నేడే రెండో విడత..!

Fri,May 10, 2019 02:34 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లాలోని ఏడు మండలాల్లోని పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి. పోలింగ్ సామగ్రితో కేంద్రాలకు సిబ్బం ది ఇప్పటికే చేరుకోగా శుక్రవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలిం గ్ జరుగనుంది. ఒక్కో మండలానికి ఒక్కో నోడల్ ఆఫీసర్‌ను నియమించారు. వారి పర్యవేక్షణలోనే సామగ్రి పంపిణీ జరుగగా, ఎన్నికల ప్రక్రియ కూడా సాఫీగా పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి 400 మంది ఓటర్లు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు ఐదుగురు సిబ్బందిని, 400 మంది ఓటర్లు మించిన చోట ఆరుగురు సిబ్బందిని కేటాయించారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగుల కోసం ఒక వీల్ చైర్‌ను అందుబాటులో ఉంచారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, మారణాయుధాలు, నీళ్ల బాటిళ్లు వంటివేవి అనుమతించకుండా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఓటు హక్కు వినియోగం రహస్యంగా జరగాలని, ఎవరూ సెల్‌ఫోన్, వీడియో తీయరాదని అధికారులు కోరుతున్నారు. ఓటు వేసేటప్పుడు ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తే ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఓటర్లు నిర్ణీత సమయంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకొని వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం పోలింగ్ అధికారులు క్రమ పద్ధతిలో సామగ్రిని రిసెప్షన్ కౌంటర్లలో అందజేస్తారు. ఇందుకోసం అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

విధుల్లో 2,939 మంది ఉద్యోగులు...
రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఏడు మండలాల్లో జరిగే పోలింగ్‌లో 2,939 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించనున్నారు. ఇందులో 511 మంది ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, 511 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది 1917 కలుపుకొని మొత్తం సిబ్బంది 2939 మంది విధులు నిర్వర్తించనున్నారు. పోలింగ్ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు 35 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 12 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 400 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 111 కాగా 400 మందికి పైగా ఓటర్లు గల పోలింగ్ కేంద్రాలు 315 ఏర్పాటు చేశారు. రెండో విడతలో అత్యధికంగా మద్నూర్ మండలంలో 42,973 మంది ఓటర్లు ఉండగా 91 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బిచ్కుందలో 38,547 మంది ఓటర్లకు 76 పోలింగ్ బూత్‌లు, జుక్కల్‌లో 32,828 మంది ఓటర్లకు 74 పోలింగ్ కేంద్రాలు, బాన్సువాడలో 27,528 మంది ఓటర్లకు 65 పోలింగ్ కేంద్రాలు, నస్రుల్లాబాద్‌లో 20,028 మంది ఓటర్లకు 45 పోలింగ్ బూతులున్నాయి. బీర్కూర్‌లో 18,738 మంది ఓటర్లకు 41 పోలింగ్ బూత్‌లు, పెద్దకొడప్‌గల్‌లో 15,071 మంది ఓటర్లకు 34 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఎన్నికల నియమావళి పాటించాలి..
రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియ కూడా పూర్తి చేసినట్లు ఆయన గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 7 మండలాల్లో జరుగనున్న ఎన్నికలకు పటిష్టవంతమైన చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలంతా ఓటు వేసేందుకు స్వచ్ఛందంగా పోలింగ్ బూత్‌లకు తరలి రావాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది వజ్రాయుధంతో సమానమని గుర్తు చేశారు. ఓటును వృథా చేసుకోకూడదని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, మారణాయుధాలు, నీళ్ల బాటిళ్లు, ఇతర ఏ వస్తువులు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళి ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles