ఆదేశాలు ఉన్నా అమలు చేయని అధికారులు

Sun,May 12, 2019 12:35 AM

దేవునిపల్లి శివారులోని వ్యవసాయ భూమికి సంబంధించి న్యాయస్థానం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ దానిని అమలు చేయడంతో రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చిన దేవునిపల్లి సర్వే నంబర్ 95 ఇప్పుడు ఇండ్ల నిర్మాణాలకు పక్కనే ఉండడంతో దాని విలువ లక్షలకు చేరింది. దేవునిపల్లి గ్రామానికి చెందిన ముగ్గురి పేరున ఉన్న 34 గుంటల భూమి విలువ సుమారు కోటి రూపాయలకు చేరింది. సర్వే నంబర్ 95లో నాలుగు ఎకరాల 36 గుంటలు ఉండగా అందులో నుంచి అమ్ముడు పోయిన స్థలం పోగా ఇప్పుడు మిగిలింది కేవలం 34 గుంటలు మాత్రమే. దానికి ముగ్గురు హక్కుదారులు ఉన్నారు.

ఉన్న భూమిని తమ పేరు మీదకు మార్చాలని తహసీల్దార్లకు ఎన్ని సార్లు దరఖాస్తులు పెట్టుకున్నా ఫలితం దక్కలేదని వాపోతున్నారు. 34 గుంటల భూమిని యజమానుల పేరు మీదకు మార్చాలని నాగం బాల రాజవ్వ, రాజయ్య, ఈశ్వరయ్య దరఖాస్తు చేసుకుంటే ఫలితం దక్కక పోవడంతో వారు ఎల్లారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎల్లారెడ్డి కోర్టు ఆదేశాలు వారికి అనుకూలంగా రావడంతో వారు ఆనందం వ్యక్తం చేసినా తహసీల్దార్ దానిని అమలు చేయలేదు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించి కింది కోర్టు ఆదేశాలు అమలు చేయాలనే ఆదేశాలు తీసుకువచ్చారు. హైకోర్టు ఆదేశాలు వచ్చినా తరువాత జిల్లా కలెక్టర్ అనుమతి కావాలని కోరడంతో వారు అప్పట్లో నిజామాబాద్ కలెక్టర్ యోగితా రాణా ఆదేశాలు తీసుకువచ్చారు. కలెక్టర్ ఆదేశాలు సైతం పట్టించుకోకుండా స్థానిక తహసీల్దార్ నాలుగు లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో మరో సారి పని వాయిదా పడింది. కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని తహసీల్దార్ బదిలీపై వెళ్లడంతో బాధితులు జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించారు. ఆయన వెంటనే ఎల్లారెడ్డి తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇదంతా జరిగి సంవత్సరం గడిచినా ఇప్పటికీ వారికి పాస్ పుస్తకంలో మాత్రం నమోదు కాలేదు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles