చెల్లింపు వివరాలు వెంటనే ఆన్‌లైన్ చేయాలి

Fri,May 10, 2019 02:35 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : ధాన్యం కొనుగోలు, చెల్లింపులకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని, చెల్లింపులకు ఆలస్యం చేయవద్దని కలెక్టర్ సత్యనారాయణ ప్రాథమిక సహకార సంఘాల సీఈవోలను, పీపీసీ ఇన్‌చార్జిలను, క్లస్టర్ ఇన్‌చార్జిలను ఆదేశించారు. గురువారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కల్పించిన సౌకర్యాలు, ఆన్‌లైన్ అప్‌లోడ్ తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల పనితీరుపై ఆకస్మిక తనిఖీ చేపడుతామని అన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున కొనుగోలు కేంద్రాల వద్ద తప్పనిసరిగా టెంట్ వసతి, చల్లని తాగునీరు ఏర్పాటు చేయాలని, హమాలీలకు మజ్జిగ అందించాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన, తీసుకోకూడని పనులను తెలియజేసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొనుగోళ్లకు సంబంధించి ఆన్‌లైన్ అప్‌లోడ్ వెంటనే చేయాలని, చెల్లింపులు వేగిరం చేయాలని తెలిపారు. రవాణా కాంట్రాక్టర్లు, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, వారి చెల్లింపుల్లో నిబంధనల మేరకు కోత విధించడం, చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఏదైనా సమస్య వస్తే తహసీల్దార్లు, పై అధికారులకు తెలుపాలని అన్నారు. రవాణా శాఖ అధికారుల సహాయం తీసుకోవాలని సూచించారు. కాంటా ఎత్తగానే రైతు బాధ్యత అయిపోతుందని, రైతును ఉంచుకోకుండా వెంటనే పంపించి వేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు జిల్లాలో నియమించబడిన ఐదుగురు రవాణా కాంట్రాక్టర్లు కూడా రైతు శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని రవాణా చేపట్టాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ యాదిరెడ్డి, డీసీవో మమత, డీఎస్‌వో కొండల్‌రావు, డీఎం సివిల్ సప్లయ్ ఇర్ఫాన్, తహసీల్దార్లు, రైస్ మిల్లర్స్ ప్రతినిధులు, రవాణా కాంట్రాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles