ఎన్నికల కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి

Sun,May 12, 2019 12:35 AM

బాన్సువాడ రూరల్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని గీతం యూనివర్సిటీలో ఈ నెల 23వ తేదీన చేపట్టనున్న జహీరాబాద్ లోక్‌సభ ఎంపీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ సత్యనారాయణ అధికారులకు సూచించారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని మండల అభివృద్ధి సమావేశ మందిరంలో బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల కౌంటింగ్ సూపర్‌వైజర్స్, అసిస్టెంట్ సూపర్‌వైజర్లకు ఒక్కరోజు శిక్షణ తరగతులను శనివారం నిర్వహించారు. డిజిటల్ తరగతుల ద్వారా వారికి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై ఎన్నికల కౌంటింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈవీఎంలు, వీవీప్యాట్‌ల ఓట్ల లెక్కింపుపై అధికారులకు పలు సూచనలు చేశారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి ఆందోళనకు గురికాకుండా, ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు చేపట్టాలని సూచించారు. ప్రతీ ఈవీఎంలో నమోదైన ఓట్లను ఏజెంట్లకు చూపించి, పోలింగ్ కేంద్రాల్లో పార్టీల వారీగా నమోదైన ఓట్లను రికార్డు చేసుకోవాలని అన్నారు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పుడు సమస్యను రిటర్నింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికల కౌంటింగ్‌కు ఒక రోజు ముందు సంగారెడ్డి వెళ్లేందుకు బాన్సువాడ నుంచి సిబ్బందికి బస్సులు అందుబాటులో ఉంచామని చెప్పారు. రెండు నియోజకవర్గాల అధికారులు సకాలంలో బాన్సువాడకు చేరుకొని బస్సుల్లో సంగారెడ్డికి వెళ్లాలని అన్నారు. అనంతరం ఆర్డీవో రాజేశ్వర్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో అధికారులు నిర్వర్తించాల్సిన విధులపై వివరించారు. శిక్షణ తరగతుల్లో బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలకు చెందిన తహసీల్దార్లు, ఎంపీడీవోలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles