ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది

Thu,May 9, 2019 12:58 AM

-రెండోవిడత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం
-కలెక్టర్ సత్యనారాయణ
-ఓటుహక్కు వినియోగించుకోనున్న 1.95 లక్షల ఓటర్లు

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ అన్నారు. బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో ఎస్పీ శ్వేతారెడ్డితో కలిసి బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 10వ తేదీన నిర్వహించనున్న రెండో విడత ప్రాదేశిక ఎన్నికల వివరాలను వెల్లడించారు. అసెంబ్లీ, పార్లమెంట్, సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని వర్గాలు సహకరించాయని... జరగనున్న రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

68 ఎంపీటీసీ, 7 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు..
రెండో విడత ఎన్నికల్లో 77 ఎంపీటీసీ స్థానాలు, 7 జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా... 9 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. మిగిలిన 68 స్థానాలకు, 186 మంది బరిలో ఉన్నారని చెప్పారు. ఇందులో 26 మంది స్వతంత్ర అభ్యర్థులు 77 మంది టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు, 68 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, 15 మంది బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారని వివరించారు. 7 జడ్పీటీసీ స్థానాలకు 23 మంది బరిలో ఉన్నారని తెలిపారు. 7 టీఆర్‌ఎస్, 7 కాంగ్రెస్, 5 బీజేపీ, 2 రికగ్నయిజేషన్ పార్టీల అభ్యర్థులు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారని వివరించారు.

1,95,713 మంది ఓటర్లు....
రెండో విడతలో మొత్తం లక్షా 95 వేల 713 మంది ఓటర్లు ఉన్నారని, వారికి ఇప్పటికే గ్రామాల్లో ఫొటోతో కూడిన ఓటరు స్లిప్పులను పంపిణీ చేసినట్లు చెప్పారు. రెండో విడత ఎన్నికల్లో మొత్తం 426 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో 400 మంది ఓటర్ల లోపు ఉన్న పోలింగ్ కేంద్రాలు 111 ఉన్నాయని, 400 పైబడి ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 315 ఉన్నాయని వివరించారు. 400 లోపు ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఒక ప్రిసైడింగ్ అధికారితో పాటు నలుగురు పోలింగ్ సిబ్బంది, 400 మంది ఓటర్లకు పైబడి ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఒక ప్రిసైడింగ్ అధికారితో ఐదుగురు సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి ఇప్పటికే రెండు సార్లు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద టెంటు, తాగునీరు, హెల్త్‌డెస్కు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయని... సిబ్బంది, ఓటర్లు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ప్రతి ఒక్కరూ సహకరించాలి...
గత ఎన్నికల్లో జరిగిన మాదిరిగానే ఈ ఎన్నికలు సైతం ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ శ్వేతారెడ్డి కోరారు. రెండో విడతలో 426 పోలింగ్ కేంద్రాల్లో, 177 లోకేషన్స్‌లో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఇప్పటికే పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎన్నికల్లో పాల్గొనే పోలీసు సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులు, శాంతి భద్రతల పరిరక్షణ తదితర అంశాలపై ఇప్పటికే శిక్షణ ఇచ్చామని చెప్పారు. గ్రామాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించామని తెలిపారు. ఇప్పటికే బైండోవర్లు చేశామని తెలిపారు. రెండో విడత ఎన్నికల నిర్వహణకు సుమారు వెయ్యి మంది పోలీస్ సిబ్బందిని నియమించామని వెల్లడించారు. రెస్క్యూ టీములు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ యాదగిరి, ఏపీడీ సాయన్న, ఆర్డీవో రాజేశ్వర్, డీఏవో గంగాధర్, ఎంపీడీవో మహ్మద్ సూఫీ, ఈవోపీఆర్డీ బషీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles