నువ్వా.. నేనా?

Sun,May 12, 2019 12:37 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:కామారెడ్డి జిల్లాలో రాజకీయం రసవత్తంగా మారుతోంది. ఇప్పటికే మొదటి, రెండో దశ పరిషత్ ఎన్నికలు ముగిసినప్పటికీ మండలాల్లో సందడి కొనసాగుతూనే ఉంది. మండల పరిషత్ అధ్యక్ష పీఠంపై కన్నేసిన నేతలు తమకు అనుకూలంగా ఉన్న వారి మద్దతును కూడగట్టే పనిలో పడ్డారు. స్థానిక ఎమ్మెల్యేల మద్దతు, వారి ఆశీస్సులు పొందిన వారంతా ఎంపీటీసీ సభ్యుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగగా ఎంపీపీ ఎన్నిక పరోక్ష పద్ధతిలో ఉంటుంది. ఎక్కువ మంది ఎంపీటీసీ మద్దతు ఎవరికి లభిస్తే వారే మండల పరిషత్ అధ్యక్షుడిగా గెలుస్తారు. పార్టీ నుంచి అనుకూలతలు ఉన్నప్పటికీ పలు చోట్ల ఫలితాల అంచనాలను అనుసరించి నేతలంతా ముందు జాగ్రత్త పడుతున్నారు. మండలంలో ఒక్క ఎంపీటీసీ అభ్యర్థి కూడా ఎవరి ప్రలోభాలకు గురి కాకుండా ఉండేందుకు వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. తమ బలాన్ని అంచనా వేసుకుంటూ ఎలాగైనా మండల పరిషత్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న కసితో ఆశావహులు ఉన్నారు.

రాజకీయ భవిష్యత్తుకు పునాది
రాజకీయ భవిష్యత్తుకు పునాది లాంటిది స్థానిక సంస్థల పదవులు. వీటిని చేపట్టిన నేతల్లో కొందరు రాజకీయంగా ముందడుగు వేయగా, మరికొందరు కనుమరుగైన వారూ ఉన్నారు. రిజర్వేషన్ల కారణంగా అనేక మంది మహిళలు మండల అధ్యక్ష పదవులతో పాటు జడ్పీటీసీ సభ్యులుగా పదవి బాధ్యతలు చేపట్టారు. వీరిలో తిరిగి రాజకీయాల్లో కొనసాగిన వారు తక్కువే. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో గతంలో పనిచేసిన వారిలో సగానికి తక్కువ మందే బరిలో నిలిచారు. జిల్లాలో ఆరో దఫా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటి నుంచే ముఖ్య నాయకగణం మండల పరిషత్ పీఠంపై కన్నేశారు. ఎన్నికలు ముగిసిన చోట గెలుస్తారనుకుంటున్న ఎంపీటీసీ సభ్యులను తమ బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఎన్నికలు జరుగుతున్న మండలాల్లో ముందు నుంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఎంపీపీ పదవిని ఆశిస్తున్న వ్యక్తులైతే ఎన్నికల్లో ఎంపీటీసీలుగా బరిలో నిలిచిన వారికి అన్నీ తానై వ్యవహరించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఐదు సార్లు మండల పరిషత్‌కు ఎన్నికలు జరుగగా అనేక మంది మండలాధ్యక్ష పదవులను దక్కించుకున్నారు. ఇప్పటి వరకు ఐదు దఫాలుగా ఆయా మండలాల నుంచి జడ్పీటీసీ, ఎంపీపీలుగా నేతలు ప్రాతినిథ్యం వహించారు.

మండలాల్లో ఆరో దఫా ఎన్నికలు
స్థానిక సంస్థల పరిపాలన వ్యవస్థకు 32 ఏళ్లు పూర్తి అయ్యాయి. మండల వ్యవస్థ ఏర్పాటైన తర్వాత ఆరో దఫాగా ప్రస్తుతం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మండల వ్యవస్థ ఏర్పడి ఇప్పటి వరకు మూడు దశాబ్దాలు పూర్తవుతుంది. పంచాయతీ సమితి వ్యవస్థను నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మండల వ్యవస్థగా ఏర్పాటు చేశారు. 1987 జనవరి 15న జనాభా ఎక్కువగా ఉన్న గ్రామ పంచాయతీని కేంద్రంగా తీసుకుని మండలంగా పురుడు పోశారు. మండల వ్యవస్థ ఏర్పాటుతో రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర కార్యాలయాలతో పరిపాలన సౌలభ్యం సమకూరింది. మండల వ్యవస్థ ఏర్పాటు అనంతరం స్థానిక సంస్థలు మరింతగా బలోపేతం అయ్యాయి. 1987 నుంచి నేటి వరకు ఐదు దఫాలుగా ప్రాదేశిక ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఆరో దఫా ఎన్నికలు కొనసాగుతున్నాయి. ప్రతి మండలానికి జడ్పీటీసీ, ఎంపీటీసీలు, ఎంపీపీల ఎన్నికలతో మండల వ్యవస్థ పరిపాలన క్రమబద్ధంగా సాగుతోంది. స్థానిక పరిపాలనను బలోపేతం చేసేందుకు తెలంగాణ సర్కారు తెచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మండల ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి పలు నిబంధనలు విధించారు. ఈ చట్టం ద్వారా మండల వ్యవస్థ మరింతగా బలోపేతం కానుంది.

మండల పరిషత్ రిజర్వేషన్లు ఇలా..
జిల్లా కలెక్టర్ సారథ్యంలో ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించారు. ఎంపీటీసీ స్థానాలకు ఆయా రెవెన్యూ డివిజినల్ అధికారుల(ఆర్డీవో) ఆధ్వర్యంలో మండల జనాభా ను ఆధారంగా చేసుకుని రిజర్వేషన్లను వర్తింపజేశారు. జిల్లా పరిషత్ అధ్యక్ష పదవికి రిజర్వేషన్లను రాష్ట్రం యూనిట్‌గా పంచాయతీ రాజ్ క మిషనర్ నిర్ణయించారు. కొత్తగా జిల్లాలు, మం డలాలు ఉద్భవించడంతో వాటికి రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో కాకుండా పంచాయతీరాజ్ చట్టం -2018 ప్రకారం వర్తింపజేశారు. ఇందు లో మహిళలకు 50 శాతం కోటాను కల్పించా రు. ఫలితంగా చాలా చోట్ల పురుషులతో పోలిస్తే వనితలకే అత్యధిక స్థానాలు వరించాయి. జిల్లా ఆవిర్భావం 17 పాత మండలాలతో విస్తరించి ఉండగా పరిపాలన సౌలభ్యం కోసం 5 మండలాలు కొత్తగా ఏర్పాటు చేశారు. మొత్తం 22 మండలాలతో జిల్లా పరిపాలన వ్యవస్థ కొనసాగుతోంది. జిల్లాలో 22 మండలాల్లో ఎస్సీలకు 4 జడ్పీటీసీలు, 4 ఎంపీపీ పదవులు కేటాయించారు. ఎస్టీలకు 2 ఎంపీపీ, 2 జడ్పీటీసీలు, బీసీలకు 5 జడ్పీటీసీలు, 5 ఎంపీపీలు వర్తింపజేశారు. జనరల్ స్థానాల్లో 11 ఎంపీపీలు, 11 జడ్పీటీసీలను కేటాయించారు. కామారెడ్డి జిల్లాలో జడ్పీటీసీ స్థానాలు మహిళలకు 11, పురుషులకు 11 రాగా ఎంపీపీ స్థానాలు మాత్రం మహిళలకు అత్యధికంగా 12, పురుషులకు 10 స్థానాలు వచ్చాయి.

74
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles