బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

Wed,May 15, 2019 01:35 AM

కామారెడ్డి / ఎల్లారెడ్డి / బాన్సువాడ, నమస్తే తెలంగాణ: జిల్లాలో మూడు విడతల్లో నిర్వహించిన పరిషత్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొదటి విడతలో కామారెడ్డి డివిజన్‌లోని తొమ్మిది మండలాల్లో ఈ నెల 6న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించారు. 70.90 శాతం పోలింగ్‌ నమోదైంది. రెండో విడతలో బాన్సువాడ డివిజన్‌లోని ఏడు మండలాల్లో ఈ నెల 10న ఎన్నికలు నిర్వహించారు. 74.86 శాతం పోలింగ్‌ నమోదైంది. మూడో విడతలో ఎల్లారెడ్డి డివిజన్‌లోని ఆరు మండలాల్లో మంగళవారం ఎన్నికలు జరిగాయి. 75.35 శాతం పోలింగ్‌ నమోదైంది. మూడు విడతలకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులను అధికారులు స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచారు. కామారెడ్డి డివిజన్‌కు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులు జిల్లా కేంద్రంలోని ఏఎంసీ గోదాములో, బాన్సువాడ డివిజన్‌కు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులు బాన్సువాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ఎల్లారెడ్డి డివిజన్‌కు సంబంధించి బ్యాలెట్‌ బాక్సులు ఎల్లారెడ్డి ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ కళాశాలలో భద్రపరిచారు. స్ట్రాంగ్‌ రూముల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పోలీసు సిబ్బంది విడతల వారీగా 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారు.

27న ఓట్ల లెక్కింపు
మూడు విడతల్లో జరిగిన పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 27న నిర్వహించనున్నారు. మొదటి విడతలో నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్‌ కామారెడ్డి ఏఎంసీ గోదాములో నిర్వహిస్తారు. ఇందులో కామారెడ్డి, దోమకొండ, బీబీపేట్‌, మాచారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్‌, తాడ్వాయి, రాజంపేట్‌ మండలాల కౌంటింగ్‌ జరగనున్నది. భిక్కనూరు మండలానికి చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీకి సంబంధించి బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు నిజాంసాగర్‌రోడ్‌లోని జీవదాన్‌ ఉన్నత పాఠశాలలో భద్రపరిచారు. ఓట్ల లెక్కింపు సైతం అక్కడే నిర్వహించనున్నారు. బాన్సువాడ డివిజన్‌లోని ఏడు మండలాల ఓట్ల లెక్కింపు బాన్సువాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో నిర్వహించనున్నారు. ఎల్లారెడ్డి డివిజన్‌కు సంబంధించి ఓట్ల లెక్కింపు ఎల్లారెడ్డి ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నారు. ఈ నెల 27న ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానున్నది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద బారికేడ్లు, క్యాబిన్లు ఏర్పాటు చేయనున్నారు.

తుది విడత బ్యాలెట్‌ బాక్సులు ఎల్లారెడ్డిలో..
చివరి విడుత పరిషత్‌ ఎన్నికలు మంగళవారం నిర్వహించగా, బ్యాలెట్‌ బాక్సులు ఎల్లారెడ్డిలో భద్రపరిచారు. ఆరు మండలాలలో పోలింగ్‌ ప్రక్రియ పూర్తి కాగానే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులలో వాటిని ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కాలేజి ప్రాంగణానికి తీసుకు వచ్చారు. కాలేజిలో అప్పటికే ఆరు మండలాల బ్యాలెట్‌ బాక్సులు భద్ర పరిచేందుకు వేరువేరుగా కేటాయించిన గదులలో వాటని భద్ర పరిచారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ జరిగిన అనంతరం వాటిని ఆయా మండల పరిషత్‌ కార్యాలయాలకు తీసుకు వచ్చిన పోలింగ్‌ అధికారులు అక్కడ వాటిని సీజ్‌ చేసి అక్కడి నుంచి ఎల్లారెడ్డిలోని డిగ్రీ కాలేజికి తీసుకు వచ్చారు. మూడో విడత ఎన్నికలు జరిగిన ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డి పేట, గాంధారి, నిజాంసాగర్‌, పిట్లం మండలాల నుంచి సుమారు 40 బస్సుల్లో బ్యాలెట్‌ బాక్సులను అధికారులు తీసుకువచ్చారు. ఎల్లారెడ్డి మండలంలోని బ్యాలెట్‌ బాక్సులు సాయంత్రం ఏడు గంటల వరకు డిగ్రీ కాలేజికి చేరుకోగా మిగతా మండలాల బ్యాలెట్‌ బాక్సులు రాత్రి పది గంటలకు చేరుకున్నాయి. జిల్లాలోని 382 పోలింగ్‌ కేంద్రాలలో నిర్వహించిన ఎన్నికలకు సంబంధించిన 764 బ్యాలెట్‌ బాక్సులు ఎల్లారెడ్డిలోని స్ట్రాంగ్‌ రూంకు చేరుకున్నాయి.

గెలుపు ఓటములపై చర్చ
జిల్లాలో పరిషత్‌ ఎన్నికలు మూడు విడతల్లో జరిగాయి. ఈ నెల 6న మొదటి విడత, 10న రెండో విడుత, 14న మూడో విడత ఎన్నికలు ముగిసాయి. పోలింగ్‌ ముగియడంతో అభ్యర్థుల గెలుపోటములపై జోరుగా చర్చ కొనసాగుతున్నది. తమ పార్టీ అభ్యర్థి గెలుపు పొందుతాడని, తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడనే ధీమాలో ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగి రోజులు గడవడంతో గెలుపు, ఓటముల గురించి జోరుగా చర్చ జరుగుతోంది. స్థానిక పోరులో ఎవరు గెలిచిది.. ఎవరు ఓడేది ఈ నెల 27న తేలనున్నది.

గ్రామాల్లో ఓట్ల పండుగ
ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ: పరిషత్‌ ఎన్నికలు గ్రామాల్లో ఓట్ల పండుగను తలపించింది. మంగళవారం తెల్లవారు జామున ఏడు గంటల నుంచే ఓటర్లు బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం పూట పండుగలా... సందడిగా జరిగిన ఓటింగ్‌ ఆ తరువాత నెమ్మదిగా సాగింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఉండడంతో ఓటర్లు ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేశారు. జిల్లాలో చివరి విడతగా జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. గ్రామాల నుంచి పని కోసం పట్నం వెళ్లిన వలస జీవులు రెండు రోజులుగా పల్లెబాట పట్టారు. సోమ, మంగళవారాల్లో వందలాది మంది గ్రామాలకు చేరుకున్నారు. మరి కొన్ని గ్రామాలకు వలస జీవులు ప్రత్యేకంగా ఆటోల్లో ఓటు వేసేందుకు వచ్చారు. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాలకు సుమారు ఆరు వేల మంది వరకు ఓటు వేసేందుకు వచ్చినట్లు సమాచారం. రాజధాని శివారు ప్రాంతాల్లో బతుకు దెరువు కోసం వెళ్లిన వందలాది మంది ఓటు వేసేందుకు రావడంతో చాలా గ్రామాల్లో మరో సారి పండుగ వాతావరణం కనిపించింది.

గ్రామాలకు చేరుకున్న వలస జీవులు
గ్రామాల్లో సరైన పనిలేక రాజధానికి వెళ్లిన వందలాది మంది వలస జీవులు గ్రామాలకు చేరుకున్నారు. ముఖ్యంగా ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాల నుంచి వందలాది మంది వివిధ పనుల కోసం రాజధానికి వెళ్లి అక్కడే ఉంటున్నారు. పరిషత్‌ ఎన్నికల్లో ఓటు వేసేందుకు రావాలని స్థానికంగా పోటీ చేస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఫోన్‌లు చేయడం, అక్కడికి వెళ్లి చెప్పడంతో వందలాది మంది గ్రామాలకు వచ్చారు. వీరంతా మంగళవారం జరిగిన ఓటింగ్‌లో పాల్గొని తమకు నచ్చిన నాయకులకు ఓటు వేశారు. ప్రతి గ్రామం నుంచి వెళ్లిన పదుల సంఖ్యలోని వలసదారులు తిరిగి గ్రామాలకు రావడంతో మరో సారి పల్లెల్లో పండుగ వాతావరణం కనిపించింది.
ఓటు హక్కు వినియోగించుకున్న కొత్త ఓటర్లు
కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019 సంవత్సరానికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. వెంటనే వారికి ఓటు హక్కు రావడంతో చాలా మంది యువతీ, యువకులు ఉదయం పూటనే ఓటు వేసి సంతోషం వ్యక్తం చేశారు.

117
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles