సమర్థవంతంగా నిర్వహించాలి

Fri,May 10, 2019 02:35 AM

నమస్తేతెలంగాణ: దోస్త్-2019 సహాయక కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని దోస్త్ కన్వీనర్ ఆచార్య ఆర్.లింబాద్రి అన్నారు. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే దోస్త్-2019 ఆన్‌లైన్ అడ్మిషన్ల కోసం గురువారం కలెక్టర్ కార్యాలయంలో దోస్త్ కన్వీనర్ ఆచార్య ఆర్.లింబాద్రి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య ఆర్.లింబాద్రి మాట్లాడుతూ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్, కళాశాల, కోర్సుల ఎంపిక, ఫీజు చెల్లింపు వివరాలకు సంబంధించి తగిన సూచనలు తెలియజేశారు. ఈ సంవత్సరం దోస్త్ విధానం మరింత సులభతరంగా ఉంటుందని సహాయ కేంద్రాల సంఖ్య పెంచామని అన్నారు. ఉమ్మడి పది జిల్లాల సహాయ కేంద్రాలను ప్రత్యేక కేంద్రాలుగా మార్చామని, ఏ విద్యార్థి కూడా హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రత్యేక సహాయ కేంద్రాల్లో బయోమెట్రిక్, ఐరిస్ యంత్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. అదనంగా టెక్నికల్ కోఆర్డినేటర్‌ను నియమించామని, విద్యార్థులకు కళాశాల ఎంపిక, ఫీజు చెల్లింపు విధానం పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా ఉంటుందని అన్నారు. కళాశాల, కోర్సుల మార్పులు ైస్లెడింగ్ ద్వారా చూసుకోవాలని సూచించారు. సీటు రిజర్వు చేసుకోవడానికి 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. మొదటి దశలో వచ్చిన సీటును రిజర్వు చేయకపోతే రద్దు అవుతుందని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి అని, ఈ సంవత్సరం ఫీజులు టీఎస్ వాలెట్ ద్వారా కూడా చెల్లించవచ్చునని అన్నారు. విద్యార్థులు తమ అకౌంట్ ద్వారా డబ్బులు చెల్లిస్తే తిరిగి చెల్లించేందుకు సులభమని అన్నారు.

విద్యార్థులు తమ మొబైల్ ద్వారా లేదా సహాయక కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సమాచారం భద్రంగా ఉంటుందని, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదును సరిచూసుకోవాలని సూచించారు. విద్యార్థుల మొబైల్ నంబర్ మార్చాలనుకుంటే సహాయక కేంద్రాలను సంప్రదించాలని, విద్యార్థులు తమ మొబైల్‌కు వచ్చే ఓటీపీ నంబర్‌ను ఎవరికీ చెప్పవద్దని అన్నారు. ప్రైవేటు కళాశాలలు ఏవైనా అక్రమ పద్ధతులకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో టీయూ దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ కొండ రవీందర్‌రెడ్డి, గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ దుబ్బరాజం, ఆర్మూర్, బోధన్, మోర్తాడ్, బాన్సువాడ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాల్స్ వేణుగోపాలస్వామి, రంగరత్నం, పెద్దన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles