించినా ఓటరు మాత్రం తమ సంకల్పం వదల్లేదు. బతుకుదెరువు కోసం వలస బాట పట్టిన వారు సైతం తమ ఇబ్బందులను పక్కన బెట్టి మేముసైతం అంటూ పల్లెలకు తరలి వచ్చారు. ప్రశాంతంగా పోలింగ్‌ జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోటీలో ఉన్న వివ ఇధ పార్టీల వారు సైతం ఎలాంటి ఆవేశకావేశాలకు లోను కాలేదు. హోరాహోరీగా జరిగిన పోరులో ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వృద్ధులు, మహిళలు ఎండ పొద్దెక్కకమునుపే బూత్‌లకు చేరుకుని ఓటేసే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు.

27న పరిషత్‌ తీర్పు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతోన్న తొలి స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో అంతటా ప్రత్యేకత సంతరించుకుంది. తొలి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వారంతా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కలిసి వచ్చిన రిజర్వేషన్లను వినియోగించుకున్నారు. బరిలో నిలిచి చాలా మంది రాజకీయ నాయకులు మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. జనరల్‌ స్థానాల్లోనైతే భారీగా పోటీ నెలకొనగా గ్రామాల్లో పంచాయతీ పోరు తర్వాత హోరాహోరీగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు తలపడ్డారు. మూడు దశల స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన సరిగ్గా రెండు వారాలకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల ప్రకటన ఉండడంతో ఓటెయ్యడానికి ఊళ్లకు వచ్చిన వారంతా ఎవరు గెలుస్తారో అంచనాలు వేసుకుంటూ చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా తొలి విడత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎడతెగని ఉత్కంఠ 20 రోజులుగా కొనసాగుతుండగా, రెండో విడత అభ్యర్థులు సైతం దాదాపుగా సుదీర్ఘ నిరీక్షణ ఎదురవుతోంది. చివరి విడతలో ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లోనూ రెండు వారాల నిరీక్షణ తప్పడం లేదు. సర్పంచ్‌ ఎన్నికల్లో పోలింగ్‌, ఫలితాలు ఒకే రోజు ఉండగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఫలితాలకు సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారడంతో ఎన్నికల ఫలితాల వెల్లడి మే 27కు వాయిదా పడింది.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles